Simple Ice Cream Recipes in Telugu : ఎండాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్‌క్రీమ్‌ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. దాంతో ఐస్‌క్రీమ్ బండి కనపడితే చాలు కొనిచ్చే వరకు మారాం చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఏడుస్తున్నారని బయట ఐస్‌క్రీమ్స్ ఇప్పిస్తుంటారు. కానీ, వాటిల్లో ఆరోగ్యానికి హాని కలిగించే ప్రిజర్వేటివ్స్ ఉండవచ్చు. అందుకే, పిల్లల కోసం ఇంట్లోనే ఈజీగా, హెల్దీగా ప్రిపేర్ చేసుకునే ఐస్‌క్రీమ్ రెసిపీని తీసుకొచ్చాం.
అంతేకాదు, ఒకే మిక్స్‌తో మ్యాంగో, చాకోలెట్, వెనీలా ఈ మూడు ఫ్లేవర్స్ ఐస్‌క్రీమ్స్‌ని రెడీ చేసుకోవచ్చు. పైగా వీటి తయారీ కోసం ఎలాంటి ప్రెష్ క్రీమ్, బీటర్, కండెన్స్డ్ మిల్క్ అవసరం లేదు. కాబట్టి, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హెల్దీగా వీటిని తినొచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్‌గా రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా బయట ఐస్‌క్రీమ్ షాప్స్‌లో దొరికే ఫ్లేవర్‌కి ఏమాత్రం తీసిపోదు. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ ఐస్‌క్రీమ్స్‌ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పాలు - ఒక లీటర్
- కార్న్‌ఫ్లోర్ - నాలుగు టేబుల్‌స్పూన్లు
- పంచదార - 100 గ్రాములు(పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ)
- మిల్క్ మలై(పాల మీగడ) - పావు కప్పు
- వెనీలా ఎసెన్స్ - ఒక టీస్పూన్
- మామిడిపండు గుజ్జు - పావు కప్పు(మ్యాంగో ఫ్లేవర్ కోసం)
- కోకో పౌడర్ - 2 టేబుల్‌స్పూన్లు (చాకోలెట్ ఫ్లేవర్ కోసం)
90's స్పెషల్ "సేమియా పాల ఐస్‌క్రీమ్" - ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!

తయారు చేసుకోండిలా :
- ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో పాలు పోసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు మరో చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్ తీసుకొని అందులో 100 ఎంఎల్ పాలు(ముందుగా తీసుకున్న లీటర్ పాలలో నుంచి తీసుకోవాలి) పోసుకొని ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కనుంచాలి.
- అనంతరం మిగిలిన పాల గిన్నెను స్టవ్ మీద ఉంచి పొంగు వచ్చే వరకు మధ్యమధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి.
- పాలు పొంగు వచ్చాక మీడియం ఫ్లేమ్‌లో అడుగంటి పోకుండా, పాలు పొగి పోకుండా మధ్యమధ్యలో కలుపుతూ కనీసం 5 లేదా 10 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి.
- 5 నిమిషాల తర్వాత పాల క్వాంటిటీ తగ్గి కాస్త చిక్కగా మారుతాయి. అప్పుడు అందులో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిక్చర్ మరోసారి కలిపి కొద్దికొద్దిగా ఉండలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి
- ఈ టైమ్‌లో స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి కార్న్‌ఫ్లోర్ మిక్చర్ వేసుకోవాలి. ఆపై 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుతూ సన్నని సెగ మీదనే మరగనివ్వాలి.
- ఆ మిశ్రమం కాస్త దగ్గర పడ్డాక పంచదార వేసుకొని అది పూర్తిగా కరిగే వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి.
- చక్కెర కరిగిపోయాక ఒకసారి టేస్ట్ చూసుకొని స్వీట్నెస్ చాలకపోతే మరికొద్దిగా షుగర్ వేసుకొని మరిగించుకోవాలి.
- పంచదార కరిగాక మరో రెండు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను దించి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన పాల మిశ్రమం వేసుకోవాలి. ఆపై అందులో పాల మీగడ, వెనీలా ఎసెన్స్ వేసుకొని మధ్యమధ్యలో గ్యాప్ ఇస్తూ లో స్పీడ్‌లో స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి.
- క్రీమీ టెక్చర్ వచ్చేలా ఆ మిశ్రమాన్ని బ్లెండ్ చేసుకున్నాక దాన్ని ఒక బౌల్ లేదా బాక్స్‌లోకి తీసుకోవాలి. అనంతరం ఎయిర్టైటెడ్గా ఉండే మూతపెట్టి ఆ బాక్స్‌ని డీఫ్రిడ్జ్లో కనీసం 4 నుంచి 6 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి.
- 6 గంటల తర్వాత బయటకు తీస్తే అది కుల్ఫీ టెక్చర్‌తో ఐస్‌లా ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క కుల్ఫీ టెక్చర్ ఐస్ మిశ్రమంతో మూడు ఫ్లేవర్స్ ఐస్‌క్రీమ్స్ రెడీ చేసుకోవచ్చు.

- అందుకోసం దాన్ని చాకుతో మూడు భాగాలుగా చేసుకోవాలి. అది బాగా హార్డ్‌గా అయి ఉంటుంది కాబట్టి ఈజీగా డీమౌల్డ్ అవ్వడానికి కాసేపు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఉంచాలి.
- కాస్త మెల్ట్ అయ్యాక అందులో ఒక భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని మిక్సీ జార్లో వేసుకొని లో స్పీడ్‌లో మధ్యమధ్యలో గ్యాప్ ఇస్తూ స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి.
- క్రీమీ టెక్చర్ వచ్చేలా బ్లెండ్ చేసుకున్నాక దాన్ని ఒక ఎయిర్టైటెడ్ బాక్స్‌లోకి తీసుకొని పైన అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి మూతని టైట్‌గా పెట్టేసి పక్కనుంచాలి. ఇందులో ముందుగానే వెనీలా ఎసెన్స్ వేసుకున్నాం కాబట్టి ఇది వెనీలా ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ అవుతుంది.

- ఇప్పుడు మరో ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ కోసం అదే మిక్సీ జార్లో మరొక భాగాన్ని ముక్కలుగా చేసి వేసుకొని క్రీమీ టెక్చర్ వచ్చేలా బ్లెండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మ్యాంగో ఫ్లేవర్ కోసం అందులో మామిడిపండు గుజ్జుని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కొద్దిగా పల్స్ ఇచ్చి బ్లెండ్ చేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమాన్ని మరో బాక్స్‌లోకి తీసుకొని ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆపై పైన కొద్దిగా పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి మూతపెట్టుకోవాలి.

- ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ కోసం మిక్సీ జార్లో మిగిలిన పార్ట్‌ని ముక్కలుగా చేసి తీసుకోవాలి. ఆపై అందులో కోకో పౌడర్ వేసుకొని స్మూత్‌గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి.
- మీ దగ్గర కోకో పౌడర్ కనుక లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్స్ని పీసెస్‌గా కట్ చేసి అయినా వేసుకోవచ్చు.
- ఆ తర్వాత బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. ఆపై పిల్లలకు తినడానికి ఇంట్రెస్ట్‌గా ఉండడానికి మధ్యలో కొద్దిగా చాకో చిప్స్ వేసుకొని అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి మూత పెట్టేయాలి.
- అనంతరం ఆ మూడు బాక్సులను డీఫ్రిడ్జ్లో కనీసం 8 గంటల పాటు లేదా ఓవర్ నైట్ ఉంచినా పర్వాలేదు.
- 8 గంటల అనంతరం వాటిని బయటకు తీసి చిన్న చిన్న గిన్నెల్లోకి స్కూప్ ఔట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు.
- అంతే, ఒక ఐస్‌క్రీమ్ మిక్స్‌తో నోరూరించే "మ్యాంగో, చాక్లెట్, వెనీలా ఫ్లేవర్ ఐస్‌క్రీమ్స్" రెడీ!
టిప్స్ :
- ఐస్‌క్రీమ్ రుచికరంగా రావడానికి ఎప్పుడైనా సరే మీగడ తీయని పాలను ఎంచుకోవాలి. అదే, మీరు ప్యాకెట్ పాలను వాడుతున్నట్టయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని యూజ్ చేస్తే బెటర్.
- ఈ రెసిపీలో మిల్క్ మలై వేయడం ద్వారా ఐస్‌క్రీమ్ అనేది క్రీమి క్రీమిగా రావడమే కాకుండా మంచి టెక్చర్, టేస్ట్ కూడా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చు.
సమ్మర్ స్పెషల్ : పుచ్చకాయతో అద్దిరిపోయే ఐస్ క్రీమ్ - రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!
మిల్క్ పౌడర్, క్రీమ్ లేకుండానే - మధురమైన ఐస్‌క్రీమ్ మీ ఇంట్లో! - కూల్ కూల్‌గా తినేయండి