మరమరాలతో "గుంత పొంగనాలు" - అప్పటికప్పుడు చేసుకోవచ్చు - ఇడ్లీ, దోశ పిండితో పనిలేదు!
-మరమరాలతో సరికొత్తగా గుంత పొంగనాలు - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనుకుంటారు!

Published : September 13, 2025 at 6:20 PM IST
Gunta Ponganalu with Puffed Rice: గుంత పొంగనాలు అంటే చాలా మందికి ఇష్టం. తక్కువ ఆయిల్‌తో టేస్టీగా ప్రిపేర్ చేసుకునే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. అందుకే చాలా మంది ఇంట్లో ఇడ్లీ లేదా దోశ పిండి ఉంటే అప్పటికప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటివన్నీ మిక్స్ చేసేసి పొంగనాలు వేస్తుంటారు. అయితే ఇకపై ఇంట్లో పిండి లేనప్పుడు కూడా ఎంచక్కా గుంత పొంగనాలు చేసుకోవచ్చు. అందుకోసం మరమరాలు ఉంటే సరిపోతుంది. మీరు విన్నది నిజమే. ముంత మసాలా కోసం ఉపయోగించే మరమరాలతో రుచికరమైన పొంగనాలు చేసుకోవచ్చు. ప్రిపరేషన్ చాలా ఈజీ. మరి లేట్ చేయకుండా కమ్మని, రుచికరమైన మరమరాల గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- బొంబాయి రవ్వ - అర కప్పు
- పెరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- మరమరాలు - 2 కప్పులు
- ఉల్లిపాయ - 1
- క్యారెట్ - 1
- పచ్చిమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర - అర టీస్పూన్
- బేకింగ్ సోడా - పావు టీస్పూన్

తయారీ విధానం:
- మిక్సింగ్ బౌల్లోకి బొంబాయి రవ్వ, పెరుగు తీసుకుని ఓసారి కలపాలి. ఆ తర్వాత పావు కప్పు వాటర్‌ను కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని మిక్స్ చేసుకుని కొద్దిసేపు పక్కన పెట్టాలి.
- ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్‌పై పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి.

- ఓ గిన్నెలోకి మరమరాలు తీసుకుని తగినన్ని వాటర్ పోసి ఓసారి కలిపి 5 నిమిషాలు నాననివ్వాలి.
- మరమరాలు మెత్తగా అయిన తర్వాత కొద్దికొద్దిగా తీసుకుంటూ నీటిని గట్టిగా పిండేసి మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. అన్నింటిని ఇలానే పిండి తీసుకోవాలి.
- అదే మిక్సీజార్‌లోకి నానబెట్టిన రవ్వ మిశ్రమం వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఇప్పుడు మరమరాలు, రవ్వ మిశ్రమంలోకి ముందుగానే కట్ చేసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, క్యారెట్ తురుము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి పదార్థాలు అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

- చివరగా బేకింగ్ సోడా వేసి మరోసారి కలిపి పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల పాన్ పెట్టి వాటిల్లో నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దికొద్దిగా వేసుకోవాలి.
- పాన్‌కు సరిపడా వేసుకున్న తర్వాత మంటను లో టూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత ఉంచి కుక్ చేసుకోవాలి.

- పొంగనాలు ఓవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాలిన వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలానే పొంగనాలు వేసుకోవాలి.
- ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుని పల్లీ చట్నీ లేదా కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మరమరాల గుంత పొంగనాలు రెడీ.

చిట్కాలు:
- మరమరాలు మరీ ఎక్కువ సేపు నీటిలో నానాల్సిన పనిలేదు. ఎక్కువసేపు నానితే మరీ మెత్తగా అవ్వడంతో పాటు నీటిని కూడా ఎక్కువ పీల్చుకుంటాయి. దీంతో గ్రైండ్ చేసినప్పుడు మిశ్రమం లూజ్‌గా మారే అవకాశం ఉంటుంది.
- పుల్లటి పెరుగు అయితే పొంగనాల రుచి బాగుంటుంది. అలాగే బొంబాయి రవ్వ లేకపోతే దాని ప్లేస్‌లో సేమ్యా అయినా వాడుకోవచ్చు.
- కేవలం ఉల్లిపాయ, క్యారెట్ మాత్రమే కాకుండా క్యాబేజీ, క్యాప్సికం సహా మీకు నచ్చిన కూరగాయలను సన్నగా తరిగి వాడుకోవచ్చు.
సండే స్పెషల్ "బగారా రైస్ విత్ చికెన్ కర్రీ" - ఈ పద్ధతిలో చేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే!

