How to Identify Water Rich Coconut : సమ్మర్ వచ్చిందంటే చాలు కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, పండ్ల రసాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా ఎండాకాలంలో ఎదురయ్యే పలు అనారోగ్య సమస్యలను తిప్పికొట్టేందుకు కోకోనట్ వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే మెజార్టీ పీపుల్ కొబ్బరి బోండాం తాగడానికి, బాటిల్స్‌లో నింపి కొబ్బరి నీళ్లు ఇంటికి తీసుకెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే కొన్నిసార్లు మనం ఎంతో ధర పెట్టి కొనే బోండాలో వాటర్ కంటే కొబ్బరి ఎక్కువగా ఉంటుంది. దాంతో సరైన కొబ్బరి బోండం తీసుకోలేదని బాధపడుతుంటారు. ఇకపై అలా బాధపడాల్సిన అవసరం లేకుండా కొబ్బరి బోండాలు కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా సులువుగా లేతగా ఉండి, ఎక్కువ నీళ్లు ఉండే బోండాన్ని గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.
షేప్ గమనించాలి : నార్మల్‌గా కొబ్బరి బోండాం ముదిరే కొద్దీ దాని పరిమాణం పొడవుగా, దీర్ఘచతురస్రాకారంగా మారుతుంది. అలాంటి వాటిలో నీళ్లు తక్కువగా ఉంటాయి. అందుకే, మీరు బోండాం కొనేటప్పుడు ఎప్పుడూ గుండ్రంగా, బంతిలా ఉబ్బినట్లు ఉండే వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో కొబ్బరి షెల్ గుండ్రంగా, పెద్ద సైజ్‌లో ఉండి నీళ్లు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు.
బోండాన్ని ఊపి చూడాలి : ఎక్కువ నీళ్లు ఉన్న కొబ్బరి బోండాం సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు బోండాం తీసుకునే ముందు ఒకసారి బాగా ఊపి చూడాలి. ఇలా గట్టిగా ఊపినప్పుడు నీటి శబ్దం వస్తే దానిని తీసుకోకండి. ఎందుకంటే దాంట్లో తక్కువ నీరు ఉందని అర్థం చేసుకోవాలి. అదే, బోండాం ఊపినప్పుడు ఎలాంటి సౌండ్ రాకపోతే అందులో కోకోనట్ వాటర్ ఎక్కువగా, నిండుగా ఉందని గమనించాలంటున్నారు.
మీరు తినే 'పుచ్చకాయ' కల్తీది కావొచ్చు - FSSAI సూచిస్తున్న ఈ చిన్న టెస్ట్‌తో ఈజీగా గుర్తించండి!

రంగు గమనించాలి : మీరు కొబ్బరి బోండాలను కొనేటప్పుడు కొన్నింటిని గమనిస్తే వాటిపై ముదురు గోధుమ రంగు మచ్చలు దర్శనమిస్తుంటాయి. అలాంటి వాటిని కొనకపోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ బోండాల్లో వాటర్ కంటెంట్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, మీరు కొబ్బరి బోండాను తీసుకున్నా పూర్తిగా ఆకుపచ్చ రంగులో తాజాగా ఉండే దాన్ని ఎంచుకోవాలి. అలాంటి వాటిల్లో ఎక్కువ నీళ్లు ఉంటాయంటున్నారు నిపుణులు.
అక్కడే తాగడం బెటర్ : మీరు ఎప్పుడు కొబ్బరి బోండాం కొనుగోలు చేసినా వీలైనంత వరకు దానిని షాపు దగ్గరే తాగడం మంచిదంటున్నారు. ఎందుకంటే అక్కడే తాగడం వల్ల కోకోనట్ వాటర్‌లో ఉండే పూర్తి పోషకాలు మీకు లభిస్తాయి. అలాకాకుండా బోండాన్ని ఎక్కువ సేపు తాగకుండా ఉంచే కొద్దీ దానిలోని పోషకాలు తగ్గిపోతాయంటున్నారు.

ఇకపోతే కొందరు లేత కొబ్బరితో ఉండే కొబ్బరిబోండాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వాటిలో వాటర్ కాస్త తక్కువగా ఉంటుందని గమనించాలి. అయితే, ఇవి కొంచం తియ్యని రుచిని కలిగి ఉంటాయి. ఇంకొందరు మాత్రం బోండాంలో పూర్తిగా వాటర్ ఉండాలనుకుంటారు. కాబట్టి, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు పైన పేర్కొన్న టిప్స్‌తో సరైన కొబ్బరి బోండాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
