Chintha Chiguru Vanakaya Curry in Telugu : వంకాయతో చేసే వంటకాలు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అందులోను గుత్తి వంకాయ కర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమందికి ఈ పేరు చెబితేనే చాలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అయితే, నార్మల్‌గా ఎక్కువ మంది గుత్తి వంకాయను చింతపండు పులుసుతో ఎక్కువగా చేసుకుంటుంటారు. అలాకాకుండా ఈసారి కొత్తగా ట్రై చేయండి. అదే, "చింతచిగురు గుత్తి వంకాయ కర్రీ". ప్రస్తుతం మార్కెట్లో విరివిగా లభిస్తున్న చింతచిగురు కాంబినేషన్లో ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేశారంటే సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు. వేడి వేడి అన్నంతో పుల్లపుల్లగా చిక్కని గ్రేవీతో తింటుంటే మస్త్ మజాను అందిస్తుంది! పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలు సులువు. మరి, లేట్ చేయకుండా అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- పావుకిలో - వంకాయలు
- గుప్పెడు - చింత చిగురు
- రెండు - పచ్చిమిర్చి
- అర కప్పు - సన్నని ఉల్లిపాయ తరుగు
- రెండు - ఎండుమిర్చి
- రెండు రెబ్బలు - కరివేపాకు
- రుచికి తగినంత - ఉప్పు
- అర చెంచా - పసుపు
- మూడు చెంచాలు - నూనె
- చెంచా - అల్లంవెల్లుల్లి పేస్ట్
- ఒక చెంచా - మినపప్పు
- ఒక చెంచా - శనగపప్పు
- పావు కప్పు - కొత్తిమీర తరుగు
- ధనియాలు - ఒక చెంచా
- ఆవాలు - ఒక చెంచా
- జీలకర్ర - ఒక చెంచా
- కారం - రుచికి తగినంత
సరికొత్త పద్ధతిలో ఘుమఘుమలాడే "చికెన్ ఫ్రైడ్ రైస్" - బిర్యానీ టేస్ట్‌తో కమ్మగా ఉంటుంది!

తయారీ విధానం :
- నోరూరించే చింతచిగురు వంకాయ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద చిన్న కడాయిలో ధనియాలు, జీలకర్రలను వేసి దోరగా వేయించుకోవాలి. ఆపై వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- తర్వాత అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, పావుకప్పులో సగం కొత్తిమీరను వేసుకొని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు తాజా నల్ల గుత్తి వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా మధ్యలోకి చీల్చుకొని ఉప్పునీటిలో వేసి పక్కనుంచాలి.
- అలాగే, ఫ్రెష్‌గా ఉండే చింతచిగురుని తీసుకొని ముందుగా కాడలన్నింటినీ తెంపుకోవాలి. లేతగా ఉన్న కాడలు తీసేయాల్సిన అవసరం లేదు. ఆపై చింతచిగురుని ఒక గిన్నెలోకి శుభ్రంగా కడిగి గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు కర్రీ తయారీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె లైట్‌గా కాగిన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకులను ఒక్కొక్కటిగా వేసుకొని కాసేపు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి.
- ఆ మిశ్రమం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అవి గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, వంకాయలు, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చింతచిగురు వేసుకొని మిశ్రణం మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.

- ఆపై మీడియం ఫ్లేమ్‌లో కాసేపు కలుపుతూ వేయించుకున్నాక గ్రేవీకి సరిపడా వాటర్, ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్, ధనియాల పొడి మిశ్రమం, రుచికి తగినంత కారం వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి, మూతపెట్టి లో ఫ్లేమ్‌లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- కూర చక్కగా మగ్గి పైన నూనె తేలుతున్న క్రమంలో మిగిలిన కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, అద్దిరిపోయే రుచితో వావ్ అనిపించే "చింతచిగురు గుత్తి వంకాయ కర్రీ" రెడీ!

ఎదిగే పిల్లలకు తినిపించాల్సిన "లడ్డు" - పాకంతో పని లేకుండా చేసుకోవచ్చు!
ఈ "గుడ్డు కారం" తిన్నారంటే వెరీ గుడ్డు అంటారు! - అంతా ఈ మసాలాలోనే ఉంది! - నోటికి పండగే