Avoid Over Fermentation Idly Dosa Batter : చాలా మంది మహిళలు టైమ్ ఉండదనో, పదే పదే చేయడానికి ఓపిక లేకనో ఒకేసారి ఐదారు లేదా వారం రోజులకి సరిపడా దోశ, ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకుంటుంటారు. అనంతరం దాన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తుంటారు. ఎలాగూ ఫ్రిడ్జ్‌లోనే ఉంది కదా అని రోజుల తరబడి యూజ్ చేస్తుంటారు. మీరూ ఇడ్లీ, దోశ పిండిని ఇలాగే వాడుతున్నారా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు. ఎందుకంటే, అలా స్టోర్ చేయడం ద్వారా పిండి ఎక్కువగా పులిసి లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. ఇంతకీ, రుబ్బుకున్న దోశ, ఇడ్లీ పిండిని ఎన్ని రోజులు ఉపయోగించవచ్చు? పిండి ఎక్కువగా పులియకూడదంటే ఏం చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
దోశ, ఇడ్లీ పిండి ఎక్కువ పులియడం వల్ల అందులోని పోషకాలు నశిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే, ఆ పదార్థం రుచి, వాసన రెండూ కోల్పోతుందంటున్నారు. అంతేకాదు, అతిగా పులిసినా పిండితో చేసే వంటలు ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు. అయితే, చాలా మంది పిండిని ఫ్రిడ్జ్‌లో ఉంచాం కదా అని పులిసే ప్రక్రియ ఆగిపోతుందనుకుంటారు. కానీ, రిఫ్రిజిరేటర్లో ఉంచినా పులిసే ప్రక్రియ నెమ్మదిగా కంటిన్యూ అవుతుందని, ఇదే పదార్థాన్ని లోలోపల పాడైపోయేలా చేస్తుందని సూచిస్తున్నారు.

ఈ క్రమంలోనే దోశ, ఇడ్లీలు చేసుకునే ముందు పిండి టెక్స్చర్‌ని బట్టి అది ఎక్కువగా పులిసిందా? సాధారణంగానే పులిసిందా? అనే విషయాలు తెలుసుకోవాలని చెబుతున్నారు. అదెలాగంటే, పిండి మరీ చిక్కగా మారినా, మరీ పల్చగా మారినా ఆ పిండి ఎక్కువగా పులిసినట్లు భావించాలి. అలాగే, ఇలాంటి పిండితో ఇడ్లీ/దోశ వంటివి చేసినప్పుడు అవి గట్టిగా మారడం, టేస్ట్ లేకపోవడం వంటివి గమనించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
'మైసూర్ బోండా' తయారీలో ఫెయిల్ అయ్యేది అక్కడే - ఈ పద్ధతిలో చేస్తే పిండి ఉడకడంతో పాటు రుచి!

జీర్ణ సమస్యల ముప్పు!
అతిగా పులిసిన పిండితో చేసిన వంటకాలు తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తప్పని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కడుపులో మంట, అజీర్తి, ఇన్ఫెక్షన్ వంటి జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే, టెక్స్చర్‌లో మార్పులతో పాటు నోటికి పుల్లగా తగిలినా, వాసనలో తేడాలొచ్చినా, పిండి ఉపరితలంపై ఆయిల్ లాంటి లేయర్ ఏర్పడినా ఆ పిండిని వాడకపోవడమే బెటర్ అని సూచిస్తున్నారు. కాబట్టి, వీలైనంత వరకు పిండి రుబ్బిన 24 గంటల్లోనే పూర్తిగా కంప్లీట్ అయ్యేలా చూసుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు.
పిండి ఎక్కువగా పులియకుండా ఉండాలంటే?
- కొందరు పిండిని రుబ్బాక ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడం మర్చిపోతుంటారు. దానివల్ల కూడా ఎక్కువగా పులిసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, అలాకాకుండా ఉండాలంటే పిండిని ఫ్రిడ్జ్‌లో ఉంచడం మర్చిపోవద్దంటున్నారు నిపుణులు.
- ఉప్పు అధికంగా వాడడం వల్ల కూడా పిండి ఎక్కువగా పులిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం బెటర్. అలాగే అవసరమైనంత పిండిలోనే ఉప్పు కలుపుకొని వాడుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
- ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు పిండి నాలుగైదు గంటల్లోనే పులిసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, రాత్రంతా బయటే ఉంచకుండా మధ్యమధ్యలో చెక్ చేస్తుండాలి. అదే, చల్లగా ఉన్నప్పుడు గంటలు గడిచినా పిండి పులవదు. ఈ క్రమంలో పిండి రెండింతలు అయిందంటే అది చక్కగా పులిసినట్లుగా అర్థం చేసుకోవాలి. అప్పుడు తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు.

- పిండి బాగా చల్లగా ఉందనో లేదంటే దోశలు వేయాలనుకున్న ప్రతిసారీ తీసి బయటపెట్టడం ఎందుకనో కొందరు నిద్ర లేవగానే ఈ బ్యాటర్ గిన్నెను ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట ఉంచుతారు. దీనివల్ల కూడా ఎక్కువగా పులిసే అవకాశం ఉంది. కాబట్టి, అవసరమున్నప్పుడే పిండిని ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి వాడుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
- సరైన పరిమాణం కంటే ఎక్కువ మినప్పప్పు వాడినా పిండి ఎక్కువగా పులిసే ఛాన్స్ ఉంటుందట! ఎందుకంటే మినప్పప్పు పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తుందంటున్నారు. అందుకే, దీన్ని అధికంగా వేయకుండా తగినంత వేసుకునేలా జాగ్రత్తపడాలంటున్నారు.
- అదేవిధంగా, మెంతులు కూడా పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. కాబట్టి, వీటిని కూడా ఎక్కువగా యూజ్ చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

దోశ పిండి పులిసిపోతే పడేస్తున్నారా? - ఇలా చేస్తే వేడివేడిగా "పునుగులు" సిద్ధం!
ఇడ్లీ/దోశ పిండి బాగా పులిసిపోయిందని పారేస్తున్నారా ? - ఇలా చేస్తే తాజాగా మారిపోతుంది!