ETV Bharat / offbeat

పెళ్లి వేడుకలో వధూవరులకు - పసుపు ఎందుకు పూస్తారు?

- వివాహానికి ముందు తప్పనిసరిగా హల్దీ వేడుక - పసుపు రాయడానికి కారణాలు ఇవే!

Turmeric Importance in Marriage
Turmeric Importance in Marriage (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : October 5, 2025 at 3:18 PM IST

2 Min Read
Choose ETV Bharat

Turmeric Importance in Marriage : హిందూ వివాహ వేడుకలో వధూవరులకు పసుపుతో స్నానం చేయించే సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే ఇద్దరికీ పసుపు పూస్తారు. ఇది చాలా ముఖ్యమైన తంతుగా నిర్వహిస్తారు. మరి, దీని వెనకున్న కారణాలేంటి? ఈ హల్దీ వేడుకకు అంత ప్రాధాన్యం ఎందుకు ఉంటుంది? పెళ్లిలో పసుపు ఫంక్షన్​ చేయకపోతే ఏమవుతుంది? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

వైభవంగా హల్దీ :

పెళ్లి వేడుక అంటేనే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఎవరి స్థోమతకు తగినట్టుగా వాళ్లు ఆడంబరంగా చేస్తారు. దీనికి ముందు నిర్వహించే హల్దీ వేడుకకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్లికి ముందు రోజు వరుడు, వధువు నివాసాల్లో వేర్వేరు ఈ ఫంక్షన్ చేస్తారు. ఇందులో బంధు, మిత్రులు పాల్గొని కాబోయే దంపతులకు ముఖం, మెడతోపాటు కాళ్లూ చేతులకు పసుపు పేస్టు పూస్తారు. ఈ సమయంలో ఆటపాటలతో ఎంతో ఎంజాయ్ చేస్తారు.

ఆధ్యాత్మిక శుద్ధి :

మహిళలకు పసుపు, కుంకుమలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. పసుపు ఆధ్యాత్మిక వేడుకల్లో తప్పకుండా ఉంటుంది. ఇది దృష్టిదోషాన్ని నివారిస్తుందని నమ్ముతారు. పసుపు పూయడం వల్ల దుష్టశక్తులు దరిచేరవని భావిస్తారు. దీంతోపాటు కొన్నిచోట్ల వధూవరులకు ఎర్రదారాన్ని కడతారు. ఇలా చేయడం వల్ల సురక్షితంగా ఉంటారని విశ్వాసం.

భారతీయులు పెళ్లి​లో ఎందుకు పాన్ తింటారు?

శుభానికి ప్రతీక :

మంగళకరమైన వేడుక ఏది జరిగినా సరే అందులో పసుపు ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆ విధంగా భారతీయ సంస్కృతిలో పసుపు శుభానికి ప్రతీకగా ఉంటుంది. కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్న జంటకు దక్కబోయే ఆనందానికి, శ్రేయస్సుకు పసుపు సూచికగా భావిస్తారు.

చర్మ సంరక్షణ :

  • పసుపు నేచురల్ యాంటీ బయాటిక్ అన్న సంగతి మనకు తెలిసిందే. చర్మ సమస్యలు ఏవైనా ఉన్నాసరే ఇది వెంటనే అదుపు చేస్తుంది.
  • ఇందులోని సహజ గుణాలు శరీరంలోని మలినాలను తొలగించి, చర్మానికి కొత్త కాంతిని అందిస్తాయి.
  • అలాంటి పసుపును పూసి, స్నానం చేయించినప్పుడు చర్మంతోపాటు మనసు కూడా తాజాగా మారుతుంది.
  • శరీరంపై ఉన్న సూక్ష్మక్రిములను తొలగిస్తుంది. దీంతో చర్మవ్యాధులు, దుర్వాసన, అలర్జీలు వంటివి ఉంటే తగ్గిపోతాయి
  • రోగనిరోధక వ్యవస్థను బలపరిచే ఇమ్యూనిటీ బూస్టర్ గా పసుపు నిలుస్తుంది.

సౌందర్య రహస్యం :

ఇప్పుడంటే పెళ్లి వేడుకలో అందంగా కనిపించడానికి అందరూ బ్యూటీ పార్లర్​ను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఆ రోజుల్లో పసుపును సహజ సౌందర్య ప్రొడక్ట్​గా భావించేవారు. ఇందులోని యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు స్కిన్​ను క్లీన్ చేసేవి. వివాహానికి ముందు నుంచే పసుపు ప్యాక్ వేసుకోవడం వల్ల వధూవరులు ఆకర్షణీయంగా కనిపిస్తారని ఈ పని చేసేవారు. కాల క్రమంలో అదే హల్దీ వేడుకగా మారిందని చెబుతారు.

అప్డేట్ అయినప్పటికీ :

  • నేటి ఆధునిక యుగం వరకు హల్దీ వేడుక ఎన్నో రకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.
  • అయితే ఎన్ని అంశాలు ఇందులో అదనంగా చేరినప్పటికీ.. పసుపు రుద్దుకోవడం అనే ప్రాథమిక విషయం మాత్రం మారలేదు.
  • తద్వారా వేడుకను హెల్దీగా, మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.
  • ఈ వేడుక కొత్త జీవితం ప్రారంభించబోతున్న ఇద్దరికీ ఆనందంతోపాటు ఆరోగ్యాన్నీ పంచుతోంది.

భారతీయులు తులసి చెట్టును ఎందుకు పూజిస్తారు?