ఈజీగా రెస్టారెంట్ స్టైల్ "గార్లిక్ చికెన్ రోస్ట్" - అన్నం, చపాతీ, పులావ్‌లోకి అదుర్స్!
- చికెన్, వెల్లుల్లి కాంబోలో అద్దిరిపోయే రెసిపీ - ఒక్కసారి తింటే ఫిదా అయిపోతారు!

Published : September 10, 2025 at 1:50 PM IST
Garlic Chicken Roast Recipe: నాన్‌వెజ్ ఐటమ్స్‌లో చికెన్‌కు సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంటుంది. దీనితో కర్రీ, వేపుడు, ఫ్రై, పచ్చడి ఇలా రెసిపీ ఏదైనా ఇష్టంగా తింటుంటారు. అందుకే మెజార్టీ జనాలు సండేతో పనిలేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చికెన్ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే చికెన్‌తో ఎప్పుడూ చేసే రెసిపీలు కాకుండా ఓసారి ఇలా రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ చికెన్ రోస్ట్ చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. ఘాటుగా, టేస్టీగా ఉండే దీనిని పిల్లలు, పెద్దలూ ఇష్టంగా తింటారు. ఇక ఈ రెసిపి అన్నం, పులావ్, బిర్యానీ, చపాతీ, పరోటా వంటి వాటిల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా కమ్మగా ఉండే వెల్లుల్లి చికెన్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
చికెన్ మారినేషన్ కోసం:
- ఉల్లిపాయలు - 4(పెద్దవి)
- చికెన్ - ముప్పావు కేజీ
- ఉప్పు - ముప్పావు టీ స్పూన్
- పసుపు - పావు టీస్పూన్
- కారం - 1 టీస్పూన్
- చికెన్ మసాలా - 1 టీస్పూన్
- గరం మసాలా - 1 టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- పెరుగు - అర కప్పు
- కరిగించిన బటర్ - 1 టేబుల్‌స్పూన్

వెల్లుల్లి పేస్ట్ కోసం:
- వెల్లుల్లి రెబ్బలు - 10
- కారం - రుచికి సరిపడా
- జీలకర్ర - అర టీస్పూన్
- కొబ్బరి పొడి - 2 టేబుల్‌స్పూన్లు

కర్రీ కోసం:
- బటర్ - 1 టేబుల్‌స్పూన్
- దాల్చిన చెక్క - చిన్నది
- లవంగాలు - 2
- యాలకులు - 2
- పచ్చిమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:
- చిల్లుల గిన్నెలోకి చికెన్ ముక్కలు తీసుకుని శుభ్రంగా కడిగి అందులోని నీరు పూర్తిగా పోయే వరకు పక్కన ఉంచాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఉల్లిపాయలను పొడుగ్గా, సన్నగా కట్ చేసిన బాగా కాగిన నూనెలో వేసి డీప్‌ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న ఆనియన్స్ కొలత ప్రకారం ఓ కప్పు ఉండేలా చూసుకోవాలి.
- మిక్సింగ్ బౌల్లోకి శుభ్రం చేసిన చికెన్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అర కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, కరిగించిన బటర్ వేసి మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకుని పక్కన ఉంచాలి.

- వెల్లుల్లి పేస్ట్ కోసం మిక్సీజార్‌లోకి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కారం, జీలకర్ర, కొబ్బరి పొడి, మరో అరకప్పు వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి.
- 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టి బటర్ వేసుకోవాలి.
- వెన్న కరిగిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేయాలి.

- ఆ తర్వాత అందులోకి మారినేట్ చేసిన చికెన్ వేసి కలిపి హై ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు అంటూ చికెన్ వేగి లైట్‌గా కలర్ మారే వరకు మధ్యమధ్యలో కలుపుతూ వేయించుకోవాలి.
- చికెన్ లైట్‌గా వేగిన తర్వాత అర కప్పు వాటర్ పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మెత్తగా ఉడికించుకోవాలి.
- చికెన్ మెత్తగా ఉడికి ముక్కల్లోని నీరు చాలా వరకు పోయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.

- ఆ తర్వాత ముందే గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించాలి.
- నూనె పైకి తేలిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి చికెన్ రోస్ట్ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- చికెన్‌ను మారినేట్ చేసుకునేదానిని బట్టే దీని టేస్ట్ బాగుంటుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ సేపు చికెన్‌కు మసాలాలు పట్టించి పక్కన ఉంచాలి.
- వెల్లుల్లిని గ్రైండ్ చేసేటప్పుడు మీరు తినే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. చికెన్‌ను మారినేట్ చేసేటప్పుడు కొంచెం కలుపుతాం కాబట్టి, మిగతాది వెల్లుల్లిని గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే సరి.
- చికెన్ బటర్లో సరిగ్గా వేగకపోతే నీచు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా మగ్గించుకోవాలి.
- వెల్లుల్లి పేస్ట్‌ను వేసిన తర్వాత నూనెలో ఎక్కువసేపు మగ్గిస్తే రుచి మారుతుంది కాబట్టి చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే వేసుకుంటే సరి.

