Homemade Chintha Chiguru Pappu Recipe : చింతచిగురుతో నార్మల్‌గా ఎక్కువ మంది చేసుకునే వాటిల్లో ఒకటి పప్పు. అయితే, ఇది అందరూ చేసుకునేదైనా కొన్నిసార్లు ఎంత బాగా వండినా పర్ఫెక్ట్ టేస్ట్ రావట్లేదని ఫీల్ అవుతుంటారు. అందుకే, ఓసారి ఈ పద్ధతిలో "చింతచిగురు పప్పు" చేసుకొని చూడండి. పుల్ల పుల్లగా, కమ్మగా భలే రుచికరంగా ఉంటుంది. ఈ పప్పు కర్రీని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతమని చెప్పుకోవచ్చు. తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచికరంగా చేసుకునే ఈ పప్పు కర్రీని ఇంటిల్లిపాదీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి, లేట్ చేయకుండా చింతచిగురు పప్పుని కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- చింతచిగురు - 100 గ్రాములు
- కందిపప్పు - ఒక కప్పు
- పచ్చిమిర్చి - 10
- మీడియం సైజ్ టమాటా - ఒకటి
- పసుపు - అరటీస్పూన్
"చింతచిగురు" ఇలా నిల్వ చేసుకోండి - సంవత్సరం పాటు ఎంజాయ్ చేయొచ్చు!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా తాజా చింతచిగురుని తీసుకొని కాడలన్నింటినీ తెంపుకోవాలి. లేతగా ఉన్న కాడలు తీసేయాల్సిన అవసరం లేదు. ఆపై దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్‌లో కందిపప్పుని తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా పప్పుని వేయించుకొని కర్రీ చేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది.
- కందిపప్పుని ఆవిధంగా వేయించుకున్నాక ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని ఒకట్రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఆపై అందులో తగినన్ని నీళ్లు(2 నుంచి 3 గ్లాసులు) పోసుకొని శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చి, మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని పప్పు మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి.

- పప్పు మెత్తగా ఉడికిందనుకున్నాక ఆ మిశ్రమంలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చింతచిగురు, పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత చింతచిగురు కూడా చక్కగా ఉడికేలా కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకునే క్రమంలో వాటర్ మొత్తం ఇంకిపోయాయి సరిపోలేదు అనిపిస్తే మరికొద్దిగా నీళ్లను పోసి కలిపి ఉడికించుకోవాలి.
- చింతచిగురుతో మిశ్రమం మొత్తం మంచిగా ఉడికిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుగుత్తితో మెత్తగా మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి.

తాలింపు కోసం :
- నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
- పోపు దినుసులు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - ఐదారు
- ఎండుమిర్చి - మూడు
- మీడియం సైజ్ ఉల్లిపాయ - ఒకటి

- ఇందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ లైట్‌గా కాగిన తర్వాత తాలింపు గింజలు(ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు) వేసుకొని ఆవాలు చిటపటమనేవరకు వేయించాలి.
- అవి వేగాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తుంపలు, మీడియం సైజ్‌లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత కరివేపాకుని వేసుకొని దాన్ని చక్కగా వేయించుకున్నాక ముందుగా మాష్ చేసి పెట్టుకున్న పప్పుని అందులో వేసుకొని ఒకసారి బాగా కలపాలి.
- ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపి మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకొని దింపేసుకుంటే చాలు. అంతే, మంచి ఫ్లేవర్‌తో ఘుమఘుమలాడే "చింతచిగురు పప్పు" మీ ముందు ఉంటుంది!

ఈ టిప్స్‌తో మంచి రుచి :
- కందిపప్పుని వేయించుకునేటప్పుడు మరీ ఎక్కువగా మాడిపోయేలా వేయించకుండా కాస్త రంగు మారి దోరగా వేగితే సరిపోతుంది.
- ఈ రెసిపీలో మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి. ముఖ్యంగా చింతచిగురు పులుపుకి తగ్గట్లు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే పప్పు రుచికరంగా ఉంటుంది.
- పప్పు చక్కగా ఉడికిన తర్వాత మాత్రమే చింతచిగురుని వేసుకొని ఉడికించుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలను పప్పు ఉడికించేటప్పుడు కాకుండా తాలింపులో వేసి వేయించుకోవడం కర్రీ మంచి రుచికరంగా వస్తుంది.
పచ్చికారంతో ఘుమఘుమలాడే "ఎగ్ ఫ్రైడ్ రైస్" - పిల్లల లంచ్ బాక్స్‌లకు పర్ఫెక్ట్!
ఘుమఘుమలాడే "చింత చిగురు చికెన్ కర్రీ" - ఇలా కుక్ చేస్తే వండుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి!