Chinta Chiguru Chicken Recipe in Telugu : వేసవిలోనే విరివిగా దొరికే ఆహార పదార్థాల్లో మొదటిది మామిడి అయితే రెండోది చింతచిగురు. ఉండీలేనట్టుగా పులుపు, కాస్త వగరుని కలబోసుకుని భలే టేస్టీగా ఉంటుంది ఇది. అలాంటి చింతచిగురుని పప్పులో వేసినా, తాలింపు పెట్టి పులిహోర చేసినా, ఏదైనా నాన్‌వెజ్‌తో కలిపి మసాలాలు దట్టించి కర్రీ చేసినా అదుర్స్ అనాల్సిందే. ఇప్పుడు మీ అందరి కోసం అలాంటి ఒక సూపర్ రెసిపీనే తీసుకొచ్చాం. అదే, నోరూరించే విలేజ్ స్టైల్ "చింతచిగురు చికెన్ కర్రీ". ఈ పద్ధతిలో చికెన్ కూర చేశారంటే ఎన్నడూ తినని రుచిలో సరికొత్త టేస్ట్‌ని అనుభవిస్తారు. రుచిలో మాత్రమే కాదు చింతచిగురుతో చేసే ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు! మరి, నోరూరించే ఈ చింతచిగురు చికెన్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

తీసుకోవాల్సిన పదార్థాలు :
మారినేషన్ కోసం :
- చికెన్ - ముప్పావుకిలో
- ఉప్పు - ఒకటీస్పూన్
- కారం - రెండు టీస్పూన్లు
- పెరుగు - ఒక కప్పు
- నూనె - ఒకటీస్పూన్

కర్రీ కోసం :
- చింతచిగురు తురుము - 100 గ్రాములు
- నూనె - తగినంత
- మీడియం సైజ్ ఉల్లిపాయలు - మూడు
- పచ్చిమిర్చి - నాలుగు
- కరివేపాకు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒకటీస్పూన్
- పసుపు - అరటీస్పూన్
- కారం - రుచికి తగినంత
- ధనియాల పొడి - 2 టీస్పూన్లు
- గరంమసాలా - ఒకటీస్పూన్
నీచు వాసన లేకుండా "చికెన్ ఫ్రై" - ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు! - అన్నింటిలోకి అదుర్స్!

తయారీ విధానం :
- ఈ సూపర్ టేస్టీ కర్రీ కోసం ముందుగా చికెన్‌ని మారినేట్ చేసుకోవాలి.
- అందుకోసం ముందుగా ఒక బౌల్లో శుభ్రంగా కడిగిన చికెన్‌ని తీసుకొని ఉప్పు, కారం, పెరుగు, ఒక టీస్పూన్ నూనె వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కలకు పట్టేలా బాగా కలిపి అరగంట పాటు పక్కనుంచాలి.
- ఆలోపు తాజా లేత చింతచిగురును తీసుకొని కాడల నుంచి ఆకులను తుంచి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆపై ఒకట్రెండుసార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత చింతచిగురుని చాకుతో సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే, రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను సన్నగా, పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి.
- చింతచిగురుని సన్నగా తురుముకోవడం ద్వారా కూర వండిన తర్వాత ఆకులు దారాలుగా ఉండకుండా గ్రేవీ చక్కగా వస్తుంది.

- ఇప్పుడు కర్రీ తయారీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి.
- నూనె కాస్త వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూతపెట్టి ఆనియన్స్ ఎర్రగా వేగే వరకు మధ్యమధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి.
- ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
- అనంతరం మారినేట్ చేసి అరగంట పాటు పక్కనుంచిన చికెన్‌ని వేసి హై ఫ్లేమ్‌లో ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
- ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టి స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌కి టర్న్ చేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

- తర్వాత మూత తీసి ఒకసారి కలిపి పసుపు, కారం, ధనియాల పొడి, గరంమసాలా వేసి మసాలాలన్ని ముక్కలకు పట్టేలా కాసేపు కలుపుతూ వేయించాలి.
- ఆపై గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూతపెట్టి మరో రెండుమూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
- చికెన్ చక్కగా ఉడికిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న చింతచిగురు వేసి ఒకసారి మొత్తం కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, పుల్లగా, కారంగా, రుచికరంగా ఉండే కమ్మని "చింతచిగురు చికెన్ కర్రీ" రెడీ అయిపోతుంది!

టిప్స్ :
- ప్రస్తుతం వేసవి సీజన్ నడుస్తుండడంతో చింతచిగురు ఆకుకూరలు అమ్మే చోట, బయట సూపర్ మార్కెట్స్‌లో విరివిగా లభిస్తుంది.
- అలాగే, చికెన్ చక్కగా ఉడికిన తర్వాత మాత్రమే చింతచిగురుని వేసి కాసేపు ఉడికించి దింపేసుకోవాలి. అలాకాకుండా చికెన్ ఉడకముందే చింతచిగురు వేస్తే అది బాగా ఉడికి కర్రీ మెత్తగా మారిపోతుంది.
మీరు ఎన్నడూ తినని విలేజ్ స్టైల్ "చికెన్ కర్రీ" - ఆ ఘుమఘుమలకే కడుపు నిండిపోతుంది!
అద్దిరిపోయే టేస్ట్‌తో "చికెన్ వేపుడు విత్ ఎండుమిర్చి పేస్ట్" - సండే పండగ చేస్కోండి!