ఎండల్లో నోట్లోకి కమ్మగా వెళ్తుంది! - గుంటూరు స్టైల్ "టమాటా రసం" - జుర్రుకోవాల్సిందే!
- మీ పిల్లలు ఎండలకు అన్నం సరిగా తినట్లేదా? - ఈ పద్ధతిలో టమాటా రసం చేయండి, ఇష్టంగా తింటారు

Published : March 10, 2025 at 12:01 PM IST
Guntur Style Tomato Rasam Recipe: ఎండాకాలంలో చాలా మంది లిక్విడ్ ఫుడ్స్‌కు ఓటేస్తారు. ఈ క్రమంలోనే అమ్మలందరూ తమ ఇంట్లో వారి కోసం రసం, చారు, సాంబార్ అంటూ రకరకాల వంటలు చేస్తుంటారు. వీటన్నింటిలో పిల్లలకు విపరీతంగా నచ్చేది టమాటా రసం. కరెక్ట్‌గా చేయాలేగానీ ఏకంగా తాగేస్తారు. అయితే ఎక్కువ మందికి ఈ టమాటా రసం చేయడం రాదు. అలాంటివారు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ కొలతలతో గుంటూరు స్టైల్లో టమాటా రసం పెట్టి చూడండి. పిల్లలు మళ్లీ మళ్లీ ఇలానే చేయమని గోల చేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ టమాటా రసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- టమాటాలు - 4
- చింతపండు - నిమ్మకాయ సైజ్
- పసుపు - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
రసం పొడి కోసం:
- కందిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - అర టీ స్పూన్
- మెంతులు - చిటికెడు
- ధనియాలు - అర టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి -5
- మిరియాలు - 1 టీ స్పూన్
తాలింపు కోసం:
- నూనె - 1 టేబుల్ స్పూన్
- నెయ్యి - 1 టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఆవాలు - అర టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 10
- ఎండుమిర్చి - 4
- ఇంగువ - పావు టూ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం:
- టమాటాలను శుభ్రంగా కడిగి మీడియం సైజ్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓ గిన్నెలోకి టమాటా ముక్కలు, చింతపండు, 1 టీ స్పూన్ ఉప్పు, పసుపు, 2 గ్లాసుల నీరు పోసి కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి.
- మీడియం ఫ్లేమ్‌లో టమాటాల్లోని నీరు సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి.
- ఈలోపు రసం పొడి ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మిక్సీజార్‌లోకి కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు, మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టాలి.
- టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి. చల్లారిన తర్వాత ముక్కలను చేతితో మెదుపుకోవాలి. ఆ తర్వాత ఈ రసాన్ని వడకట్టి, టమాటా ముక్కలను పడేసుకోవాలి.
- ఇలా వడకట్టిన రసాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని పులుపుకు తగినట్లుగా నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన పొడి ఓ మూడు టేబుల్ స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి రుచి చూడాలి. ఉప్పు, కారం సరిపోతే ఏమి లేదు. లేదంటే మరికొంచెం యాడ్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి ఈ రసం గిన్నెను పెట్టుకుని మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. రసం మరిగిన తర్వాత సిమ్‌లో పెట్టి మరికొద్దిసేపు మరిగించాలి.
- ఈలోపు మరో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె, నెయ్యి వేసుకోవాలి. కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. అనంతరం దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి మరికొంచెంసేపు వేయించాలి.
- చివరగా ఇంగువ, కరివేపాకు వేసి కలిపి మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అనంతరం ఈ తాలింపు మరుగుతున్న రసంలో పోసి కలిపి మరో 5 నిమిషాలు మగ్గించాలి.
- చివరకు కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఘుమఘుమలాడే గుంటూరు స్టైల్ టమాటా రసం రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
సమ్మర్ డిష్ : మామిడి అల్లం చారు - తింటే వహ్వా వహ్వా అంటారు మీరు!
మురుగన్ "నిమ్మ చారు" - దెబ్బకి ఒంట్లో పైత్యం మొత్తం వదిలిపోద్ది - జుర్రేస్తారంతే!

