Green Tomato Pachadi: కొన్ని పచ్చళ్లు భోజనంలోకి మాత్రమే కాదు టిఫెన్స్లోకి సూపర్‌గా ఉంటాయి. అలాంటి వాటిల్లో టమాటా పచ్చడి ముందు ఉంటుంది. ఇది ఎక్కువ మంది ఫేవరెట్ కూడా. అయితే చాలా మంది టమాటా పచ్చడిని రకరకాలుగా చేసుకుంటారు. మరి మీరు ఎప్పుడైనా పచ్చి టమాటాలతో పచ్చడి చేశారా? లేకుంటే ఓసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండి అన్నంలోకి మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశ, చపాతీ వంటి టిఫెన్స్లోకి అద్దిరిపోతుంది. అంతేకాదు, ఒక్కసారి ఈ పద్ధతిలో టమాటా పచ్చడిని చేసుకొని తిన్నారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటుంటారు. పైగా దీన్ని చాలా తక్కువ టైమ్‌లో అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- పచ్చి టమాటాలు - పావు కేజీ
- పచ్చిమిర్చి - 20
- నువ్వులు - 2 టీస్పూన్లు
- నూనె - 2 టీస్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - 15
- ఉల్లిపాయ - 1
- జీలకర్ర - అర టీస్పూన్
- కరివేపాకు - 3 రెమ్మలు
- కొబ్బరి ముక్కలు - కొన్ని
- కొత్తిమీర - గుప్పెడు
- పసుపు - పావు టీస్పూన్
- ఉప్పు - సరిపడా
- చింతపండు - 2 రెబ్బలు
- పల్లీలు - 2 రెబ్బలు
- బెల్లం ముక్క - చిన్నది

తయారీ విధానం:
- ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి, తొడిమ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. పల్లీలు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి.
- అదే పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. అనంతరం అందులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, జీలకర్ర, కరివేపాకు వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలను లైట్‌గా మగ్గించాలి.

- ఇవి కాస్త మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి.
- టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, ఉప్పు, చింతపండు రెబ్బలు వేసి కలిపి చల్లారనివ్వాలి.
- మిక్సీజార్‌లోకి నువ్వులు, వేయించిన పల్లీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఉడికించిన టమాటా ముక్కలు, బెల్లం ముక్క వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఓ గిన్నెలోకి తీసి పక్కన పెట్టాలి.

తాలింపు కోసం:
- నూనె - 2 టీస్పూన్లు
- తాలింపు గింజలు - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - చిటికెడు

- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి.
- తాలింపు గింజలు దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించాలి.
- చివరగా ఇంగువ వేసి కలిపి గ్రైండ్ చేసిన పచ్చడి వేసి ఓసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే సూపర్ టేస్టీ పచ్చి టమాటా పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- ఈ పచ్చడి కోసం పచ్చి టమాటాలు అయితే బాగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మరీ పచ్చివి లేకపోతే లైట్‌గా దోరగా ఉన్నవి అయినా వాడుకోవచ్చు.
- ఈ పచ్చడి కాస్త ఘాటుగా ఉంటేనే రుచి బాగుంటుంది. కాబట్టి దానికి తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకోవాలి.
- ఈ పచ్చడి తాలింపు లేకపోయినా బాగుంటుంది. కాబట్టి తాలింపు అనేది ఆప్షనల్.
ఘుమఘుమలాడే "చేపల పచ్చడి" - ఈ కొలతలతో చేస్తే పక్కా మూడు నెలలు నిల్వ!
రెగ్యులర్ కుర్మా బదులుగా - ఈసారి "నవరతన్ కుర్మా" చేసుకోండి! - చాలా రుచికరంగా ఉంటుంది!