Fried Mutton Recipe: మాంసాహారంలో మటన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ధర ఎక్కువైన సరే వారానికి ఒకసారి అయినా తినాలి అనుకునేవారు బోలెడు మంది. ఇక సండే మటన్ తెచ్చారంటే చాలా మంది రెగ్యులర్ పద్ధతిలో కూర వండేస్తుంటారు. మరికొద్దిమంది ఫ్రై చేస్తుంటారు. అయితే మటన్ ఫ్రై తినడానికి సూపర్‌గా ఉన్నా, వచ్చిన చిక్కంతా ప్రిపరేషన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఎంత మంచిగా చేసినా గంటల తర్వాత ముక్క నోట్లో పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది. దీంతో నమలలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే అలాంటి వారు ఓసారి ఈ పద్ధతిలో మటన్ ఫ్రై చేయండి. ముక్క ఉడికి రుచి వేరే లెవల్ ఉంటుంది. పైగా ముక్క అస్సలు గట్టిపడదు. మరి లేట్ చేయకుండా ఈ ఫ్రైడ్ మటన్ ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- మటన్ - అర కిలో
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు- అర టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి - 6
- నూనె - 4 టేబుల్‌స్పూన్
- కారం- తగినంత
- గరం మసాలా - 1 టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- జీలకర్ర పొడి - అర టీస్పూన్
- పెరుగు - 3 టేబుల్‌స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉల్లిపాయ - 1(మీడియం సైజ్)
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం:
- మటన్‌ను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి కలపాలి. ఆ తర్వాత ఓ గ్లాస్ వాటర్ పోసి మిక్స్ చేసి మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి.
- ఈ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి కలపాలి.

- స్టవ్ ఆన్ చేసి నాన్‌స్టిక్ పాన్ పెట్టి ఉడికించిన మటన్‌ను నీళ్లతో సహా పోసి హై ఫ్లేమ్‌లో నీరు ఇంకిపోయే వరకు మధ్యమధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి.
- ఈలోపు ఉల్లిపాయను సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నూనె పోసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా పెట్టుకోవాలి.

- మటన్‌లో నుంచి నీరు మొత్తం ఇగిరి పోయాక ముక్కల్లో నూనె వేసుకుని కలిపి ఓ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి.
- ఆయిల్ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత మంటను తగ్గించి రుచికి తగినంత కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.

- మసాలాలు మగ్గిన తర్వాత పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు కూడా ముక్కల్లో పూర్తిగా కలిసి నూనె కాస్త పైకి తేలిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని, తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు రెమ్మలు, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి.
- ముక్కలు మంచిగా ఉడికి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫ్రైడ్ మటన్ రెడీ. అన్నంలోకి కూడా సూపర్‌గా ఉంటుంది.

చిట్కాలు:
- ఈ ఫ్రై కోసం మటన్ మరీ లేతగా, మరీ ముదిరింది కాకుండా ఉండాలి. మటన్‌ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టాలి.
- పెరుగు బదులు సన్నగా తరిగిన రెండు టమాటాలు, గరం మసాలా బదులు మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు.
- మటన్ ముక్కలు నూనెలో మగ్గి మసాలాలు యాడ్ చేసుకుని కొత్తిమీర తరుగు చల్లే వరకు మంటను సిమ్‌లో ఉంచే ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఫ్రై అడుగంటి కూర రుచి మారుతుంది.
- కాస్త నిమ్మరసం చల్లుకుని సర్వ్ చేసుకున్నా ఫ్రైడ్ మటన్ రుచి మరింత బాగుంటుంది.
మీరు ఎన్నడూ తినని విలేజ్ స్టైల్ "చికెన్ కర్రీ" - ఆ ఘుమఘుమలకే కడుపు నిండిపోతుంది!
రెగ్యులర్ చేప ఫ్రై కాదు - ఇలా "ఫిష్ ఫ్రై విత్ ఉల్లి కారం" చేయండి - అన్నంలోకీ అదుర్స్!