ETV Bharat / offbeat

అద్దిరిపోయే "గోంగూర పల్లీ పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అమృతమే - తాలింపు కూడా అవసరం లేదు!

- బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు! - ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

gongura_palli_pachadi
gongura_palli_pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2025 at 10:30 AM IST

2 Min Read
Choose ETV Bharat

Village Style Gongura Palli Pachadi: ఇంట్లో ఎన్ని రకాల కూరలు ఉన్నా వేడివేడి అన్నంలో కొద్దిగా గోంగూర పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే కలిగే ఫీలింగ్​ మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే పుల్లగా, కారంగా ఉండే ఈ పచ్చడి రుచి చాలా బాగుండటంతో తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అందుకే చాలా మంది క్రమం తప్పకుండా దీనిని తయారు చేస్తుంటారు. అయితే గోంగూర పచ్చడిని ఎంతో మంది ఎన్నో రకాలుగా చేసుంటారు. అయితే ఓసారి ఇలా పల్లెటూరి స్టైల్లో కాస్త పల్లీలు వేసి చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పైగా ఈ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చడి తయారు చేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంటుంది. పైగా దీనికి పోపు కూడా అవసరం లేదు. మరి లేట్​ చేయకుండా ఈ గోంగూర పల్లీ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • గోంగూర - 2 కట్టలు
  • పల్లీలు - అర కప్పు
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి - 15
  • చింతపండు - చిన్న నిమ్మకాయ సైజ్​
  • ఉప్పు - సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • ఉల్లిపాయ - 1

తయారీ విధానం:

  • ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా గిల్లి రెండు మూడు సార్లు వాటర్​తో క్లీన్​ చేయాలి. ఆ తర్వాత జల్లి బుట్టలో వేసి పక్కన ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి పల్లీలు వేసి లో ఫ్లేమ్​లో కలుపుతూ వేయించాలి. పల్లీలు వేగి క్రిస్పీగా మారిన తర్వాత జీలకర్ర వేసి మరో నిమిషం పాటు వేయించి ఓ ప్లేట్​లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు అదే పాన్​లోకి నూనె వేసి వేడి చేయాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి తుంపలు వేసి వేయించుకోవాలి.
  • పచ్చిమిర్చి వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు, చింతపండు, ముప్పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి లో ఫ్లేమ్​లో గోంగూరను ఉడికించుకోవాలి.
  • గోంగూర మగ్గిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మిక్సీజార్​లోకి చల్లారిన పల్లీలు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్​ చేయాలి.
  • ఆ తర్వాత ఉడికించిన గోంగూర మిశ్రమం వేసి కచ్చాపచ్చగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసిన మిశ్రమాన్ని కడాయిలోకి తీసుకుని మీడియం సైజ్​లో కట్​ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపితే గోంగూర పల్లీ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:

  • ఈ పచ్చడి కోసం ఉపయోగించే గోంగూర పుల్లగా ఉంటే రుచి బాగుంటుంది. అందుకోసం ఎర్ర గోంగూర అయితే పర్ఫెక్ట్​.
  • ఈ పచ్చడి కోసం పచ్చిమిర్చిని మీరు తినే కారానికి అనుగుణంగా పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయాలి.
  • పల్లీల్లో పుచ్చు గింజల లేకుండా చూసుకోవాలి. లేదంటే పచ్చడి చేదు వచ్చే అవకాశం ఉంటుంది.
  • ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ తాలింపు లేకుండానే రుచి బాగుంటుంది.
  • పచ్చడిని కాస్త బరకగా గ్రైండ్​ చేస్తేనే తినేటప్పుడు నోటికి ఫ్లేవర్​ తెలుస్తుంది. రోట్లో దంచుకుంటే పచ్చడి రుచి మరింత బాగుంటుంది.

ఈ చిన్న ట్రిక్​తో సమోసాలు చేసుకోండి - మైదా లేకుండానే Extra క్రిస్పీగా, భలే రుచిగా వస్తాయి!

కప్పు ఉప్మారవ్వతో కరకరలాడే "బోండాలు" - కేవలం 10 నిమిషాల్లో రెడీ!