How to Make Fish Head Pulusu: చేపల కూర అంటే చాలా మంది ముక్కలు మాత్రమే ఇష్టంగా తింటారు. తలకాయ గురించి పట్టించుకోరు. అసలు తినడానికే ఆసక్తి చూపరు. క్లీన్ చేసే సమయంలోనే హెడ్ వద్దని చెప్పేవారు కూడా ఉంటారు. కానీ, తలకాయనే అమితమైన ఇష్టంగా తింటారు మరికొందరు. సరైన పద్ధతిలో కుక్ చేయాలేగానీ తలకాయ తింటే ఆ కిక్కే వేరు.
నిజానికి ముక్కల కన్నా చేప తలకాయలోనే పోషకాలు ఎక్కువని నిపుణులు అంటున్నారు. హెడ్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని, ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయని, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ఇందులోని విటమిన్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, గుండె జబ్బులు, కంటి సమస్యలు ఉన్నవారు తింటే మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు. మరి లేట్ చేయకుండా చేప తలకాయ పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

చేప తలకాయ రుచికరంగా ఉండాలంటే ఈ టిప్స్ కంపల్సరీ:
- బొచ్చె, గండె, రవ్వ చేప తలకాయలు పులుసు పెట్టుకుంటే సూపర్‌గా ఉంటాయి.
- ఈ పులుసులో మెత్తటి ఉప్పు కన్నా రాళ్ల ఉప్పు వేస్తేనే రుచి అద్దిరిపోతుంది.
- చేప తలకాయలను డైరెక్ట్‌గా వండకుండా ముందుగా నిమ్మరసం, రాళ్ల ఉప్పు వేసి ఓ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
- అలాగే చాలా మంది చేప తలకాయలో కళ్లు లేకుండా కట్ చేస్తుంటారు. కానీ కళ్లు అనేవి కచ్చితంగా ఉంటేనే రుచి.
- చేప తలకాయలను ఉడికించేటప్పుడు మరీ ఎక్కువగా కలపకూడదు. ఇలా చేస్తే అవి విరిగిపోతాయి.
కావాల్సిన పదార్థాలు:
- చేప తలకాయలు - 5
- ఉల్లిపాయలు - 2
- టమాటాలు - 2
- పచ్చిమిర్చి - 2
- కరివేపాకు రెమ్మలు - 2
- పసుపు - 1 టీ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
- కారం - రుచికి సరిపడా
- ఉప్పు - రుచికి సరిపడా
- మెంతులు - అర టీ స్పూన్
- ఆవాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
- ఆయిల్ - 4 టీ స్పూన్లు
- చింతపండు - 100 గ్రాములు

తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచాలి.
- ఉల్లిపాయ, టమాటాలను సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ గిన్నెలోకి చేప తలకాయలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మెంతులు ఆవాల పిండి, ధనియాల పొడి, నూనె, 100ml నీళ్లు పోసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
- ఇలా కలుపుకున్న చేప తల ముక్కలను ఓ గంట సేపు పక్కన పెట్టాలి.
- ఈలోపు ఓ బౌల్లోకి చింతపండు, 800ml నీరు పోసి నానబెట్టుకోవాలి. చింతపండు నానిన బాగి పిసికి గుజ్జును పక్కన పెట్టుకోవాలి.
- మారినేషన్ అనంతరం చేప ముక్కలు ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయాలి.
- చేప తలకాయ ఓ వైపు కుక్ అయిన తర్వాత నిధానంగా మరో వైపుకు తిప్పుకుని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఇలా ఉడికించుకున్న తర్వాత ముందే ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని పోయాలి. ఓ సారి నిదానంగా కలిపి ఉప్పు, కారం రుచి చూసుకోవాలి.
- చింతపండు రసం పోసుకున్న తర్వాత ఓ 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే పులుసు కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకుంటే సరి.
- అంతే ఎంతో రుచికరంగా ఉండే చేప తలకాయ పులుసు రెడీ. ఇది అన్నంలోకి మాత్రమే కాకుండా రాగి లేదా జొన్న సంగటి లోకి సూపర్‌గా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేయండి.

ఫిష్ పులుసు పెట్టాలంటే చేపలే ఉండాలా ఏంటి? - వీటితో పులుసు పెడితే వహ్వా అనాల్సిందే!
నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా చేశారంటే టేస్ట్ సూపర్.. ప్లేటు నాకాల్సిందే..!