Homemade Instant Cake Recipe : పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే బేకరీ ఐటమ్స్‌లో 'కేక్' ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ముఖ్యంగా పిల్లలైతే బేకరీ కనిపించినప్పుడుల్లా కేక్ కావాలని మారాం చేస్తుంటారు. అయితే, బయట దొరికే వాటితో ఆరోగ్యానికి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అదే, ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా పెద్ద పని అన్నట్టుగా భావిస్తుంటారు చాలా మంది. కానీ, మీకు తెలుసా? బేక్ చేయకుండా అప్పటికప్పుడు కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో చేసుకునే ఒక సింపుల్ కేక్ రెసిపీ ఉంది. అదే, "వైట్ ఫారెస్ట్ పేస్ట్రీ కేక్".
ఈ ఇన్స్టంట్ కేక్ రెసిపీ కోసం బేకింగ్ పౌడర్, వంట సోడా, ఎగ్స్ కూడా అవసరం లేదు. అలాగే, స్టవ్ కూడా వెలిగించాల్సిన పని లేదు. మీకు ఎప్పుడు కేక్ తినాలనిపిస్తే అప్పుడు క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. సాఫ్ట్ సాఫ్ట్‌గా యమ్మీగా ఉండే ఈ కేక్‌ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి, లేట్ చేయకుండా ఈ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి, ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మిల్కీ బార్స్ లేదా వైట్ కాంపౌండ్ చాక్లెట్స్ - మూడు
- కాచి చల్లార్చిన పాలు - ముప్పావు కప్పు
- చక్కెర - ముప్పావు టేబుల్‌స్పూన్
- విప్పింగ్ క్రీమ్ పౌడర్ - ఒక కప్పు
- కాచి చల్లార్చిన పాలు - ఒక కప్పు(విప్పింగ్ క్రీమ్ కోసం)
- వెనీలా ఎసెన్స్ - పావుటీస్పూన్
- రస్క్‌లు - తొమ్మిది
ఎన్నో పోషకాలున్న రాగిపిండితో కరకరలాడే "చెక్కలు" - కేవలం పావుగంటలో రెడీ! - నూనె కూడా పీల్చవు!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఏదైనా వైట్ కాంపౌండ్ చాక్లెట్స్ లేదా మిల్కీ బార్స్ తీసుకొని వాటి కవర్స్ తొలగించుకోవాలి.
- తర్వాత ఒక ప్లేట్లో వాటిని గ్రేటర్‌తో సన్నగా తురుముకోవాలి. ఆపై తురుముకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఎందుకంటే బయట పెట్టేస్తే కరిగిపోతుందని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఆపై అందులో చక్కెర వేసుకొని కరిగే వరకు కలిపి పక్కనుంచాలి.

- అనంతరం విప్పింగ్ క్రీమ్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి.
- ఆపై అందులో గ్లాసు బౌల్ లేదా స్టీల్ బౌల్ ఉంచి దానిలో విప్పింగ్ క్రీమ్ పౌడర్ వేసుకొని అరకప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఎలక్ట్రిక్ బీటర్ లేదా విస్కర్‌తో క్రీమ్ అనేది స్టిఫ్ పీక్స్‌కి వచ్చేంత వరకు హై స్పీడ్‌లో బాగా బీట్ చేసుకోవాలి. అంటే విస్కర్ లేదా బీటర్‌తో క్రీమ్‌ని తీస్తే కింద పడకుండా దానికే అతుక్కొని ఉండాలి.

- ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకున్నాక అందులో వెనీలా ఎసెన్స్ వేసుకొని అది క్రీమ్‌లో కలిసేలా పోయేలా మరోసారి బాగా బీట్ చేసుకోవాలి. క్రీమ్‌ని స్టిఫ్ పీక్స్‌కి వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే బౌల్‌ని బోర్లా తిప్పిన క్రీమ్ అనేది కిందపడకుండా ఉంటుంది. ఆవిధంగా క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు ఒక చిన్న స్టీల్ గ్లాసులో పైపింగ్ బ్యాగ్‌ని తీసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్‌ని ప్రెస్ చేస్తూ చక్కగా నింపుకొని రెడీగా ఉంచుకోవాలి. అనంతరం పేస్ట్రీని అసెంబుల్ చేసుకోవాలి.

- ఇందుకోసం 9 రస్క్‌లలో మూడింటిని తీసుకొని వాటిని ముందుగా చక్కెర వేసి కరిగించి పక్కన పెట్టుకున్న పాలలో ముంచి ఒక వెడల్పాటి ప్లేట్ మీద పక్కపక్కనే ఉంచాలి.
- ఆ తర్వాత వాటిపై విప్పింగ్ క్రీమ్‌ని చక్కగా అప్లై చేసుకొని చాకుతో సమానంగా సర్దుకోవాలి. ఆపై దాని మీద తురుముకొని ఫ్రిడ్జ్‌లో ఉంచిన చాక్లెట్ గ్రేటింగ్స్ని ఒక లేయర్‌గా కొద్దిగా చల్లుకోవాలి.
శనగపిండి లేకుండా "మిర్చి బజ్జీలు" - ఇలా చేస్తే నూనె పీల్చకుండా కమ్మగా వస్తాయి!

- అనంతరం దానిపై మరో మూడు రస్క్‌లను పాలలో ఉంచి లేయర్ మాదిరిగా పెట్టుకోవాలి. ఆపై విప్పింగ్ క్రీమ్, చాక్లెట్ తురుముని లేయర్స్ మాదిరిగా వేసుకోవాలి.
- తర్వాత మిగిలిన మూడు రస్క్‌లను కూడా పాలలో ముంచి మూడో లేయర్‌లా పెట్టుకోవాలి. దానిపై మరోమారు విప్పింగ్ క్రీమ్‌ని చక్కని లేయర్‌లా అప్లై చేసుకోవాలి.
- పైన అప్లై చేసిన తర్వాత సైడ్స్ కూడా పైపింగ్ బ్యాగ్‌తో విప్పింగ్ క్రీమ్‌ని అప్లై చేసుకొని కత్తితో లెవల్ చేసుకోవాలి.

- ఆవిధంగా ప్రిపేర్ చేసుకున్నాక టిష్యూ పేపర్‌తో బార్డర్స్‌ని నీట్‌గా తుడుచుకోవాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ పైన చాక్లెట్ గ్రేటింగ్స్ని చక్కగా అప్లై చేసుకోవాలి. అలాగే, సైడ్స్‌కి కూడా చేతితో లేదా కత్తితో చాక్లెట్ గ్రేటింగ్స్ని అంటించుకోవాలి.
- అనంతరం పైపింగ్ బ్యాగ్‌కి నాజిల్ పెట్టుకొని చాక్లెట్ గ్రేటింగ్స్ అప్లై చేసుకున్న కేక్‌పై విప్పింగ్ క్రీమ్‌ని ఫ్లవర్స్‌లా పెట్టుకోవాలి. ఆపై వాటిపై చెర్రీలను పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు.
- లేదంటే ఫ్రిడ్జ్‌లో అరగంటపాటు ఉంచి ఆ తర్వాత అయినా పీసెస్‌గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, సూపర్ టేస్టీగా ఉండే "వైట్ ఫారెస్ట్ పేస్ట్రీ కేక్" ఇంట్లోనే నిమిషాల్లో రెడీ అయిపోతుంది!

ఈ చిట్కాలతో పర్ఫెక్ట్ రెసిపీ :
- పాలను కాచి చల్లార్చి ఒక గంటపాటు ఫ్రిడ్జ్‌లో ఉంచి ఆ తర్వాత యూజ్ చేసుకుంటే విప్పింగ్ క్రీమ్ చక్కగా కుదురుతుంది.
- ఇక్కడ విస్కర్‌తో బీట్ చేసుకోవాలంటే కాస్త ఎక్కువ టైమ్ పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, ఎలక్ట్రిక్ బీటర్‌తో ఏడెనిమిది నిమిషాలు హై స్పీడ్‌లో బాగా బీట్ చేసుకుంటే సరిపోతుంది.
- ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తయారీకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు సరిపోతాయి.
- అలాగే, మీరు తీసుకునే విప్పింగ్ క్రీమ్ పౌడర్‌లో షుగర్ లేకపోతే ఒక కప్పుకి పావు కప్పు చక్కెర పొడి వేసుకొని కలుపుకోవాలి.
- విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం ఇబ్బందని పిస్తే నేరుగా ఆన్లైన్లో, బయట మార్కెట్లో తాజాగా ఉండేదాన్ని కొనుగోలు చేసి వాడుకోవచ్చు. అప్పుడు కేక్ తయారీ మరింత సులువుగా చాలా తక్కువ టైమ్‌లో అయిపోతుందని గుర్తుంచుకోవాలి.
బాలామృతంతో కరకరలాడే "మురుకులు" - పిండిని ఇలా కలిపితే నూనె పీల్చవు, గుల్లగా వస్తాయి!
బియ్యప్పిండి లేకుండా "చెక్క గారెలు" - నూనె పీల్చకుండా కరకరలాడుతాయి! - పిల్లలకు స్నాక్స్‌గా బెస్ట్!