మార్కెట్లో కల్తీ నెయ్యి కొనకండి - ఇంట్లో మీరే స్వచ్ఛంగా తయారు చేసుకోండి! - ప్రిపరేషన్ చాలా సింపుల్!
ఇంట్లోనే కమ్మని 'నెయ్యి' తయారీ - ఎక్కువ రోజులు తాజాగా నిల్వ కూడా!

Published : May 29, 2025 at 12:25 PM IST
Homemade Healthy Ghee Recipe : అన్నంలో వేడివేడి పప్పు కర్రీ, ఏదైనా కారప్పొడి వంటి వాటితో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే కలిగే ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. అలాగే, ఏవైనా తీపి వంటకాలు చేసుకునేటప్పుడు అందులో నెయ్యి వేయడం ద్వారా మంచి ఫ్లేవర్ రావడమే కాకుండా చాలా రుచికరంగా కూడా ఉంటాయి. అంతేకాదు, డైలీ డైట్లో కాస్త నెయ్యి చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీనిలో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఇదే క్రమంలో చాలా మంది నెయ్యిని బయట కొనుగోలు చేస్తుంటారు. కానీ, ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా నెయ్యిని కూడా కల్తీ చేసేస్తున్నారు. అలాంటి దాన్ని తినడం ద్వారా ఆరోగ్యానికి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ! అందుకే, మీరే ఇంట్లో హెల్దీగా, టేస్టీగా నెయ్యిని తయారుచేసుకోండి. దీని కోసం ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. చాలా ఈజీగా ఈ టిప్స్ పాటిస్తూ ఆరోగ్యకరమైన, రుచికరమైన నెయ్యిని కమ్మగా ఇంట్లోనే రెడీ చేసుకోండి. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
తయారీ విధానం :
- ఇంట్లోనే రుచికరమైన కమ్మని నెయ్యి తయారీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో పాలను తీసుకొని బాగా మరిగించుకోవాలి.
- పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. అప్పటికే పాలపై మీగడ ఏర్పడడం స్టార్ట్ అవుతుంది.
- పాలు పూర్తిగా చల్లారాక వాటిని కాసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా పాల మీద మీగడ మందంగా ఏర్పడుతుంది. అప్పుడు దానిని ఒక కంటైనర్‌లోకి తీసుకొని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి
- ఇలా సుమారుగా 10 నుంచి 15 రోజుల పాటు మీగడను తీసుకొని ఫ్రీజర్‌లో నిల్వ ఉంచుకోవాలి.
- కావాల్సినంత పరిమాణంలో మీగడ రెడీ అయిందనుకున్నప్పుడు నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి.
మంచి ఫ్లేవర్‌తో ఘుమాయించే "మైసూర్ రసం" - ఈ పొడి వేసి చేసుకోవడంలోనే సీక్రెట్ అంతా!

- ఇందుకోసం ముందుగా మిక్సీ జార్లో మీగడ మొత్తాన్ని తీసుకొని ఒకసారి పల్స్ ఇవ్వాలి.
- తర్వాత మూత తీసి అందులో బాగా చల్లగా ఉండే నీటిని కొద్దిగా యాడ్ చేసుకొని మరోసారి పల్స్ ఇవ్వాలి. అంతే, మిక్సీ జార్లో వెన్న ముద్ద సెపరేట్ అవుతుంది.
- అప్పుడు ఆ వెన్నముద్దను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో వాటర్ పోసుకుని రెండుమూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి.
- ఇప్పుడు నెయ్యి తయారీ కోసం ఆ గిన్నెను స్టవ్ మీద ఉంచి లో-ఫ్లేమ్‌లో వెన్న నెయ్యిలా మారి మంచి వాసనతో లైట్ గోల్డెన్ కలర్లోకి మారే వరకు మరిగించుకోవాలి.

- అయితే, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే, నెయ్యి కొద్దిగా రంగు మారుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఎందుకంటే అది చల్లారాక మరింత గోధుమ రంగులోకి మారుతుంది. అలాకాకుండా మీరు పూర్తిగా బంగారు రంగు వచ్చే వరకు మరిగిస్తే చల్లారేలోపు నెయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది.
- ఈవిధంగా కాచిన నెయ్యిని పూర్తిగా చల్లార్చుకొని ఆపై ఏదైనా జార్లో పోసుకుని స్టోర్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా, పూసపూసగా ఉండే స్వచ్ఛమైన కమ్మని నెయ్యి ఇంట్లోనే రెడీ అయిపోతుంది!

టిప్స్ :
- ఇకప్పుడు నెయ్యి రెడీ చేసుకోవాలంటే పెరుగు చిలికి, దానిని మజ్జిగ లాగా చేసి అందులో నుంచి వెన్న తీసి, ఆపై దాంతో ప్రిపేర్ చేసుకునేవారు.
- కానీ, నేటి జనరేషన్లో ఆ పద్ధతి మారింది. చాలా ఈజీగా పాల మీద మీగడతో నెయ్యి తయారు చేస్తున్నారు. ఇది కూడా స్వచ్ఛంగా, రుచికరంగా ఉంటుంది.
- అలాగే, ఇక్కడ పాలను మీకు నెయ్యి అంత పరిమాణంలో కావాలో దానికి తగినవిధంగా తీసుకోవాలి.
నెయ్యితో తయారైన టీ.. ఇప్పుడో ట్రెండ్! - తాగితే ఏమవుతుందో తెలుసా?
కరకరలాడే పాతకాలం నాటి "కొబ్బరి గారెలు" - కూల్ వెదర్లో ఇలా చేసుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా!

