Fish pulusu : మృగశిర కార్తె ఈ సారి ఆదివారం వచ్చేసింది. అసలే మృగశిర కార్తె, ఆపై ఆదివారం ఇంకేముంది! వంటగదిలో చేపల పులుసు ఘుమఘుమలాడాల్సిందే. మీరు కొర్రమీను, రవ్వ, బొచ్చె, శీలావతి ఇలా ఏ చేప తీసుకొచ్చినా సరే! పులుసు ఇలా పెట్టుకోండి టేస్ట్ అద్దిరిపోతుంది. పులుసు తయారు చేస్తుంటే వచ్చే వాసన ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఊరిస్తుంది.
హోటల్ దోసె పిండిలో వంట సోడా వేయరు - కానీ, కిటుకు అంతా అక్కడే!

కావాల్సిన పదార్థాలు :
- చేపలు - 2 కిలోలు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - అర టీస్పూన్
- కారం - 2 టీస్పూన్లు
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- మెంతులు - 1 టీస్పూన్
- నూనె - 5 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- మెంతులు - 1/4 టీస్పూన్
- ఉల్లిపాయ - 3
- వెల్లుల్లి రెబ్బ - 10
- పచ్చిమిరపకాయ - 6
- కరివేపాకు - 2 రెమ్మలు
- కల్లుప్పు - 1.5 టీ స్పూన్
- పసుపు - 1 టీస్పూన్
- కారం - 3 టీస్పూన్
- టొమాటోలు - 2
- చింతపండు రసం - 2 కప్పులు
- నీళ్ళు - 2 కప్పులు
- పచ్చి మామిడి

తయారీ విధానం :
- చేప ముక్కలు పెద్దగా కట్ చేయించుకోవాలి. గిన్నెలోకి తీసుని నిమ్మరసం పిండుకుని శుభ్రం చేసుకోవాలి. ఇపుడు 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకుని చేప ముక్కలకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కలను 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

- మసాలా పొడి తయారీ కోసం ప్యాన్ వేడి చేసి ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ పొడి చేసి పెట్టుకుంటే చేపల పులుసు ఫ్లేవర్ అద్దిరిపోతుంది.

- ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి.
- మిక్సీ జార్‌లోకి తీసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇపుడు మట్టి పాత్ర లేదా మరో కడాయి తీసుకుని 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి.
- ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని లైట్‌గా రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నపుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత 10 వెల్లుల్లి, 6 పచ్చి మిర్చి సన్నగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయలను బాగా వేయించాలి.

- 2 నిమిషాల తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఆపై ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా కలుపుకుని టమోటా ప్యూరీ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఇపుడు చింతపండు రసం పోసుకుని, పులుసులోకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఈ పులుసు మరుగుతున్నపుడు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి.

- ఆ తర్వాత గరిటె పెట్టకుండా మొత్తం కడాయిని క్లాత్‌తో పట్టుకుని కలుపుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. వాసన ఇల్లంతా కమ్మేస్తుంది. ఇపుడు ముందుగా రెడీ చేసుకున్న మసాలా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత పచ్చి మామిడి కాయ ముక్కలు వేసుకుని మరో సారి కలుపుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలు! చేపల పులుసు రెడీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకుని దించుకుని వేడి వేడి అన్నంలో తింటుంటే చేపల కూర మజా వేరే ఉంటుంది.

"మసాలా వడ" మ్యాజిక్ ఇదే! - ఇదొక్కటి కలిపితే క్రంచీగా వస్తాయి!
"పెసర గారెలు" ఇలా చేస్తే అస్సలు నూనె పీల్చవు - ఇదొక్కటి వేసి చూడండి కొత్త ఫ్లేవర్ అద్దిరిపోతుంది!