టిఫెన్ సెంటర్ స్టైల్ "అల్లం చట్నీ" - పక్కా కొలతలతో మూడు నెలలు నిల్వ!
- ఇలా చేస్తే టిఫెన్ కన్నా చట్నీ నాకేస్తారు! - అన్నంలోకి కూడా బాగుంటుంది!

Published : September 10, 2025 at 5:23 PM IST
Hotel Style Allam Pachadi : పల్లీ చట్నీ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ మంది తినడానికి ఇష్టపడే వాటిలో అల్లం పచ్చడి ఒకటి. ఈ చట్నీకి జనాలలో మంచి క్రేజ్ కూడా ఉంటుంది. అయితే చాలా మంది ఇంట్లో అల్లం పచ్చడి చేస్తుంటారు. కానీ, టిఫెన్ సెంటర్ స్టైల్ రుచి మాత్రం అందరికీ రాదు. అలాంటివారు ఓసారి ఈ కొలతలతో "అల్లం చట్నీ" చేసుకొని చూడండి. పర్ఫెక్ట్గా కుదరడమే కాకుండా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది! పైగా దీని తయారీ కోసం ఎక్కువ టైమ్ కేటాయించాల్సిన పనిలేదు. అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- అల్లం - 50 గ్రాములు
- చింతపండు - 50 గ్రాములు
- మెంతులు - 1 టీస్పూన్
- వెల్లుల్లి - 25 గ్రాములు
- ఉప్పు - 30 గ్రాములు
- కారం - 30 గ్రాములు
- బెల్లం - 50 గ్రాములు
- పసుపు - పావు టీస్పూన్
తాలింపు కోసం:
- నూనె - అర కప్పు(120 ml)
- శనగపప్పు - 1 టేబుల్‌స్పూన్
- ఆవాలు - 1 టేబుల్‌స్పూన్
- మినప్పప్పు - 1 టేబుల్‌స్పూన్
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 10
- ఎండుమిర్చి - 4
- ఇంగువ - చిటికెడు
- కరివేపాకు - గుప్పెడు

తయారీ విధానం:
- ముందుగా అల్లంపై పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ప్లేట్ లేదా కాటన్ క్లాత్ మీద వేసి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి.
- ఈలోపు ఓ గిన్నెలోకి నారలు, గింజలు లేని చింతపండు తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత చింతపండులోకి పావులీటర్ వాటర్ పోసుకోవాలి.
- చింతపండు గిన్నెను స్టవ్ మీద పెట్టి లో టూ మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- చింతపండు పర్ఫెక్ట్గా ఉడికిన గిన్నెను దింపి పక్కన పెట్టాలి. అదే స్టవ్ మీద కడాయి పెట్టి మెంతులు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి.

- మెంతులు వేగిన తర్వాత వాటిని ఉడికించిన చింతపండు మిశ్రమంలో వేసి కలిపి చల్లార్చుకోవాలి.
- అదే పాన్‌లోకి 1 టేబుల్‌స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో కట్ చేసిన అల్లం ముక్కలు వేసి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి.
- అల్లం ముక్కలు వేగిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాన్‌లోకి మిగిలిన అంటే అర కప్పు నూనెను పోసుకుని వేడి చేసుకోవాలి.
- ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
- తాలింపు గింజలు మగ్గిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి మరో నిమిషం వేయించాలి.
- ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివరగా కరివేపాకు, ఇంగువ వేసి కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి.

- మిక్సీజార్‌లోకి చల్లారిన చింతపండు మిశ్రమం, వేయించిన అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి ఉప్పు, కారం, బెల్లం తురుము, పసుపు వేసి ఎంత వీలైతే అంత స్మూత్‌గా వచ్చేవరకు మధ్యమధ్యలో గ్రైండ్ చేసుకోవాలి.
- పచ్చడిని మెత్తగా రుబ్బుకున్న తర్వాత ముందే ప్రిపేర్ చేసుకున్న తాలింపులో వేసి కలిపి తడి లేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేస్తే సరి. ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ. ఇది బయట అయితే రెండు నెలలు, ఫ్రిజ్‌లో అయితే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది.

చిట్కాలు:
- అల్లం ఎంత తీసుకుంటే అదే కొలత ప్రకారం చింతపండు, బెల్లం తీసుకోవాలి. అప్పుడే పచ్చడి రుచికరంగా ఉంటుంది.
- గ్రైండ్ చేసిన పచ్చడిని తాలింపులో కలిపేటప్పుడు తాలింపు అనేది పూర్తిగా చల్లారాలి. వేడి మీద అయితే పాడయ్యే అవకాశం ఉంటుంది.
అమ్మమ్మల నాటి "మినప పులుసు" - అన్నంలోకి పుల్ల పుల్లగా, తియ్యగా భలే ఉంటుంది!
పచ్చిమిర్చితో ఘుమఘుమలాడే "దొండకాయ వేపుడు" - పిల్లలూ ఇష్టంగా తింటారు!

