How to Make Jalebi without Maida : జిలేబీ ఈ పేరు చెప్పగానే చాలా మంది నోరూరిపోతుంది. ఇక స్వీట్ లవర్స్కైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా, బయట క్రిస్పీగా ఉండే ఈ స్వీట్‌ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, ఎక్కువ మంది జిలేబీ ప్రిపేర్ చేసుకోవడానికి మైదాను వాడుతుంటారు. కానీ, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే, మీకోసం మైదా వాడకుండానే ప్రిపేర్ చేసుకునేలా ఒక బ్రహ్మాండమైన "జిలేబీ రెసిపీని" తీసుకొచ్చాం. ఇక టేస్ట్ విషయానికొస్తే బయట స్వీట్ షాప్స్‌లో అమ్మే దానికి ఏమాత్రం తక్కువ కాదు! ఒక్కసారి రుచి చూశారంటే ఎప్పుడు స్వీట్ కావాలన్నా దీనికే మొదటి ఓటు వేస్తారు. పైగా ఈ జిలేబీలను చాలా తక్కువ సమయంలో అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా రెడీ చేసుకోవచ్చు. ఇందుకోసం అవసరమయ్యే పదార్థాలు కూడా తక్కువే. మరి, ఈ నోరూరించే జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

టిప్స్‌తో మరింత రుచికరం :
- ఈ రెసిపీ కోసం మీరు పంచదారకు బదులుగా బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది.
- కుంకుమ పువ్వు లేనట్లయితే దాని ప్లేస్‌లో యెల్లో ఫుడ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు.
- జిలేబీ ప్రిపేర్ చేసుకోవడానికి సాస్ బాటిల్ లేదా పైపింగ్ బ్యాగ్ వంటివి వాడుకోవచ్చు.
- జిలేబీలు మరీ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోకుండా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసుకుంటే సరిపోతుంది.

తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- బొంబాయి రవ్వ - ఒక కప్పు
- పంచదార - ఒకటిన్నర కప్పులు
- కుంకుమ పువ్వు - చిటికెడు
- యాలకుల పొడి - పావు టీస్పూన్
- నిమ్మరసం - అర చెక్క
- పులిసిన పెరుగు - అర కప్పు
- వంటసోడా - పావుటీస్పూన్
- నూనె - వేయించడానికి తగినంత

ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా :
- ఈ జిలేబీ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నె ఉంచి అందులో పంచదార, ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి చక్కెర పూర్తిగా కరిగే వరకు మరిగించుకోవాలి.
- పంచదార పూర్తిగా కరిగిన తర్వాత అందులో కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసుకొని పాకాన్ని మరిగించుకోవాలి.
- ఇక్కడ పాకం అనేది మరీ ముదిరిపోకుండా, లేతగా స్టిక్కీగా ఉండేటట్లు చూసుకోవాలి.
- కావాల్సిన కన్సిస్టెన్సీలో పాకం రెడీ అయ్యాక అందులో నిమ్మరసం పిండుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆపై ఆ గిన్నెను దించి పక్కనుంచాలి.
- పాకంలో ఇలా నిమ్మరసం పిండుకోవడం ద్వారా అది చల్లారిన కూడా గట్టిగా అవ్వకుండా ఉండడానికి తోడ్పడుతుంది.

- ఇప్పుడు మిక్సీ జార్లో బొంబాయి రవ్వను వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి.
- అనంతరం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న మెత్తని బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత దానిలో తరకలు లేకుండా బీట్ చేసుకున్న పులిసిన పెరుగును వేసుకొని రవ్వ మొత్తం చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆపై తగినన్ని నీటిని కొద్దికొద్దిగా వేసుకుంటూ మరీ లూజుగా, గట్టిగా కాకుండా పిండిని కలుపుకోవాలి. తర్వాత గిన్నెపై మూతపెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కనుంచాలి.
- అనంతరం మూత తీసి అందులో వంట సోడా వేసుకొని మరోసారి విస్కర్ సహాయంతో బాగా బీట్ చేసుకోవాలి.

- ఇప్పుడు జిలేబీ ప్రిపేర్ చేసుకోవడానికి పైపింగ్ బ్యాగ్ లేదా సాస్ బాటిల్ వాడుకోవచ్చు. అవి లేకపోతే పాల ప్యాకెట్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక వైపు పెద్దగా కట్ చేసుకోవాలి.
- ఆపై కట్ చేసిన పాల ప్యాకెట్‌ని ఒక గ్లాసులో ఉంచి అందులో పిండిని వేసుకోవాలి. అనంతరం దాన్ని మూటలా కట్టి చివర్లో పిండి బయటకు వచ్చేలా ఒక చిన్న రంధ్రం చేసుకోవాలి.
- ఇప్పుడు జిలేబీలు వేయించడానికి స్టవ్ మీద ఒక వెడల్పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి పాల ప్యాకెట్లో ఉన్న పిండిని జిలేబీ మాదిరిగా వత్తుకోవాలి.
- అనంతరం స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌కి టర్న్ చేసి జిలేబీలను రెండు వైపులా గోల్డెన్ కలర్లో కాల్చుకోవాలి.
- ఆ తర్వాత బయటకు తీసిన వెంటనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోరు వెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేయాలి.
- అర నిమిషం తర్వాత జిలేబీలను ప్లేట్లోకి తీసుకుంటే చాలు. అంతే, నోరూరించే కమ్మని "జిలేబీలు" రెడీ!
పెసరపప్పుతో కమ్మనైన "ధారాక్షి స్వీట్" - పైన కరకర, లోపల జ్యూసీగా!