Crunchy Rice Flour Chips: 'చిప్స్'- ఈ పేరు చెప్పగానే చిన్నపిల్లల ముఖాలు వెలిగిపోతాయి. చాలా మంది చిన్నారులు స్కూల్ నుంచి రావడం ఆలస్యం అమ్మలను డబ్బులు అడిగి మరీ షాపుకు వెళ్లి తెచ్చుకుంటుంటారు. కొన్నికొన్ని సందర్భాల్లో పిల్లలు చిప్ప్ తింటున్నారని పేరెంట్స్ ఎక్కువ మొత్తంలో ప్యాకెట్స్ కొనితెస్తుంటారు. అయితే బయట లభించే చిప్స్ ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిలో ఏవేవో రసాయనాలు కలుపుతుంటారు.
దీని వల్ల పిల్లలకు కడుపునొప్పి, వాంతులు, డయేరియా వంటివి ఇబ్బందిపెడతాయి. అయితే ఈ సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే ఇంట్లోనే చిప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా హెల్దీగా. అందుకే మీకోసం అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే బియ్యప్పిండి చిప్స్. ఒక్కసారి వీటిని ప్రిపేర్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పైగా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. అంతేకాకుండా వీటిని ఒక్కసారి చేసుకుని గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేస్తే నెల రోజులు నిల్వ ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ చిప్స్ ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- బియ్యప్పిండి - 1 కప్పు
- బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
- బటర్ - 1 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- మిరియాల పొడి - అర టీ స్పూన్
- వాము - 1 టీ స్పూన్
- నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:
- ఓ బౌల్లోకి బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, బటర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి జీలకర్ర పొడి, మిరియాల పొడి, వాము వేసి మరోసారి బాగా కలపాలి.
- అనంతరం కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి సాఫ్ట్‌గా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద స్టీమర్ లేదా ఇడ్లీ పాత్ర ఉంచి అందులో కొద్దిగా నీళ్లు పోసి మరిగించుకోవాలి.
- ఈలోపు చిల్లుల ప్లేట్ మీద తడి కాటన్ క్లాత్ ఉంచాలి. ఆ క్లాత్ మీద కలుపుకున్న పిండిని ఉంచి లైట్‌గా స్ప్రెడ్ చేసుకుని క్లాత్‌తో క్లోజ్ చేసుకోవాలి.
- ఈ ప్లేట్‌ను మరుగుతున్న పాత్రలో ఉంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 15 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి.
- ఉడికిన తర్వాత బయటికి తీసి చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని ముద్దలాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. చపాతీ పీట మీద ఓ ఉండను ఉంచి పొడి బియ్యప్పిండి చల్లుకుంటూ పల్చగా రోల్ చేసుకోవాలి.

- ఆ తర్వాత ఈ చపాతీ మీద ఫోర్క్ స్పూన్‌తో లైట్‌గా గాట్లు పెట్టుకోవాలి. అనంతరం కట్టర్ సాయంతో నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇలా పిండి మొత్తాన్ని చపాతీలుగా వత్తుకుని నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని తీసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
- నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ప్రిపేర్ చేసిన చిప్స్ వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
- క్రిస్పీగా మారిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని వేయించుకోవాలి.
- ఈ చిప్స్‌లో లైట్‌గా ఉప్పు, కారం, చాట్‌మసాలా వేసి మిక్స్ చేసి గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సూపర్ టేస్టీ బియ్యప్పిండి చిప్స్ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- పొడి బియ్యప్పిండిని జల్లించుకుని వాడితే చిప్స్ మరింత టేస్టీగా వస్తాయి.
- పిండిని కలిపేటప్పుడు బటర్ బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు.
- పిండిని ఆవిరికి ఉడికించిన తర్వాత కలుపుకునే ముందు ఏమైనా గట్టిగా అనిపిస్తే లైట్‌గా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి.
- నూనె కాగిన తర్వాత మాత్రమే చిప్స్ వేసి వేయించుకోవాలి. లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చే అవకాశం ఉంటుంది.

మైదా లేకుండా "పొట్లం సమోసా" - పిల్లలైతే ఒకటికి రెండు లాగిస్తారు - ఈవెనింగ్ స్నాక్స్‌కు బెస్ట్!