ETV Bharat / offbeat

ఈ ముద్ద వేసి "చేపల పులుసు" చేయండి - నీచు వాసన లేకుండా కమ్మగా ఉంటుంది!

తక్కువ మసాలాలతో అద్దిరిపోయే చేపల కర్రీ - పాతకాలం ఈ రెసిపీ సీక్రెట్ ఇదే!

Chepala Pulusu Recipe
Old Style Chepala Pulusu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 1, 2025 at 11:04 AM IST

4 Min Read
Choose ETV Bharat

Old Style Chepala Pulusu Recipe : చేపలు అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలలో ఒకటి. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెరైటీ వంటకంగా వండుకుంటుంటారు. అయితే, ఇప్పుడంటే రకరకాల మసాలా పొడులు వాడి వివిధ రుచులలో చేపల కర్రీలను ప్రిపేర్ చేసుకుంటున్నాం. కానీ, అలాంటివేమి అందుబాటులో లేని పాతకాలం రోజుల్లో కేవలం ఇంట్లో ఉండే కొన్ని మసాలాలతోనే ఘుమఘుమలాడేలా "చేపల పులుసు" పెట్టేవారు. ఇది అస్సలు నీచు వాసన లేకుండా కమ్మని గ్రేవీతో నోరూరిస్తుంది. మరి, మీరూ ఓసారి అమ్మమ్మలు చేసే పద్ధతిలో "చేపల పులుసు" ట్రై చేయండి. రుచి అద్దిరిపోతుంది. చేపలు అంటే ఇష్టం లేనివారు కూడా లొట్టలేసుకుంటూ ఒక ముద్ద ఎక్కువే తింటారు! వంటరాని వాళ్లు కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకీ, ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజంత
  • మెంతులు - పావుటీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 10 నుంచి 15
  • పెద్ద సైజ్ ఉల్లిపాయ - ఒకటి
  • చేపలు - ఒక కేజీ
  • ఉప్పు - రుచికి తగినంత
  • పసుపు - పావుటీస్పూన్
  • కారం - రుచికి సరిపడా
  • కరివేపాకు - కొద్దిగా
  • పచ్చిమిర్చి - ఎనిమిది
  • నూనె - ఆరు టీస్పూన్లు(తగినంత)
  • బటర్ - ఒక టేబుల్​స్పూన్
  • సన్నని కొత్తిమీర తరుగు - కొద్దిగా

ఘుమఘుమలాడే "కరివేపాకు చికెన్ కర్రీ" - గరం మసాలా లేకుండానే కమ్మని గ్రేవీతో నోరూరిస్తుంది!

తయారీ విధానం :

  • ఈ ట్రెడిషనల్ టేస్టీ చేపల కూర కోసం ముందుగా ఒక గిన్నెలో చింతపండుని తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆపై అందులో తగినన్ని నీళ్లు పోసి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మెంతులను వేసి లో ఫ్లేమ్​లో అవి రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి.
  • అనంతరం రోట్లో పూర్తిగా చల్లారిన మెంతులను వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు అదే రోలులో పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మెత్తగా దంచుకొని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం రెసిపీలోకి కావాల్సిన చేప ముక్కలను శుభ్రంగా కడిగి కర్రీ వండుకోవడానికి వీలైన గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఆపై అందులో ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అవన్ని ముక్కలకు పట్టేలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమంలో నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు, నూనె వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం ఇంగ్రీడియంట్స్ అన్ని చేప ముక్కలకు పట్టేలా మూతపెట్టి అరగంటపాటు పక్కనుంచాలి.
  • అరగంట తర్వాత మూత తీసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి కూరకు సరిపడినంత పులుసుని పిండి పోసుకోవాలి. అలాగే, గ్రేవీకి సరిపడా వాటర్​ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా నెమ్మదిగా కలపాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చేప ముక్కలు ఉన్న గిన్నెను ఉంచి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత మూత తీసి ఏదైనా క్లాత్​తో గిన్నెను పట్టుకొని ఒకసారి మిశ్రమం మొత్తం కదిలేలా అటు ఇటు తిప్పాలి.
  • ఆపై మళ్లీ మూతపెట్టి లో ఫ్లేమ్​లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అనంతరం మూత తీసి మరో రెండుమూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి.
  • తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మెంతుల మిశ్రమం ఉన్న గిన్నెలో కొద్దిగా కర్రీలోని సూప్ పోసి పల్చగా చేసుకొని చేపల మిశ్రమంలో పోసుకోవాలి. ఇలా చేయడం ద్వారా అది త్వరగా కర్రీలో కలిసిపోతుంది.
  • ఇవి యాడ్ చేసుకున్నాక మరోసారి బాగా కలిపి ఇదే స్టేజ్​లో ఉప్పు, కారం చెక్ చేసుకోవాలి.
  • ఆపై అందులో బటర్, కొత్తిమీర తరుగు వేసి మూతపెట్టి లో ఫ్లేమ్​లో మరో పదినిమిషాల పాటు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత కర్రీపైన రెండు కరివేపాకు రెమ్మలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని మూతపెట్టి అరగంట నుంచి గంటపాటు అలాగే ఉంచి ఆపై సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే పాతకాలం నాటి "చేపల పులుసు" రెడీ!

ఈ టిప్స్​తో పర్ఫెక్ట్ టేస్ట్ :

  • ఇక్కడ టమాటాలు వాడట్లేదు కాబట్టి మీరు తినే పులుపుకి తగినవిధంగా చింతపండుని వేసుకోవాలి. అప్పుడే కర్రీ మంచి రుచికరంగా వస్తుంది.
  • ఈ చేపల కూరలో ఉల్లిపాయ దంచి వేయడం వల్ల కర్రీకి తగినంత గ్రేవీ రావడంతో పాటు అదనపు టేస్ట్ వస్తుంది. ఇదే ఈ కర్రీ అసలు సీక్రెట్​గా చెప్పుకోవచ్చు.
  • ఒకవేళ మీకు మట్టి పాత్రలు అందుబాటులో ఉంటే అందులో ఈ కర్రీ చేసుకుంటే అద్భుతమైన రుచితో ఘుమఘుమలాడిపోతుంది.

కేజీ చికెన్​ గ్రేవీకి పర్ఫెక్ట్​ కొలతలివే! - బ్యాచిలర్స్​ కుక్కర్​లోనే వండుకోవచ్చు! రైస్, పులావ్​, చపాతీల్లో కిర్రాక్​!

కుక్కర్​లో నిమిషాల్లోనే "మటన్​ పులావ్​" - వంట రానివాళ్లు కూడా చేసేయొచ్చు! - ఇంటిల్లిపాదీ కుమ్మేస్తారు!