సండే స్పెషల్ "చికెన్ కర్రీ" - ఇలా చేస్తే "గరం మసాలా" అవసరం లేదు - టేస్ట్ వేరే లెవల్!
-ఎప్పుడూ చేసేలా కాకుండా ఈ పద్ధతిలో సరికొత్తగా చేయండి!

Published : June 29, 2025 at 12:44 PM IST
|Updated : June 29, 2025 at 2:57 PM IST
Chicken Curry Recipe: సండే వచ్చిందంటే లంచ్ లేదా డిన్నర్‌లోకి నాన్‌వెజ్ ఉండాల్సిందే. అందులోనూ చికెన్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తినేస్తారు. ఈ క్రమంలోనే చికెన్ కర్రీనే వివిధ రుచుల్లో ట్రై చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సండే ఒక ప్రత్యేకమైన చికెన్ కర్రీని మీ ముందుకు తీసుకువచ్చాం. చాలా తక్కువ మసాలాలతో, ఘుమఘుమలాడే వాసనతో తయారు చేసే ఈ కూరతో ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తారు. ఈ కూర అన్నం, చపాతీ, పూరీ, బగారా వంటి వాటిల్లోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేస్తుంటారు. మొదటిసారి చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి లేట్ చేయకుండా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- చికెన్ - 1 కేజీ
- నూనె - 4 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - అర టీస్పూన్
- ఉల్లిపాయలు - 2
- పచ్చిమిర్చి - 3
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్‌స్పూన్లు
- పసుపు - అర టీస్పూన్
- ఉప్పు - సరిపడా
- కారం- తగినంత
- ధనియాల పొడి - 1 టేబుల్‌స్పూన్
- కసూరీ మేథీ - కొద్దిగా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:
- చికెన్‌ను ఓ గిన్నెలోకి తీసుకుని రెండుమూడుసార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పూర్తిగా వంపేసి పక్కన పెట్టాలి.
- కూరలోకి అవసరమయ్యే ఉల్లిపాయలను పొడుగ్గా, సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
- జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్‌లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
- ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి.

- అల్లం పచ్చి వాసన పోయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి కలిపి మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాలు వేయించుకోవాలి.
- ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి చికెన్ ముక్కలను నూనెలో మగ్గించుకోవాలి.
- చికెన్‌లో నీరు ఊరి ముక్కలు కాస్త లైట్‌గా రంగు మారిన తర్వాత పసుపు వేసి కలిపి మరికొద్దిసేపు మగ్గించుకోవాలి.

- చికెన్ ముక్కల్లోని నీరు ఇంకిన తర్వాత రుచికి సరిపడా కారం వేసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి.
- కారం మగ్గిన తర్వాత మీ గ్రేవీకి సరిపడా వాటర్ పోసి కలిపి మంటను సిమ్ టూ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కూర దగ్గరపడేవరకు ఉడికించుకోవాలి.

- సుమారు పావు గంట నుంచి 20 నిమిషాల తర్వాత మూత తీసి కలిపి ధనియాల పొడి, కసూరీ మేథీ వేసి మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి.
- చికెన్ ముక్కలు మంచిగా ఉడికి, కూర దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ కూర రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- ఈ కూర కోసం స్కిన్ లేదా స్కిన్లెస్ చికెన్ రెండూ బాగుంటాయి. ఒకవేళ మీరు స్కిన్ ఉన్నది ఉపయోగిస్తే కాల్చిన చికెన్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
- స్కిన్ ఉన్న చికెన్ ఉపయోగిస్తే కూరలో నూనె కాస్త తగ్గించి పోసుకోవాలి. ఎందుకంటే చికెన్ తోలు నుంచి నూనె ఊరుతుంది.
- ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. లేదంటే కూర తియ్యగా ఉండే అవకాశం ఉంటుంది.
- చికెన్ ముక్కలు నూనెలో మగ్గేదాన్ని బట్టే కూర రుచి ఆధారపడుతుంది. కాబట్టి ముక్కలు నూనెలో సరిగా వేగిన తర్వాత మాత్రమే కారం వేసుకుంటే మంచిది.
- మీరు తినే గ్రేవీని బట్టి నీరు పోసుకోవాలి. చిక్కగా కావాలనుకుంటే తక్కువ నీరు, పులుసుగా కావాలంటే కొంచెం ఎక్కువ నీరు పోసి ఉడికించుకోవచ్చు.
బ్యాచిలర్స్ కోసం అద్దిరిపోయే "చికెన్ ఫ్రై" - తక్కువ పదార్థాలతోనే ఘుమఘుమలాడిపోతుంది!
సరికొత్త పద్ధతిలో ఘుమఘుమలాడే "చికెన్ ఫ్రైడ్ రైస్" - బిర్యానీ టేస్ట్‌తో కమ్మగా ఉంటుంది!

