ఏమీ కలపాల్సిన పనిలేదు - ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే ప్రతి "పూరీ" పొంగుతుంది!
- పూరీలు ఇలా ప్రిపేర్ చేసుకోండి! - చాలా చక్కగా పొంగుతాయి!

Published : June 23, 2025 at 3:01 PM IST
How to Make Poori at Home : పూరీ పేరు చెప్పగానే ఫుడ్స్ లవర్స్‌కు మౌత్ వాటరింగ్ అయిపోద్ది. వేడి వేడి పూరీని నచ్చిన కర్రీలో ముంచుకుని తింటుంటే ఆ కిక్కే వేరు. పూరీ తినడానికి బానే ఉన్నా, చేయడమే అందరికీ రాదు. ఎందుకంటే హోటల్స్‌లో పొంగినట్లు, ఇంట్లో చేస్తే పొంగదు. దీంతో కొన్ని సార్లు కరకరలాడుతా ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు అందులో పంచదార, బొంబాయి రవ్వ వంటివి కూడా కలుపుతుంటారు. కానీ మీకు తెలుసా? ఇవేమీ వేయకుండా ఎప్పుడూ చేసేలా చేసినా పూరీలు చక్కగా పొంగుతాయి. కాకపోతే చేసేటప్పుడు ఇప్పుడు చెప్పే టిప్స్ పాటిస్తే సరి. మరి లేట్ చేయకుండా పూరీలు ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- గోధుమపిండి - 2 కప్పులు
- ఉప్పు - సరిపడా
- నూనె - 2 టీస్పూన్లు

తయారీ విధానం:
- ఓ బౌల్లోకి గోధుమపిండిని జల్లించి తీసుకోవాలి. ఆపై అందులోకి ఉప్పు, నూనె వేసి కలుపుకోవాలి.
- పిండి మొత్తానికి నూనె పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపిన తర్వాత కొద్దిగా పట్టుకుని చూస్తే పొడిపొడిగా ఉండాలి.
- ఇప్పుడు వాటర్‌ను కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇక నీళ్లు సరిపోయాయి అనుకున్న తర్వాత పిండిని వీలైనంత కలుపుతూ సాఫ్ట్ ముద్ద వచ్చేలాగా చేసుకోవాలి.
- ఇలా కలిపిన పిండిపై మూత పెట్టి పక్కన పెట్టాలి. ఓ 10 నిమిషాల తర్వాత పిండిని మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాగేలోపు పూరీలు ప్రిపేర్ చేసుకోవాలి.
- అందుకోసం ఓ ఉండను తీసుకుని లైట్‌గా ఆయిల్లో ముంచి చపాతీ పీట మీద ఉంచి గుండ్రంగా, ఒకే మందంలో పూరీలుగా వత్తుకోవాలి.
- నూనె బాగా కాగిన తర్వాత తయారు చేసుకున్న పూరీని వేసి గరిటెతో లైట్‌గా ప్రెస్ చేస్తూ అంటే పూరీ నూనెలో మునిగేలా చేస్తే అన్నివైపులా సమానంగా ఉబ్బుతుంది.
- ఇలా పూరీ ఓ వైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి.
- మిగిలిన ఉండలను కూడా పూరీలుగా వత్తుకుని నూనెలో కాల్చుకోవాలి.
- ఇలా కాల్చుకున్న వాటిని నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే పూరీలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- పిండిని కలపడంలోనే పూరీలు పొంగేది, లేనిది తెలిసిపోతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ సేపు కలుపుకోవాలి.
- పొడి పిండి చల్లుకుంటూ కూడా పూరీలుగా వత్తుకోవచ్చు. కానీ పూరీపై పిండి నిలిచి నూనెలో వేసినప్పుడు కలర్ మారే అవకాశం ఉంటుంది.
- పూరీని మరీ పల్చగా వత్తుకుంటే మధ్యలో రంధ్రాలు పడి నూనె పీల్చుకుంటుంది. అదే మందంగా చేస్తే లోపల పిండి సరిగ్గా కాలదు. కాబట్టి మీడియం థిక్నెస్లో పూరీ అంతా ఒకే సైజ్ వచ్చేలా రోల్ చేసుకోవాలి.
- పూరీలను కాల్చుకునేందుకు నూనె బాగా కాగే ఉండాలి. నూనె ఏ మాత్రం కాలకపోయినా పూరీలు నూనె పీల్చుకుంటాయి. అలాగే పూరీలను కాల్చేటప్పుడు కూడా మంటను మీడియం టూ హై ఫ్లేమ్‌లోనే పెట్టాలి.
మినప్పప్పుతో "గులాబ్ జామున్" - ఇలా చేస్తే పిండి చక్కగా ఉడికి, జ్యూసీజ్యూసీగా ఉంటాయి!
స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు - 5 నిమిషాల్లోనే వేడివేడి "స్నాక్స్" - సొరకాయ ఉంటే చాలు!

