క్రంచీ "బియ్యప్పిండి అప్పడాలు" - ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా పెట్టుకోవచ్చు - టేస్ట్ అదుర్స్!
- ఈజీగా చేసుకునే అప్పడాలు - స్నాక్స్, సైడ్‌డిష్‌గా అద్దిరిపోతాయి!

Published : April 10, 2025 at 10:34 AM IST
Easy Rice Flour Papad Recipe : "అప్పడం" - పప్పు, చారు, పెరుగన్నంలో సైడ్ డిష్‌గా నంజుకొని తినడానికి సూపర్ కాంబినేషన్. కేవలం అన్నంలోకి మాత్రమే కాదు ఈవెనింగ్ స్నాక్స్‌గా కూడా వీటిని తినొచ్చు. అందుకే సమ్మర్ వచ్చిందంటే మెజార్టీ అమ్మలు ఎక్కువ మొత్తంలో అప్పడాలు తయారు చేసి ఏడాదంతా స్టోర్ చేసుకుంటుంటారు. అయితే, వీటిని తయారు చేయడం వచ్చిన వారు పెద్దగా ఇబ్బంది పడరు. కానీ రానివారు ఇంట్లో అప్పడాలు చేయడమంటే చాలా పెద్ద ప్రాసెస్‌గా భావిస్తుంటారు. కానీ అలాంటి వారు కూడా చాలా సింపిల్‌గా, నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా ఎవరి సహాయం లేకుండా ఒక్కరే చాలా ఈజీగా బియ్యప్పిండితో అప్పడాలు చేసుకోవచ్చు. మరి, తేలికగా, కరకరలాడుతూ ఉండే అప్పడాలను ఇంట్లోనే సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- బియ్యప్పిండి - 1 కప్పు
- నీళ్లు - 8 కప్పులు
- జీలకర్ర - అర టీ స్పూన్
- రెడ్ చిల్లీ ఫ్లేక్స్ - 1 టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి అందులో సుమారు 6 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి.
- పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో, అదే కప్పు కొలతతో నీళ్లు తీసుకోవాలి.
- ఆ నీటిలో జీలకర్ర, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర తరుగు వేసి కలిపి మరిగించాలి.
- ఈలోపు మరో గిన్నెలోకి బియ్యప్పిండి తీసుకోవాలి. అందులోకి మిగిలిన నీళ్లు అంటే రెండు కప్పుల నీరు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- నీరు మరుగుతున్నప్పుడు సిమ్‌లో పెట్టి బియ్యప్పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి.
- మధ్యమధ్యలో కలుపుతూ సుమారు 5 నుంచి 8 నిమిషాలు పిండిని ఉడికించాలి. పిండి ఉడికి కొంచెం చిక్కగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి.
- ఈలోపు మేడ మీద తడిపిన కాటన్ క్లాత్ సెట్ చేసుకోవాలి. ఓసారి పిండిని కలిపి చిన్న స్పూన్ లేదా గరిటె సాయంతో కొద్దిగా తీసుకుని క్లాత్ మీద వేసి లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు. అప్పడాల సైజ్‌లో పిండిని వేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని అప్పడాలుగా పెట్టుకోవాలి. క్లాత్ లేదనుకుంటే ప్లాస్టిక్ షీట్ కూడా ఉపయోగించవచ్చు. అయితే ప్లాస్టిక్ మీద పిండిని వేసేటప్పుడు అది గోరువెచ్చగా ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలి.
- ఇలా పెట్టుకున్న అప్పడాలను ఎండకు బాగా ఆరబెట్టాలి. అస్సలు మెత్తగా ఉండకూడదు.
- పూర్తిగా ఎండిన తర్వాత క్లాత్ నుంచి తీసేసుకోవాలి. అందుకోసం క్లాత్ వెనకవైపు కొంచెం తడి చేసుకుంటూ ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇలా అన్నీ తీసిన తర్వాత మరో రోజు ఎండలో ఆరబెట్టాలి. పూర్తిగా ఎండిన వీటిని తేమ లేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరి. ఎంతో క్రంచీగా ఉండే అప్పడాలు రెడీ. వీటిని సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు.
- బాగా ఎండిన అప్పడాలను ఎన్ని కావాలో అన్ని ఓ ప్లేట్లోకి తీసుకుని బాగా కాగే నూనెలో వేసి వేయించుకుంటే సరి. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
చిట్కాలు:
- బియ్యప్పిండి మార్కెట్లో కొన్నదానికంటే ఇంట్లో తయారు చేసినది వాడితే మంచిది. మరీ ముఖ్యంగా రేషన్ బియ్యంతో తయారైన పిండి వాడితే అప్పడాలు రుచిగా వస్తాయి.
- అప్పడాలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా ఓ కప్పు కొలతతో చేసుకోవాలి. ఎందుకంటే అధిక మొత్తంలో చేసినప్పుడు సరిగ్గా కుదరకపోతే పిండి మొత్తం వేస్ట్ అవుతుంది. కాబట్టి ముందుగా తక్కువ మొత్తంలో చేసుకుని పర్ఫెక్ట్ అనిపిస్తే ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు.
- జీలకర్ర, చిల్లిఫ్లేక్స్, కొత్తిమీర వంటివన్నీ వద్దనుకుంటే నార్మల్‌గా నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి, ఉప్పు వేసుకుని ప్లెయిన్‌గా చేసుకోవచ్చు.

కందిపప్పు, చింతపండు లేకుండానే "హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్" - ఈ కొలతలతో చేస్తే కిర్రాక్ టేస్ట్!

