నోరూరించే "గుత్తి బీరకాయ మసాలా కర్రీ" - వేడివేడి అన్నంలో తింటుంటే ఆ మజానే వేరు!
-గుత్తొంకాయను మైమరిపించే 'బీరకాయ కర్రీ' - పిల్లలూ ఇష్టంగా తింటారు!

Published : October 9, 2025 at 5:00 PM IST
Gutti Beerakaya Masala Curry : మసాలా పొడి స్టఫ్ చేసి ప్రిపేర్ చేసుకునే గుత్తి వంకాయ కర్రీ అంటే మనలో చాలా మందికి ఎంతో ఇష్టం. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకుని తింటుంటే ఆ టేస్ట్ నెక్ట్ లెవల్లో ఉంటుంది. కానీ, మీకు తెలుసా బీరకాయతో కూడా అదే తీరులో, అంతే రుచికరంగా "స్టఫ్డ్ మసాలా కర్రీని" రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి తిన్నారంటే బీరకాయలు ఎప్పుడూ తెచ్చినా ఇలాగే చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే, ఈ పద్ధతిలో చేసి పెట్టారంటే పిల్లలతో పాటు బీరకాయ అంటే నచ్చనివాళ్లూ ఎంతో ఇష్టంగా తింటారు. పైగా దీన్ని చాలా తక్కువ టైమ్‌లో సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. మరి, ఈ రుచికరమైన గుత్తి బీరకాయ మసాలా కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- బీరకాయలు - మూడు
- పల్లీలు - ఒక కప్పు
- నువ్వులు - రెండు చెంచాలు
- ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు
- వెల్లుల్లిపాయ - ఒకటి
- జీలకర్ర - ఒక చెంచా
- ధనియాల పొడి - ఒక చెంచా
- కారం - ఒక చెంచా(తగినంత)
- ఉప్పు - రుచికి తగినంత
- పసుపు - అర చెంచా
- కరివేపాకు - నాలుగు రెమ్మలు
- నూనె - మూడు టేబుల్‌స్పూన్లు
ఆంధ్ర స్టైల్ "గ్రీన్ అల్లం చట్నీ" - ఇలా చేస్తే టిఫెన్ సెంటర్ రుచి!

తయారీ విధానం :
- రుచికరమైన ఈ గుత్తి బీరకాయ కర్రీ కోసం ముందుగా తాజా బీరకాయలను తీసుకుని గీర పోయేలా పీలర్‌తో పైన పొట్టును పీల్ చేయాలి.
- తర్వాత వాటిని శుభ్రంగా కడిగి కడిగి మూడు అంగుళాల పొడువుతో ముక్కలు చేయాలి.
- ఆపై కట్ చేసి ముక్కలను వన్ సైడ్ మధ్యలో నిలువుగా కోయాలి. ఇలా అన్నింటినీ కోసి ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచాలి.
- ఇప్పుడు రెసిపీలోకి అవసరమైన ఒక ప్రత్యేమైన మసాలా పొడిని రెడీ చేసుకోవాలి.
- ఇందుకోసం స్టవ్ మీద పాన్ లేదా కడాయిలో పల్లీలను వేసి లో ఫ్లేమ్గా దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇవి చల్లారాక పొట్టు తీసుకుని పక్కనుంచాలి.
- అనంతరం అదే కడాయిలో నువ్వులను దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన పల్లీలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాల పొడి, కారం, రుచికి తగినంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్లో చక్కగా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు కర్రీ తయారీ కోసం స్టవ్ మీద పాన్‌లో నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అది వేగాక మసాలా పొడి స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి కలుపుతూ అర నిమిషం పాటు వేయించాలి.
- ఆపై అందులో ఇంకా మిగిలి ఉన్న పల్లీ మసాలా పొడిని జతచేసి కలిపి మూతపెట్టి లో టూ మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి.
- బీరకాయ మంచిగా మగ్గి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుంచే చాలు. అంతే, నోరూరించే "గుత్తి బీరకాయ మసాలా కర్రీ" రెడీ అవుతుంది!

ఇడ్లీ, దోశల్లోకి అద్దిరిపోయే "చట్నీ" - పల్లీలు లేకుండానే టిఫెన్ సెంటర్ టేస్ట్!
గోరుచిక్కుడుతో రుచికరమైన "పచ్చడి" - వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే ఆహాఁ!

