Fish Curry without Tamarind : మంచి రుచితో ఘుమఘుమలాడే చేపల కూరను చూడగానే ఎవరికైనా నోరూరిపోతుంది. ఈ క్రమంలోనే చాలా మంది నాన్‌వెజ్ ప్రియులు సండే రోజు చేపలను తెచ్చుకుంటుంటారు. అందులోనూ ఈ ఆదివారం మృగశిర కార్తె కావడంతో నాన్ వెజిటేరియన్లు ఈ రోజున తప్పకుండా చేపల కర్రీని ఆస్వాదించాలనుకుంటారు. చేపల పులుసు, ఫిష్ ఫ్రై వంటి రకరకాల వెరైటీలు చేసుకుంటుంటారు. కానీ, కొంతమంది మాత్రం ముక్క మెత్తగా ఉంటుందని, కూర నీచు వాసన వస్తుందని చేపల కూరను పెద్దగా తినడానికి ఇష్టపడరు.
అలాగే, చేపలతో ఎలాంటి కర్రీ చేసినా నీచు వాసన లేకుండా రుచికరంగా రావాలంటే ఎంతో కొంత చింతపండు తప్పక వేయాల్సిందే. ఇలా చింతపండు వేయడం ద్వారా గ్యాస్ ట్రబుల్‌తో ఇబ్బందిపడేవారు కూడా చేపల కర్రీకి దూరంగా ఉంటుంటారు. అందుకే, అలాంటి వారందరూ తినేలా చింతపండు లేకుండా చేప ముక్క చికెన్ ముక్కలా గట్టిగా ఉండి, అస్సలు నీచు వాసన రాకుండా చేసుకునే ఒక అద్భుతమైన "చేపల కూర"ను తీసుకొచ్చాం. ఇలా వండితే టేస్ట్ సూపర్‌గా ఉండి అస్సలు చేపలు అంటే ఇష్టం లేని వాళ్లూ లొట్టలేసుకుంటూ మరీ తింటారు! మరి, లేట్ చేయకుండా అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
మారినేషన్ కోసం :
- చేప ముక్కలు - కిలో
- ఉప్పు - ఒకటీస్పూన్
- కారం - రెండు టేబుల్‌స్పూన్లు
- పసుపు - పావుటీస్పూన్
కర్రీ కోసం :
- నూనె - అరకప్పు
- పెద్ద సైజ్ ఉల్లిపాయలు - రెండు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి పేస్ట్ - ఒక టీస్పూన్
- పెద్ద సైజ్ టమాటాలు - రెండు
- కారం - రుచికి తగినంత
- పసుపు - అరటీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్
- వేయించిన ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు
- గరంమసాలా - ఒక టేబుల్‌స్పూన్
- మిరియాల పొడి - పావుటీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా మీడియం సైజ్‌లో కట్ చేసిన తాజా చేప ముక్కలను తీసుకొని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి. ఆపై ముక్కల్లోని వాటర్ మొత్తం పోయేలా కాసేపు జల్లిగిన్నెలో వేసుకొని పక్కనుంచాలి.
- చేపల ముక్కల్లోని వాటర్ మొత్తం పోయాక వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని అవి ముక్కలకు పట్టేలా బాగా కలిపి మూతపెట్టి పావుగంట పాటు పక్కనుంచాలి.
- ఆలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలను వీలైనంత సన్నగా తరుక్కొని పక్కనుంచాలి.
- అనంతరం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మారినేట్ చేసుకున్న చేప ముక్కలను పాన్‌లో సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా కాస్త గట్టిగా మారేంత వరకు వేయించుకోవాలి.
- ఆవిధంగా చేప ముక్కలన్నింటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం అదే నూనెలో కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. అయితే, ముందుగా పాన్‌లో అంటుకున్నదాన్నంతా గరిటెతో గీకి తీసేసుకోవాలి. ఒకవేళ నూనె సరిపోదనిపిస్తే మరికాస్త వేసుకొని వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత ఆయిల్ కాస్త వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- ఆనియన్స్ చక్కగా వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసనపోయేంత వరకు 30 సెకన్ల పాటు వేయించుకోవాలి.
- తర్వాత ఇందులో చింతపండు పులుసు వేయం కాబట్టి టేస్ట్ బ్యాలెన్స్ కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపి మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి.
- టమాటాలు మెత్తగా మగ్గాయనుకున్నాక మూత తీసి ఒకసారి కలిపి, గరిటెతో కొద్దిగా మాష్ చేసుకోవాలి.
- తర్వాత అందులో రుచికి తగినంత కారం, పసుపు, వేయించి దంచిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా, మిరియాల పొడి యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమంలో గ్రేవీకి తగినన్ని నీళ్లు(ఒకటిన్నర కప్పులు) పోసుకొని అంత బాగా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం సరిపోకపోతే యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
- ఆపై మీడియం ఫ్లేమ్‌లో నెమ్మదిగా ఉడికించుకోవాలి. బబుల్స్ వస్తూ కూర ఉడకడం స్టార్ట్ అయ్యాక అందులో ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని గ్రేవీలో చక్కగా మునిగేలా సర్ది, మూతపెట్టి లో ఫ్లేమ్‌లో 10 నుంచి 15 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక ఒకసారి పాన్ హ్యాండిల్స్ పట్టుకొని అటు ఇటు కర్రీ మొత్తం కలిసేలా కదిపి చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని దింపేసుకుంటే చాలు. అంతే, మంచి ఫ్లేవర్‌తో చిక్కని గ్రేవీతో ఘుమఘుమలాడే "చేపల కూర" రెడీ!
ఈ టిప్స్‌తో పర్ఫెక్ట్ టేస్ట్ :
- చేప ముక్కలను ముందుగానే నూనెలో వేయించి కూర చేసుకోవడం ద్వారా ముక్కలు గట్టి పడి కర్రీ టేస్ట్ బాగుండడంతో పాటు అస్సలు నీచు వాసన రాకుండా ఉంటుంది.
- ఈ కర్రీలో చింతపండు పులుసు వేయం కాబట్టి టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం "టమాటాలు" యాడ్ చేసుకుంటున్నాం. అలాగే, వీటిని మెత్తగా మగ్గించుకుంటేనే కర్రీకి మంచి రుచితో చిక్కని గ్రేవీ వస్తుందని గుర్తుంచుకోవాలి.
- చేప ముక్కలు వేయించి కర్రీలో వేసుకుంటున్నాం కాబట్టి ముక్క పులుసు చక్కగా పీల్చుకొని ఉడకడానికి కాస్త టైమ్ ఎక్కువే పడుతుంది.
రెగ్యులర్ చేప ఫ్రై కాదు - ఇలా "ఫిష్ ఫ్రై విత్ ఉల్లి కారం" చేయండి - అన్నంలోకీ అదుర్స్!
ఈ ముద్ద వేసి "చేపల పులుసు" చేయండి - నీచు వాసన లేకుండా కమ్మగా ఉంటుంది!