Hanuman Jayanti Special Bellam Appalu: రాముల వారి ప్రియ భక్తుడు, అంజనీపుత్రుడు హనుమాన్ జయంతిని ఏటా చైత్ర మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున జరుపుకుంటాం. ఈసారి మారుతి జయంతి ఏప్రిల్ 12వ తేదీ శనివారం వచ్చింది. ఈ రోజున స్వామిని సింధూరం, తమలపాకు దండలతో పూజించి నైవేద్యంగా పండ్లు సమర్పిస్తారు. వీటితో పాటు మినప్పప్పుతో చేసిన వడలను మాలగా వేసి బెల్లం అప్పాలను నైవేద్యంగా పెడుతుంటారు.
బెల్లం అప్పాలు చాలా రుచికరంగా ఉంటాయి. కేవలం నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే వీటిని పిల్లల నుంచి పెద్దలు వరకు చాసా ఇష్టంగా తింటారు. అతి తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా హనుమంతుడికి ఇష్టమైన బెల్లం అప్పాలు ఎలా చేయాలో ఈ స్టోరీలో చూసేద్దాం రండి.

కావాల్సిన పదార్థాలు:
- పొడి బియ్యప్పిండి - 1 కప్పు
- గోధుమ పిండి - 1 కప్పు
- బెల్లం తురుము - 2 కప్పులు
- బొంబాయి రవ్వ - అర కప్పు
- ఉప్పు - చిటికెడు
- నెయ్యి - పావు కప్పు
- నూనె - వేయించడానికి సరిపడా
- యాలకుల పొడి - కొద్దిగా
తయారీ విధానం:
- ఓ బౌల్లోకి బియ్యప్పిండి, గోధుమపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, యాలకుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి రెండున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి. అంటే తీసుకునే పిండికి సమానంగా నీళ్లను తీసుకోవాలి.
- ఆ నీటిలోకి బెల్లం తురుము వేసుకుని కలుపుతూ కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన స్టవ్ ఆఫ్ చేసి వడకట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి మరో పాన్ పెట్టి వడకట్టిన బెల్లం నీటిని పోసుకుని మరిగించుకోవాలి. నీరు మరుగుతున్నప్పుడు ముందే కలుపుకున్న పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి.
- పిండి మొత్తం పాకంలో కలిసే విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లార్చుకోవాలి.

- 15 నిమిషాల తర్వాత పిండిలో కొద్దిగా నెయ్యి వేసుకుని సుమారు 5 నిమిషాల పాటు చపాతీ పిండిలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగేలోపు కలిపిన పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ గుండ్రంగా చేసుకుని లైట్‌గా అప్పాలుగా వత్తుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇలా చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
- రెండు వైపులా కాలిన తర్వాత ఒక్కొక్కటి తీస్తూ మరో గరిటెతో లైట్‌గా ప్రెస్ చేసి ఓ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అప్పాలను కాల్చుకున్న తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే సరి.

టిప్స్:
- పిండిని ఎంత ఎక్కువ సేపు కలుపుకుంటే అప్పాలు అంత సాఫ్ట్‌గా వస్తాయి.
- పిండిని అప్పాలుగా చేసుకునేటప్పుడు క్రాక్స్ లేకుండా వత్తుకోవాలి. లేదంటే నూనెలో వేసినప్పుడు పేలే అవకాశం ఉంటుంది.
- ఈ అప్పాలకు పాకం పట్టాల్సిన అవసరం లేదు. కేవలం మరిగించుకుంటే చాలు.
హనుమంతుడికి "గుమ్మడి పూరీలు" - స్వామి జయంతికి అద్భుత ప్రసాదం! - అనాస పాయసం కూడా
హనుమాన్ జయంతి స్పెషల్ - క్రిస్పీ అండ్ టేస్టీ "ఆంజనేయ వడలు" - స్వామికి నైవేద్యంగా పెట్టండి!