Easy Snack Mirchi Pakoda Recipe: సాయంత్రమైందంటే మెజార్టీ పీపుల్ స్నాక్స్‌గా మిర్చి బజ్జీలను లాగిస్తుంటారు. రోడ్ సైడ్ బండ్ల మీద లభించే వీటిని వేడివేడిగా తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, బజ్జీ మిరపకాయలతో కేవలం బజ్జీలు మాత్రమే కాకుండా ఎన్నో రకాల వంటలూ చేసుకోవచ్చు. అందులో పకోడీ కూడా. మీరు విన్నది నిజమే. మిర్చీ బజ్జీలతో సూపర్ టేస్టీ అండ్ క్రంచీ పకోడీలు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సేమ్ బజ్జీలు తిన్నట్టే ఉంటుంది. పైగా ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. స్టఫ్పింగ్ అవసరం లేకుండా కేవలం అతి తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎలాగూ స్నాక్స్ పెట్టమని గోల చేస్తుంటారు. కాబట్టి వారికి ఇది చేసి పెడితే ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ఈ పకోడీలను ఎలా చేయాలో ఈ స్టోరీపై ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- బజ్జీ మిరపకాయలు - 10
- శనగపిండి - ముప్పావు కప్పు
- బియ్యప్పిండి - పావు కప్పు
- వాము - 1 టీ స్పూన్
- ఉల్లిపాయ - 1
- కారం - అర టీ స్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కరివేపాకు - కొద్దిగా
- వంట సోడా - చిటికెడు

తయారు చేసే విధానం:
- బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత తొడిమ తీసేసి మధ్యలోకి చీల్చి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇలా మిరపకాయలన్నింటిని కట్ చేసుకుని పక్కన ఉంచాలి. అలాగే ఇందులోకి అవసరమయ్యే ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకును సన్నగా కట్ చేసుకోవాలి.
- మిక్సింగ్ బౌల్లోకి శనగపిండి, బియ్యప్పిండి, వాము, కారం, ఉప్పు, ఉల్లిపాయ తరుగు వేసి ఓసారి కలపాలి.
- ఆ తర్వాత సన్నగా కట్ చేసిన మిరపకాయలు వేసుకుని పిండి మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
- అనంతరం కొద్దికొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని పకోడీలు వేసుకునేందుకు అనువుగా కలుపుకోవాలి. అంటే మరీ గట్టిగా కాదు, మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి.

- నీళ్లు సరిపోయాయి అనుకున్న తర్వాత పిండిని ఒకే డైరెక్షన్లో సుమారు 5 నిమిషాల పాటు ఆగకుండా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పకోడీలు గుల్లగా వస్తాయి.
- చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, వంట సోడా వేసి మరో రెండు నిమిషాలు కలిపితే పిండి రెడీ అవుతుంది.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత కలిపిన పిండిని కొద్దికొద్దిగా చేసుకుంటూ పకోడీలుగా వేసుకోవాలి.

- ఇలా కడాయికి సరిపడా పిండిని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలానే వేసుకుని కాల్చుకోవాలి.
- ఇలా రెడీ అయిన మిర్చి పకోడీలను వేడివేడిగా సర్వ్ చేసుకుని టమాటా సాస్ లేదా గ్రీన్ చట్నీతో తింటే అద్దిరిపోతాయి. నచ్చితే మీరూ ట్రై చేయండి.

టిప్స్:
- బియ్యప్పిండి బదులు పూర్తిగా శనగపిండి వాడి కూడా పకోడీలు వేసుకోవచ్చు. అయితే బియ్యప్పిండి వేస్తే పకోడీలు క్రిస్పీగా వస్తాయి.
- పిండిని ఒకే డైరెక్షన్లో బీట్ చేయడం వల్ల పకోడీలు లోపల వరకూ ఉడికి గుల్లగా వస్తాయి.
- ఈ పకోడీలకు కేవలం బజ్జీ మిరపకాయలను మాత్రమే వాడాలి. ఒకవేళ మీరు వాడే బజ్జీ మిర్చి ఏమైనా కారం అనిపిస్తే వాటిలోని గింజలు తీసేసి ఉపయోగిస్తే సరి.
హాఫ్ డే స్కూల్ నుంచి రాగానే "ఎగ్ పకోడీ" పెట్టండి - స్నాక్స్ గోలకు ఇలా నిమిషాల్లో చెక్ పెట్టండి!