Make Malai Laddu at Home in Easy Steps : స్వీట్ రెసిపీలలో లడ్డూది ప్రత్యేక స్థానం. ఈ పేరు వినగానే చాలా మందికి నోరూరిపోతుంది. లడ్డూ దేనితో చేసినదైనప్పటికీ ఆ పేరులోనే ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అది దేవుని ప్రసాదం అవ్వొచ్చు, స్వీట్ షాప్‌లో అమ్మేదైనా, ఇంట్లో చేసేదైనా కావొచ్చు. ఏదైనా లడ్డూ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టపడుతుంటారు. అయితే, చాలా మంది ఏదైనా లడ్డూ చేయాలంటే తయారీకి బోలెడన్ని పదార్థాలు కావాలి? ప్రిపరేషన్ కూడా కాస్త టైమ్‌తో కూడుకున్నదిగా భావిస్తుంటారు. కానీ, మీకు తెలుసా? రెండే రెండు పదార్థాలతో కమ్మని మలై లడ్డూలు తయారు చేసుకోవచ్చు. అది కూడా ప్రొటీన్ పుష్కలంగా ఉండే పాలు, ఐరన్ సమృద్ధిగా ఉండే బెల్లం ఇందుకు అవసరం పడుతాయి. ఈ లడ్డూలు టేస్ట్‌లో మంచి మధురానుభూతిని అందిస్తాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. మరి, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- చిక్కటి పాలు - లీటరున్నర
- నిమ్మరసం - 2 టేబుల్‌స్పూన్లు(పనీర్ కోసం)
- బెల్లం - అర కప్పు
- నెయ్యి - 1 టీస్పూన్(ఆప్షనల్)
సింపుల్‌గా తయారు చేసుకోండిలా :
- ఈ హెల్దీ స్వీట్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో పాలు పోసుకోవాలి.
- ఆపై స్టవ్ ఆన్ చేసి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇందుకోసం 5 నుంచి 10 నిమిషాల సమయం పట్టొచ్చు.
- పాలను ఆవిధంగా మరిగించుకున్నాక అందులో నిమ్మరసం వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి.
- దాంతో పాలు విరిగిపోతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అనంతరం ఒక గిన్నెలో జాలీ గంటె ఉంచి దానిపై ఒక శుభ్రమైన పల్చని క్లాత్ వేసి విరిగిన పాల మిశ్రమాన్ని అందులోకి వడకట్టుకోవాలి.
- అదే, సమయంలో ఓసారి చల్లటి నీళ్లను వడ్డకట్టుకున్న మిశ్రమంపై పోసి కడగాలి. ఇలా చేయడం ద్వారా పనీర్‌లో ఏమైనా పులుపుదనం ఉంటే పోతుంది.
- అనంతరం ఆ మిశ్రమాన్ని నీళ్లంతా పోయేలా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి.
- అయితే, ఇలా ఇంట్లో పనీర్‌ని ప్రిపేర్ చేసుకోలేని వారు బయట మార్కెట్లో దొరికే స్వచ్ఛమైన పనీర్‌ని ఈ లడ్డూ రెసిపీ కోసం వాడుకోవచ్చు.

- ఇప్పుడు వాటర్ పిండుకున్న పనీర్‌ని ఒక ప్లేట్లో వేసి కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత పలుకులుగా ఉన్న పనీర్‌ని మెత్తగా(చపాతీ పిండిలా) అయ్యేలా చేతితో మెదుపుతూ పది నిమిషాల పాటు కలుపుకోవాలి.
- పనీర్‌ను చపాతీ పిండిలా మెత్తగా మిక్స్ చేసుకున్నాక దాన్ని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని బెల్లం తురుమును వేసి వేడి చేయాలి. బెల్లం కొద్దిగా కరగడం స్టార్ట్ అయ్యాక అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పనీర్ ముద్దను వేసుకొని సన్నని సెగ మీద రెండు పూర్తిగా కలిసే వరకు కుక్ చేసుకోవాలి. ఇందుకోసం సుమారు 10 నిమిషాల పాటు సమయం పట్టొచ్చు.

- ఈ స్వీట్ పూర్తిగా రెడీ అయ్యేలోపు స్టవ్‌ను లో ఫ్లేమ్ మీదనే ఉంచి ప్రిపేర్ చేసుకోవాలి.
- బెల్లం పూర్తిగా కరిగి, పనీర్‌లోని తేమంతా బయటకు వచ్చి మిశ్రమం జారుగా అవుతుంది.
- ఈ స్టేజ్‌లో నెయ్యిని వేసుకొని మరోసారి మిశ్రమం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నెయ్యిని ఇక్కడ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాం. కాబట్టి, మీరు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు.
- అనంతరం లో ఫ్లేమ్ మీద ఆ మిశ్రమంలోని తేమంతా పోయి, నెయ్యి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- పనీర్ మిశ్రమం పూర్తిగా చల్లారాక చేతితో ఒకసారి బాగా కలిపి మీకు కావాల్సిన పరిమాణంలో ఉండలు చుట్టుకోవాలి.
- ఆ తర్వాత లడ్డూలపై సన్నగా తరుకున్న బాదం, కాజు, కుంకుమ పూలరేకలతో గార్నిష్ చేసుకుంటే సరి. అంతే, ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తినే హెల్దీ అండ్ టేస్టీ "మలై లడ్డూలు" రెడీ అయిపోయినట్లే!

ఈ టిప్స్‌తో పర్ఫెక్ట్ టేస్ట్ :
- ఇక్కడ మీరు నిమ్మరసానికి బదులుగా వెనిగర్‌ని అయినా తీసుకోవచ్చు.
- ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పనీర్ కోసం వెన్న తీయని పాలను వాడుకోవాలి. అప్పుడే పనీర్ చక్కగా వస్తుంది.
- లడ్డూలు మంచి రుచితో రావాలంటే పనీర్‌ని ఎంత సాఫ్ట్‌గా మిక్స్ చేసుకుంటే అంత రుచికరంగా వస్తాయి.
- తీపి ఎక్కువ తినే వారు ఇక్కడ చెప్పిన పరిమాణం కంటే బెల్లాన్ని కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు.

పిల్లలకు మంచి బలాన్నిచ్చే "క్యారెట్ రవ్వ లడ్డూలు" - పాకంతో పని లేకుండా పావుగంటలో రెడీ!
పాలు, షుగర్ లేకుండా "రవ్వ లడ్డూ" తయార్ - ఇదే ఈ రెసిపీ సీక్రెట్! - అమ్మా ఇంకో లడ్డూ అంటారు!