Make Crispy Onion Pakoda in Sweet Shop Style : పకోడీ మెజార్టీ పీపుల్ ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లో పకోడీని ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, స్వీట్ షాప్స్, మిర్చి బండ్ల దగ్గర అమ్మే విధంగా క్రిస్పీగా, టేస్టీగా రావట్లేదని ఫీల్ అవుతుంటారు. మీరూ జాబితాలో ఉన్నారా? అయితే, ఓసారి ఈ కొలతలు, టిప్స్ ఫాలో అవుతూ ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేసుకోండి.
టేస్ట్ స్వీట్ షాపుల్లో దొరికే పకోడీలకు ఏమాత్రం తీసిపోదు. ఎంతలా అంటే రెడీ చేసుకుని ముందు పెట్టుకున్నారంటే చేతికి, నోటికి ఉన్న బంధం తెగిపోయేంత వరకు తినేస్తారు! అంత రుచికరంగా ఉంటాయి. అంతేకాదు, ఈ స్టైల్లో పకోడీని ప్రిపేర్ చేసుకున్నారంటే కనీసం 10 నుంచి 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. పైగా గ్యాస్ ప్రాబ్లమ్ వంటి సమస్యలు కూడా ఉండవు! ఎందుకంటే ఈ రెసిపీలో శనగపిండిని చాలా తక్కువ మోతాదులో తీసుకుంటాం. మరి, లేట్ చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- ఉల్లిపాయ తరుగు - రెండు కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా
- పచ్చిమిర్చి - 4 నుంచి 6( మీ కారానికి తగినట్లు)
- సన్నని కరివేపాకు తరుగు - 3 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - అరటీస్పూన్
- వాము - అరటీస్పూన్
- పసుపు - పావుటీస్పూన్
- కారం - అరటీస్పూన్(రుచికి తగినంత)
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- జీలకర్ర పొడి - పావుటీస్పూన్
- గరంమసాలా - పావుటీస్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- బియ్యప్పిండి - ముప్పావు కప్పు
- శనగపిండి - అర కప్పు
- వేడి నూనె - 1 టేబుల్‌స్పూన్
- ఆయిల్ - వేయించడానికి తగినంత

ఈ టిప్స్‌తో పర్ఫెక్ట్ రెసిపీ :
- ఈ గట్టి పకోడీ తయారీకి శనగపిండి కంటే బియ్యం పిండి ఎక్కువగా అవసరమవుతుంది. అందుకే, ఈ పకోడీ కొన్ని రోజుల వరకు స్టోర్ కూడా ఉంటుంది.
- ఇక్కడ పకోడీ పిండిని పలుచగా కాకుండా కాస్త గట్టిగా ఉండేవిధంగానే కలుపుకోవాలి. ఎందుకంటే పిండి పలుచగా అయితే నూనెను ఎక్కువ పీల్చేస్తుందని గుర్తుంచుకోవాలి.
- నూనె సరిగా వేడి అవ్వక ముందే పకోడీ వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా కాలుతుంది. కాబట్టి, నూనె వేడయ్యాక పకోడీని వేసి వేయించుకోవాలి.
సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండిలా :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఉల్లిపాయలను రెండు కప్పుల పరిమాణంలో పొడవుగా సన్నని చీలికలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి. అలాగే, పచ్చిమిర్చిని సన్నని చీలికలుగా తరుక్కోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసిన సన్నని ఆనియన్ తరుగు, ఉప్పు వేసి చేతితో పిండుతూ 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అంటే ఉల్లిపాయ ముక్కల్లో నుంచి నీరు ఊరి బయటకు రావాలి. కాబట్టి, అంత వరకు మిక్స్ చేసుకుంటూ చేతితో మాష్ చేసుకోవాలి.
- ఇలా చేయడం ద్వారా ఆనియన్స్ పాయలు పాయలుగా విడిపోతాయి. వేయించుకునేటప్పుడు చక్కగా వేగుతాయి.
- ఉల్లి ముక్కల్లో నుంచి నీరు బయటకు వచ్చిన తర్వాత అందులో సన్నని పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, జీలకర్ర, వాము, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లి ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

- అనంతరం ఆ మిశ్రమంలో బియ్యప్పిండి, శనగపిండి వేసుకొని పిండి మొత్తం చక్కగా కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులో ఒక టేబుల్‌స్పూన్ వేడి నూనె వేసుకొని పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పలుచగా కాకుండా కొద్దిగా గట్టిగానే ఉండేలా పకోడీ పిండిని కలుపుకోవాలి.
- ఇక్కడ పిండిని ప్రిపేర్ చేసుకున్నాక వెంటనే పకోడీని ప్రిపేర్ చేసుకోవాలి. రెస్ట్ ఇవ్వకూడదు.
- అనంతరం స్టవ్ మీద ప్లాట్‌గా లేని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడి అయ్యాక స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చేతితో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకొని పకోడీల్లా వేసుకోవాలి.
- ఆపై మీడియం ఫ్లేమ్ మీదనే నిదానంగా రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి మారి, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత పకోడీని టిష్యూ పేపర్ పరచిన ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ "స్వీట్ షాప్ స్టైల్ పకోడీలు" మీ ముందు ఉంటాయి!
- ఇక దీన్ని చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. కనీసం రెండు వారాల పాటు ఉంటుంది!
- ఈ పకోడీని టమాటా, పుదీనా వంటి చట్నీలు లేకపోయినా నేరుగా తిన్నా సూపర్‌గా ఉంటుంది.
