ఈ స్టైల్లో "మునక్కాయ కర్రీ" చేసుకోండి - మసాలాలు లేకుండానే చిక్కని గ్రేవీతో కమ్మని రుచి!
మసాలాలు, అల్లంవెల్లుల్లి లేకుండానే సూపర్ కర్రీ - ఒక్కసారి తింటే ఎప్పుడూ ఇలానే చేసుకుంటారు!

Published : May 20, 2025 at 12:40 PM IST
|Updated : May 20, 2025 at 12:45 PM IST
Tasty Drumstick Curry without Spices : ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో మునక్కాయలు ఒకటి. వీటిలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, మెజార్టీ పీపుల్ వేసవిలో విరివిగా లభించే మునక్కాయలతో ఎక్కువ మంది సాంబార్, పప్పు వంటివి ఎక్కువ చేసుకుంటుంటారు. అలాగే, కొందరు మునక్కాయతో మసాల కర్రీని ట్రై చేస్తుంటారు. కానీ, కొందరికి మసాలాలు అంటే ఇష్టం ఉండదు.
అలాంటి వారికోసం ఎలాంటి మసాలాలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వంటివి లేకుండానే ప్రిపేర్ చేసుకునేలా ఒక సూపర్ రెసిపీని తీసుకొచ్చాం. అవి లేకుండా కూడా చక్కని గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వంటకం. ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకొని తిన్నారంటే ఎప్పుడూ మునక్కాయలు తెచ్చినా ఇలానే కర్రీ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే, ఈ కర్రీ కేవలం అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతీ, పులావ్, రోటీ వంటి వాటిల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి, లేట్ చేయకుండా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- మునక్కాయలు - ఐదు
- పెద్ద సైజ్ ఉల్లిపాయలు - మూడు
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- టమాటాలు - మూడు
- పచ్చిమిర్చి - నాలుగైదు
- నూనె - ఐదారు టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - ఒకటీస్పూన్
- జీలకర్ర - పావుటీస్పూన్
- శనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్
- మినపప్పు - ఒకటీస్పూన్
- ఎండుమిర్చి - రెండు
- వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - రుచికి తగినంత
- పసుపు - పావుటీస్పూన్
వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!
తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి ఆపై కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
- చింతపండు నానేలోపు మరీ ముదిరినవి, లేతవి కాకుండా మీడియంగా ఉండే మునక్కాయలను తీసుకొని పీచుని మరీ ఎక్కువగా తొలగించకుండా కట్ చేసినప్పుడు వచ్చే దాన్ని మాత్రమే తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే, రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను వీలైనంత సన్నగా తరుక్కొని పక్కనుంచాలి.
- ఆ తర్వాత టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం ఒక ప్లేట్లో సన్నని హోల్స్ ఉన్న గ్రేటర్ తీసుకొని కట్ చేసిన టమాటా ముక్కలను ఒక్కొక్కటిగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా గ్రేట్ చేసేటప్పుడు తొక్కలను మాత్రం తీసేయాలి.
- అయితే, కొంతమంది గ్రేట్ చేసే ఓపిక లేక మిక్సీలో ప్యూరీలా గ్రైండ్ చేసుకుందామనుకుంటారు. కానీ, అలా చేస్తే కూరకు మంచి రుచి, టెక్చర్ రాదని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కర్రీకి సరిపడా నూనెను పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి తుంపలు, కచ్చాపచ్చాగ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో రెండుమూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
- అవి కాస్త వేగాక మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి మూతపెట్టుకొని మధ్యమధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత అందులో కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకొని కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ అవి మెత్తగా అయ్యే వరకు నూనెలో మగ్గనివ్వాలి.
- మునక్కాయలు చక్కగా మగ్గాక కారం, పసుపు వేసి కలిపి ఒకనిమిషం పాటు ఉడికించుకోవాలి.
- అనంతరం గ్రేట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి లో ఫ్లేమ్‌లో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి.
- తర్వాత అందులో నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసం, గ్రేవీకి తగినన్ని నీళ్లు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి.
- ఆపై మళ్లీ మూతపెట్టి లో ఫ్లేమ్‌లో మిశ్రమంలో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని దింపేసుకుంటే చాలు. అంతే, ఎలాంటి మసాలాలు వేయకుండానే ఎంతో రుచికరమైన "మునక్కాయ కర్రీ" రెడీ!
టిప్స్ :
- కర్రీ టేస్ట్ మొత్తం ఉల్లిపాయలను వేయించుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి, ఆనియన్స్‌ని నెమ్మదిగా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఈ రెసిపీలో చింతపండు రసం మరీ ఎక్కువగా వేసుకోకుండా మీరు తినే పులుపుకి తగినవిధంగా వేసుకోవాలి. ఎందుకంటే టమాటాల వల్ల కాస్త పులుపు వస్తుంది. దాన్ని చూసుకోని వేసుకోవాలి.
అమ్మమ్మల పద్ధతిలో కమ్మని "కందికట్టు" చేసుకోండి - పప్పుచారు కంటే కూడా భలే రుచిగా ఉంటుంది!
ఇవి రెండూ వేసి "వంకాయ ఫ్రై కారం" చేసుకోండి - పొడిపొడిగా వస్తుంది - టేస్ట్ అద్దిరిపోతుంది!

