మిగిలిపోయిన ఇడ్లీలతో కమ్మని "స్నాక్" - పిల్లలైతే యమ్మీ యమ్మీ అంటూ తింటారు!
"చిల్లీ ఇడ్లీ" ఎప్పుడైనా తిన్నారా? - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది!

Published : September 14, 2025 at 2:55 PM IST
Chilli Idli Recipe in Telugu : మల్లెపువ్వులాంటి తెల్లటి ఇడ్లీ పైన ఘుమఘుమలాడే నెయ్యి చల్లి, పొగలు కక్కే సాంబార్‌లో ముంచుకునో లేదంటే ఇంత కారప్పొడీ అంత పల్లీచట్నీ అద్దుకుని తింటుంటే ఆ టేస్ట్ అద్దిరిపోతుంది. ఇలా తినడాన్ని కొంతమంది చాలా ఇష్టపడుతుంటారు కూడా. కానీ, మరికొందరు మాత్రం 'ఇడ్లీ' పేరు వినిపించగానే మొహం చిట్లిస్తూ ‘అమ్మో నాకొద్దు’ అంటుంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చేసిన ఇడ్లీలు మిగిలిపోతుంటాయి. అలాగని మిగిలిన ఇడ్లీలను పారేయాలంటే మనసొప్పదు. అయితే, డోంట్‌వర్రీ మిగిలిపోయిన ఇడ్లీలతో మంచి రుచికరంగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ ఉంది. అదే, నోరూరించే "చిల్లీ ఇడ్లీ". ఇలా చేసి పెట్టారంటే పిల్లలతో పాటు ఇడ్లీ వద్దన్నవారూ లొట్టలేసుకుంటూ తింటారు. మరి, ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- ఇడ్లీలు - పది
- మొక్కజొన్నపిండి - ఆరు టేబుల్‌స్పూన్లు
- బియ్యప్పిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు
- వెనిగర్ - ఒక చెంచా
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె - వేయించేందుకు సరిపడా
- అల్లం తరుగు - రెండు చెంచాలు
- వెల్లుల్లి తరుగు - రెండు చెంచాలు
- ఉల్లిపాయలు - రెండు
- క్యాప్సికం - రెండు
- పచ్చిమిర్చి - నాలుగైదు
- టమాటా కెచప్ - నాలుగు టేబుల్‌స్పూన్లు
- చిల్లీసాస్ - రెండు టేబుల్‌స్పూన్లు
- ఉల్లికాడల తరుగు - నాలుగు టేబుల్‌స్పూన్లు
ఉల్లిపాయ వేసి "కారప్పూస" చేయండి - సూపర్ టేస్టీ అండ్ క్రంచీ - పిల్లలు ఇష్టపడతారు!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక్కో ఇడ్లీని నాలుగు ముక్కలుగా కోసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచాలి.
- అలాగే, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్‌ను సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఐదు టేబుల్స్పూన్ల మొక్కజొన్నపిండి, బియ్యప్పిండి, అరచెంచా ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చిక్కగా, బజ్జీల పిండిలా కలుపుకోవాలి.

- అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని చక్కగా పిండి కోట్ అయ్యేలా ముంచి కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి.
- పాన్‌లో వేయించడానికి సరిపడా వేసుకున్న అనంతరం వెంటనే తిప్పకుండా కాసేపు వేగనిచ్చి ఆపై గరిటెతో అటు ఇటు తిప్పేసుకుంటూ ఎర్రగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే ఇడ్లీ ముక్కలన్నింటిని వేయించి పక్కకు తీసుకోవాలి.

- అనంతరం స్టవ్ మీద మరో పాన్ లేదా కడాయి పెట్టుకుని నాలుగైదు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ కాగాక కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నని క్యాప్సికం ముక్కలు వేసుకుని అన్నింటినీ చక్కగా వేయించుకోవాలి.
- అవి వేగిన తర్వాత ఆ మిశ్రమంలో చాలా కొద్దిగా ఉప్పు, సోయాసాస్, టమాటా కెచప్, చిల్లీసాస్, వెనిగర్ వేసుకుని అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసుకుని కలిపి లో ఫ్లేమ్‌లో కాసేపు మగ్గనివ్వాలి.

- చివరగా మిగిలిన మొక్కజొన్నపిండిని ఒక చిన్న బౌల్లోకి తీసుకుని నాలుగైదు చెంచాల వాటర్ వేసి కలిపి దాన్ని ఇడ్లీ ముక్కల మిశ్రమంలో యాడ్ చేసి బాగా కలపాలి.
- ఆపై లో టూ మీడియం ఫ్లేమ్‌లో మూడ్నాలుగు నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి ఉల్లికాడల తరుగుతో గార్నిష్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే "చిల్లీ ఇడ్లీ" స్నాక్ రెసిపీ మీ ముందు ఉంటుంది!
"మటన్ కర్రీ" ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొట్టిందా? - ఇలా వెరైటీగా చేస్తే ఇంటిల్లిపాదీ ఫుల్ ఖుష్!
సండే స్పెషల్ : పిల్లల కోసం సూపర్ "స్నాక్" - కూల్ వెదర్లో కమ్మగా కరకరలాడుతాయి!

