Healthy Rasam Recipe for Summer : వేసవిలో ఏదైనా రుచికరమైన కూర ఉంటేనే నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది మజ్జిగ, పచ్చిపులుసు, టమాటా రసం వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, గ్యాస్ ట్రబుల్‌తో బాధపడేవారు వాటిని తినడానికి ఇబ్బందిపడుతుంటారు. అందుకు ముఖ్య కారణం వాటిల్లో గ్యాస్ ట్రబుల్‌ని ప్రేరేపించే చింతపండుని వేయడమే.
కానీ, మీకు తెలుసా? అలాంటివారూ ఎలాంటి చింత లేకుండా తినే ఒక "అద్భుతమైన రసం" రెసిపీ ఉంది. ఇది చింతపండుతో చేసే చారుకి ఏమాత్రం తీసిపోకుండా పుల్లగా, కారంగా, ఎంతో రుచికరంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికీ ఇది బెస్ట్ ఛాయిస్‌గా చెప్పుకోవచ్చు. మరి, ఈ సూపర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

టిప్స్ :
- ఈ చారు కోసం ఇక్కడ చింతపండు ప్లేస్‌లో కోకమ్ రిండ్స్ తీసుకుంటున్నాం. ఇది ఒక రకమైన ఎండిన పండు తొక్క. గర్సినియా ఇండికా(Garcinia indica) అనే చెట్టు పండు నుంచి వస్తుంది. దీన్నే "మలబార్ చింతపండు" అని కూడా పిలుస్తుంటారు. ఇది బయట సూపర్ మార్కెట్స్, ఆన్లైన్లో లభిస్తుంది.
- కోకమ్ రిండ్స్ని కూరలు, సాంబార్లు, సూప్స్, ఇతర వంటలలో పులుపు కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి, ఇక్కడ మీరు తినే పులుపుకి తగిన పరిమాణంలో దాన్ని తీసుకోవాలి.
- చారు టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఇది రసానికి అదనపు రుచిని తీసుకొస్తుంది.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- శనగపప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- ఎండుమిర్చి - 3
- రైస్ - 1 టేబుల్‌స్పూన్
- మిరియాలు - 8 నుంచి 10
- ధనియాలు - 2 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - అరటీస్పూన్
- టమాటాలు - 2
- కోకమ్ రిండ్స్ - నిమ్మకాయ సైజంత
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావుటీస్పూన్
- బెల్లం - 2 టేబుల్‌స్పూన్లు
- కరివేపాకు - కొద్దిగా
- పచ్చిమిర్చి - 3
తాలింపు కోసం :
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- మెంతులు - 10
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - పావుటీస్పూన్
- ఎండుమిర్చి - 2
- వెల్లుల్లి రెబ్బలు - 5
- కరివేపాకు - కొద్దిగా
ఎండల్లో నోట్లోకి కమ్మగా వెళ్తుంది! - గుంటూరు స్టైల్ "టమాటా రసం" - జుర్రుకోవాల్సిందే!
తయారీ విధానమిలా :
- ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని పచ్చిశనగపప్పు, ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్ మీద కొద్దిసేపు వేయించుకోవాలి.
- అవి సగం వరకు వేగాక అందులో బియ్యం, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని సన్నని మంట మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన ధనియాల మిశ్రమం వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టౌపై ఒక గిన్నెలో టమాటాలను తగినన్ని వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
- అలా ఉడికించుకున్నాక ఆ టమాటాలను అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
- ఇప్పుడు చారుకి పులుపుదనం కోసం ఒక గిన్నెలో కొన్ని కోకమ్ రిండ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి, తగినన్ని వేడి నీరు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి.మలబార్ చింతపండు గుండె, లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలోను ఈ చింతపండు తోడ్పడుతుంది. అలాగే, బరువు తగ్గడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
- అది చక్కగా నానిన తర్వాత చేతితో బాగా మెదుపుతూ రసం తీసుకోవాలి. ఆపై ఆ రసాన్ని మరో బౌల్లోకి జాలీ గరిటెతో వడకట్టుకోవాలి.
- తర్వాత వడకట్టుకున్న పిప్పిలో మరోసారి కొద్దిగా వాటర్ పోసుకొని మెదిపి దాన్ని రసంలోకి వడకట్టుకోవాలి.
- రసం తీసుకున్నాక అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి.
- ఆ తర్వాత చారుకి తగినన్ని వాటర్, ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం, ఉప్పు, పసుపు, యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆపై పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకుని రెమ్మలతో పాటు వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత ఆ గిన్నెను స్టౌపై ఉంచి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ చారుని మరిగించుకోవాలి.
- ఐదారు నిమిషాల పాటు మరిగించుకున్నాక ఉప్పు, తీపి, కారం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి.
- రసం చక్కగా మగ్గిన తర్వాత కరివేపాకు రెమ్మలను తీసేసి, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టౌ ఆఫ్ చేసుకొని దింపుకోవాలి. ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి.
- పోపు కోసం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంపలు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి.
- ఆఖర్లో కరివేపాకు వేసుకొని కలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చారులో వేసి మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "కమ్మని రసం" రెడీ!

ఇంట్లో ఈ "పొడి" ఒక్కటి ఉంటే చాలు - నిమిషాల్లో ఘుమఘుమలాడే 'చారు' రెడీ! - కనీసం 6 నెలలు నిల్వ!
మురుగన్ "నిమ్మ చారు" - దెబ్బకి ఒంట్లో పైత్యం మొత్తం వదిలిపోద్ది - జుర్రేస్తారంతే!