Homemade Mango Fruit Jam: "బ్రెడ్ - జామ్" ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రెడ్ మధ్యలో నచ్చిన ఫ్రూట్ జామ్‌ను అప్లై చేసుకుని పిల్లలు ఇష్టంగా తింటుంటారు. కేవలం బ్రెడ్ మీదనే కాకుండా దోశ, చపాతీ వంటి మధ్యలో కూడా ఇది అప్లై చేసి రోల్ చేసుకుని తింటుంటారు. కేవలం పిల్లలు మాత్రమే కాకుండా కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు టిఫెన్ చేసే టైమ్ లేనప్పుడు ఈ కాంబినేషన్‌ను ఎక్కువగా ట్రై చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఎక్కువ మొత్తం జామ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటారు. అయితే బయట మార్కెట్లో లభించే జామ్స్‌లో షుగర్ సహా ఎక్కువ మొత్తంలో ప్రిజర్వేటివ్స్ కలిపే అవకాశం ఉంటుంది. దీంతో అది తినడం వల్ల ఆరోగ్య సమస్యలకు ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. మరి మాకు రాదు అంటారా? అందుకే మీకోసం రెసిపీ తీసుకొచ్చాం. పిల్లలకు నచ్చే మామిడిపండ్లతో టేస్టీగా ఉండే జామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మ్యాంగో జామ్ ఎలా తయారు చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- మామిడిపండ్లు - అర కేజీ
- పంచదార - ముప్పావు కప్పు
- నిమ్మరసం - అర చెంచా

తయారీ విధానం:
- మామిడిపండ్లను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఈ ముక్కలను మిక్సీజార్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టి గ్రైండ్ చేసిన మామిడి గుజ్జును వేసుకోవాలి.
- హై ఫ్లేమ్‌లో సుమారు 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.

- మామిడి గుజ్జు ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత పంచదార వేసి కలుపుతూ ఉడికించాలి. పంచదార కరిగే కొద్దీ మిశ్రమం కాస్త పల్చబడుతుంది.
- మంటను సిమ్‌లో పెట్టి జామ్ గట్టిపడే వరకు కలుపుతూ ఉడికించండి. మ్యాంగో మిశ్రమం ఉడికి జామ్లా తయారవడానికి పావుగంటపైనే సమయం పడుతుంది.

- జామ్ ఉడికిన తర్వాత నిమ్మరసం పిండి ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా తీసుకుని ఓ ప్లేట్లో వేస్తే అది జారకుండా ఉంటే జామ్ తయారైనట్లే. ఒకవేళ మ్యాంగో మిశ్రమం జారితే ఇంకాసేపు ఉడికించాలి.
- జామ్ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. జామ్ పూర్తిగా చల్లారిన తర్వాత, తడి లేని, గాలి చొరబడని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మ్యాంగో జామ్ రెడీ.

- దీన్ని ఫ్రిజ్‌లో ఉంచితే ఒక 3 నుంచి 4 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఈ మ్యాంగో జామ్ బ్రెడ్, చపాతీ, పూరీ లేదా దోశతో చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- జామ్ కోసం బాగా పండిన, తీయని మామిడిపండ్లను ఎంచుకోండి.అప్పుడు జామ్ మరింత రుచిగా ఉంటుంది.
- మామిడిపండు తీపిని బట్టి పంచదార పెంచడం, తగ్గించడం చేసుకోవాలి. సాధారణంగా మూడు కప్పుల మామిడి పండు గుజ్జుకు కప్పు నుంచి కప్పున్నర పంచదార సరిపోతుంది.
- చివరగా కొద్దిగా యాలకుల పొడి కలపడం వల్ల జామ్‌కు మంచి సువాసన వస్తుంది.
- జామ్‌ను తీసేటప్పుడు ఎప్పుడూ పొడి స్పూన్‌ను మాత్రమే ఉపయోగించండి. తడిగా ఉన్న చెంచా పెడితే జామ్ తొందరగా పాడవుతుంది.
కరకరలాడే "మూంగ్ దాల్" బయట కొనాల్సిన పనిలేదు - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి!
జొన్న పిండితో హెల్దీ పూరీలు - మైదా లేకుండానే టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి!