How to Make Gongura Karam Podi at Home : గోంగూర మెజార్టీ పీపుల్ ఫేవరెట్ ఆకుకూర. ఈ పేరు చెబితేనే చాలు చాలా మంది నోట్లో నీళ్లూరుతుంటాయి. దీనితో పచ్చడి, పప్పు ఇలా ఏది చేసినా ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలాగని గోంగూరతో ఎప్పుడూ ఒకరకరమైన వంటకాలను తినాలంటే కూడా బోరింగ్‌గా ఉంటుంది. అందుకే మీకోసం ఈసారి ఒక మంచి రెసిపీని తీసుకోచ్చాం. అదే, నోరూరించే కమ్మని "గోంగూర కారం పొడి". ఈ పద్ధతిలో ఒక్కసారి ఈ కారం పొడిని చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు. దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటుంటే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మరి, లేట్ చేయకుండా పుల్ల పుల్లగా, ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర కారం పొడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
టిప్స్ :
- ఈ కారం పొడి కోసం తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర తీసుకుంటే మంచి రుచి వస్తుంది.
- గోంగూర ఆకులు ఫ్రై చేసేటప్పుడు ముద్దలా, జిగురుగా అయిపోకుండా పొడిపొడిగా రావాలంటే గోంగూరను కడిగిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టి తీసుకోవాలి.
- ఈ రెసిపీని పల్లీలు, నువ్వులు వేసి చేసుకోవడం ద్వారా మంచి రుచితో పాటు శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- ఎర్ర గోంగూర - ఐదారు చిన్న కట్టలు
- రెండు టేబుల్‌స్పూన్లు - పల్లీలు
- రెండు టేబుల్‌స్పూన్లు - తెల్ల నువ్వులు
- రెండు టీస్పూన్లు - నూనె
- ఒక టేబుల్‌స్పూన్ - మినపప్పు
- చిటికెడు - మెంతులు
- ఒక టేబుల్‌స్పూన్ - ధనియాలు
- రెండు రెమ్మలు - కరివేపాకు
- ఒక టీస్పూన్ - జీలకర్ర
- పది - ఎండుమిర్చి(కారానికి తగినన్ని)
- ఐదారు - కాశ్మీరీ రెడ్ చిల్లీ(కలర్ కోసం)
- రుచికి సరిపడా - ఉప్పు
- పావుటీస్పూన్ - పసుపు
- పావుటీస్పూన్ - ఇంగువ
- పదిహేను - వెల్లుల్లి రెబ్బలు
వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా తాజా ఎర్ర గోంగూరను తీసుకొని కాడల నుంచి ఆకులు తుంచుకొని ఒక బౌల్లో వేసుకోవాలి.
- తర్వాత గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి అందులోని నీరంతా పోయేంత వరకు జల్లి బుట్టకు వేసి ఓ 10 నిమిషాలు ఉంచాలి.
- అనంతరం ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ ఉంచి దానిపై గోంగూర ఆకులను పలుచుగా పరచి తడి లేకుండా ఒక రోజు పాటు ఆరబెట్టుకోవాలి.
- అంటే, గోంగూర ఆకులు పూర్తిగా ఎండి పొడిపొడిగా ఉండాలి. అలా ఆరబెట్టుకున్నాక ఆ గోంగూరను ఓ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అనంతరం కారం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్ మీద మూడునాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
- అవి చక్కగా వేగిన తర్వాత నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేయించి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచాలి.
- తర్వాత అదే పాన్‌లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మినపప్పు, మెంతులు, ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆపై కరివేపాకును వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి.
- చివరగా జీలకర్ర కూడా వేసి అరనిమిషం పాటు ఫ్రై చేసి ఆ మిశ్రమాన్ని పల్లీలు ఉన్న గిన్నెలోకే తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

- అనంతం అదే పాన్‌లో ఎండుమిర్చి, కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకొని ఒకట్రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి.
- తర్వాత మళ్లీ అదే పాన్‌లోకి ఆరబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూర ఆకులను తీసుకొని లో ఫ్లేమ్‌లో అది కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
- అలా వేయించాక స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారే వరకు కాసేపు కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మధ్యమధ్యలో ఇంకేమైనా తడి, తేమ లాంటివి ఉంటే అవి కూడా డ్రై అయిపోతాయి.

- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ధనియాల మిశ్రమం, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి.
- తర్వాత అందులో పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలు, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోంగూర ఆకులు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం ఒకసారి దాన్ని కొద్దిగా తీసుకొని ఉప్పు, కారం రుచి చూసి సరిపోకపోతే మరికొంచెం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత ఆ పొడిని పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్టైటెడ్ కంటెయినర్లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నారంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కమ్మని గోంగూర కారం పొడి మీ ముందు ఉంటుంది!
- ఆపై ఈ పొడిని బయట ఉంచితే మూడు నెలలు, ఫ్రిడ్జ్‌లో పెడితే కనీసం 6 నెలలు ఫ్రెష్‌గా నిల్వ ఉంటుంది!
