How to Make Chicken Fry with Red Chilli Paste: నాన్‌వెజ్‌లో మెజార్టీ పీపుల్ ఇష్టంగా తినేది చికెన్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హ్యాపీగా లాగించేస్తారు. ఇక చికెన్ అనగానే కర్రీ, వేపుడు, పచ్చడి అంటూ ఎన్నో రకాలుగా చేసుకుంటుంటారు. అయితే చికెన్ వేపుడును ఎప్పుడూ రొటీన్‌గానే చేసుకుంటారు కొందరు. వెరైటీగా ట్రై చేద్దామని అనుకున్నా, ఎక్కడ కుదరదో అన్న భయంతో పాత పద్ధతిలో వండుకుని తినేస్తారు. మరికొందరు అస్సలు ఫ్రై జోలికే పోరు. అయితే అలాంటివారందరు చాలా సింపిల్‌గా, టేస్టీగా వేపుడు చేసుకోవచ్చు. అది కూడా ఎండుమిర్చి పేస్ట్‌తో. మొదటిసారి చేసినా సరే అద్భుతంగా వస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- చికెన్ - అర కేజీ
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - అర టీ స్పూన్
- ఎండుమిర్చి - 15
- ఉల్లిపాయ - 2 (మీడియం సైజ్)
- అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 టీ స్పూన్లు
- టమాటా - 1
- కరివేపాకు ఆకులు - గుప్పెడు
- జీడిపప్పు - 10
- నెయ్యి - 1 టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- గరం మసాలా - 1 టీ స్పూన్
- జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:
- ఓ బౌల్లోకి ఎండుమిర్చి తీసుకుని గోరువెచ్చని నీరు పోసి సుమారు అరగంట సేపు నాననివ్వాలి.
- మరో గిన్నెలోకి చికెన్ తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వంపేసి పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత కడిగిన చికెన్ ముక్కలు, 1 టీ స్పూన్ ఉప్పు, పసుపు వేసి హై ఫ్లేమ్‌లో నాలుగు నిమిషాలు వేయించుకోవాలి.
- ఆ తర్వాత మూత పెట్టి ఫ్లేమ్‌ను లో టూ మీడియంలో పెట్టి చికెన్‌ను ఉడికించుకోవాలి.
- ఈలోపు నానిన ఎండుమిర్చిని పేస్ట్ చేసుకోవాలి. అందుకోసం మిక్సీజార్‌లోకి ఎండుమిర్చి తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.

- చికెన్ ముక్కలు ఉడికి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు మగ్గించాలి.
- ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి.
- అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఎండుమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి వేయించుకోవాలి.
- ఎండుమిర్చి పేస్ట్ మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
- అనంతరం మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, జీడిపప్పు వేసి మగ్గించాలి.
- 5 నిమిషాల తర్వాత నెయ్యి వేసి మరో రెండు నిమిషాలు మగ్గించి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఓ నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- చివరగా కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకుంటే ఎండుమిర్చి చికెన్ వేపుడు రెడీ. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
టిప్స్:
- బోన్‌లెస్ చికెన్ కూడా ఉపయోగించవచ్చు. అయితే ముక్కలను ఒకే పరిమాణంలో కోసుకోవడం వల్ల అవి సమానంగా ఉడుకుతాయి.
- మీరు ఉపయోగించే ఎండుమిర్చి రకాన్ని బట్టి కారం ఉంటుంది. మీకు తక్కువ కారం కావాలంటే తక్కువ కారం ఉండే మిర్చిని ఎంచుకోండి.
- కొత్తిమీరతో పాటు చివరగా అర చెక్క నిమ్మరసం పిండుకుంటే రుచి మరింత అద్దిరిపోతుంది.
ఒక్కసారి ఇలా "చికెన్ ఫ్రై" చేయండి - ఇంట్లో వాళ్లు ఎప్పుడూ అలాగే వండమనడం పక్కా!
బ్యాచిలర్స్ స్పెషల్ "చికెన్ ఫ్రై" - ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే!