Chintachiguru Endu Royyala Kura: "ఎండు రొయ్యలు" ఈ పేరు చెప్పగానే ఎప్పుడెప్పుడు కూర చేసుకుని తిందామా అని ఎదురుచూసేవారు చాలా మందే ఉంటారు. పచ్చి రొయ్యలు కొద్దిమంది మాత్రమే తింటే, ఎండినవి మాత్రం మెజార్టీ పీపుల్ తింటుంటారు. ఇక తెలంగాణ రుచుల్లో ఎండు రొయ్యలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చక్కగా పండిన టమాటాల్లో ఎండు రొయ్యలు వేసి కర్రీ చేస్తే ఆ రుచికి ఎవరైనా మైమరచిపోవాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఎప్పుడూ అలానే కాకుండా ఈసారి సీజనల్‌గా లభించే చింతచిగురుతో ఎండు రొయ్యల కూర చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పైగా చాలా తక్కువ సమయంలో ఎంతో రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా చింతచిగురు ఎండు రొయ్యల కూర ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- చింతచిగురు - 100 గ్రాములు
- ఎండు రొయ్యలు - 100 గ్రాములు
- నూనె - 4 టేబుల్‌స్పూన్లు
- ఉల్లిపాయ - 2
- పచ్చిమిర్చి - 4
- ఎండుమిర్చి - 2
- ఆవాలు - అర టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- పసుపు - పావు టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
- ఉప్పు - సరిపడా
- కారం - తగినంత
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:
- ముందుగా ఎండురొయ్యలను శుభ్రం చేసుకోవాలి. అందుకోసం వాటికి ఉండే తల, తోకలు తీసేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి శుభ్రం చేసిన ఎండురొయ్యలు వేసి మీడియం ఫ్లేమ్‌లో కాస్త రంగు మారే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇప్పుడు వాటిని వేడి నీటిలో వేసి ఓ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.

- అలాగే చింతచిగురులో ఉండే పుల్లలు తీసేసిన తర్వాత దానిని కాస్త నలిపి పక్కన పెట్టాలి. కూరకు అవసరమయ్యే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. కాగిన నూనెలో వేయించి కడిగిన ఎండు రొయ్యలు వేసి ఫ్రై చేయాలి.

- ఎండు రొయ్యలు నూనెలో మగ్గిన తర్వాత వాటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే నూనెలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
- అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి కాస్త రంగు మారే వరకు ఫ్రై చేయాలి.

- ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు ఫ్రై చేయాలి.
- అల్లం మగ్గిన తర్వాత శుభ్రం చేసిన చింతచిగురు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి.
- చింతచిగురు నూనెలో బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మగ్గించాలి.

- కారం వేగి పచ్చివాసన పోయిన తర్వాత వేయించిన ఎండు రొయ్యలు వేసి కలిపి 5 నిమిషాలు ఫ్రై చేయాలి.
- చివరగా ధనియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు ఎండు రొయ్యల కూర రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- లేత చింత చిగురు అయితే కూర రుచి బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేతది లేకపోతే ఉన్న చిగురులోనే కాడలు, పుల్లలు లేకుండా చూసుకోండి.
- ఎండురొయ్యలను ఓసారి మామూలుగా, మరోసారి నూనెలో వేయించడం వల్ల నీచు వాసన అనేది లేకుండా కూర రుచిగా ఉంటుంది.
- అలాగే రొయ్యలను మామూలుగా వేయించిన తర్వాత కచ్చితంగా రెండుమాడు సార్లు వేడినీటితో కడగాలి. లేదంటే వాటిలో రాళ్లు ఉండి తింటుంటే పంటికి తగులుతాయి.
- చింతచిగురు, ఉప్పు, కారం అన్ని మగ్గిన తర్వాత మాత్రమే రొయ్యలు వేయాలి. ఎందుకంటే ముందే నూనెలో రొయ్యలు వేయించుకున్నాం కాబట్టి, మళ్లీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పనిలేదు. కేవలం మసాలాలు పట్టే వరకు వేయిస్తే సరిపోతుంది.

కరకరలాడే "మూంగ్ దాల్" బయట కొనాల్సిన పనిలేదు - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి!
పాతకాలం నాటి "దోసకాయ చికెన్" - ఉల్లిపాయలు అవసరం లేదు! - ఘుమఘుమలాడిపోద్ది!