అద్దిరిపోయే రుచితో "చనా పాలక్ మసాలా కర్రీ" - పిల్లలకూ చాలా బాగా నచ్చుతుంది!
-పాలకూర, శనగల కాంబోలో కిర్రాక్ కర్రీ - ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే!

Published : October 9, 2025 at 5:15 PM IST
Chana Palak Masala Recipe : ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, పిల్లలతో పాటు కొంతమంది పెద్దవాళ్లూ పాలకూరను అంతగా తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం మీరు ఇప్పటి వరకు ట్రై చేయని ఒక స్పెషల్ రెసిపీని పరిచయం చేస్తున్నాం. అదే, నోరూరించే "చనా పాలక్ కర్రీ". పాలకూర, శనగల కాంబోలో రెడీ అయ్యే ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇది అన్నం, చపాతీ, రోటీల్లోకి మంచి కాంబినేషన్ అవుతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. మరి, ఈ రుచికరమైన చనా పాలక్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- శనగలు - రెండు కప్పులు
- పాలకూర గుజ్జు - ఒకటిన్నర కప్పు
- ఆయిల్ - పావుకప్పు
- జీలకర్ర - చెంచా
- బిర్యానీ ఆకు - ఒకటి
- దాల్చినచెక్క - చిన్నముక్క
- వెల్లుల్లి తరుగు - ఒక టేబుల్‌స్పూన్
- ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
- అల్లం పచ్చిమిర్చి పేస్ట్ - రెండు చెంచాలు
- టమాటా గుజ్జు - ఒక కప్పు
- పసుపు - పావు చెంచా
- కారం - ఒక చెంచా(తగినంత)
- చోలే మసాలా - ఒక చెంచా
- ధనియాల పొడి - ఒక చెంచా
- జీలకర్ర పొడి - ఒక చెంచా
- గరంమసాలా - అర చెంచా
- ఉప్పు - రుచికి తగినంత
ఘుమఘుమలాడే "గోంగూర వంకాయ కర్రీ" - ఎన్నడూ తినని రుచిలో భలే కమ్మగా!
తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో కాస్త పెద్ద సైజ్‌లో ఉండే శనగలు తీసుకుని ఒకసారి కడిగి ఆపై తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
- ఇవి నానేలోపు రెసిపీలోకి అవసరమైన ఇతర ఇంగ్రీడియంట్స్‌ను సిద్ధం చేసుకోవాలి.
- తాజా పాలకూరను తీసుకుని శుభ్రంగా కడిగి చివర్లు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ఒకటిన్నర కప్పు పరిమాణంలో పాలకూర పేస్ట్‌ను రెడీ చేసుకోవాలి.
- అలాగే, ఒక కప్పు పరిమాణంలో టమాటా గుజ్జును ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. అర కప్పు పరిమాణంలో ఉల్లిపాయలను తరిగి పెట్టుకోవాలి.
గోరుచిక్కుడుతో రుచికరమైన "పచ్చడి" - వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే ఆహాఁ!

- ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని నానిన శనగలలో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
- శనగలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి నీళ్లు వంపి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కనుంచాలి.
- అనంతరం కర్రీ తయారీ కోసం స్టవ్ మీద పాన్ లేదా కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, సన్నని వెల్లుల్లి తరుగు వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ సన్నని సెగ మీద వేయించాలి.
- అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు వేసి ఆనియన్స్ కాస్త సాఫ్ట్‌గా మారేంత వరకు వేయించుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లంపచ్చిమిర్చి పేస్ట్, ముందుగా రెడీ చేసుకున్న టమాటా గుజ్జు వేసి కలిపి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి.

- టమాటా గుజ్జు మగ్గుతున్న క్రమంలో పాలకూర పేస్ట్, పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, చోలే మసాలా, గరంమసాలా, జీలకర్ర పొడి వేసుకుని అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఆపై లో ఫ్లేమ్‌లో మసాలాల్లో ఉన్న పచ్చిదనం పోయేలా కాసేపు కలుపుతూ ఉడికించాలి.
- ఆ మిశ్రమం ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు, పావుకప్పు వాటర్ యాడ్ చేసి అంతా మంచిగా కలిసేలా కలపాలి.
- తర్వాత లో టూ మీడియం ఫ్లేమ్‌లో కర్రీ దగ్గర పడి లైట్ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, సరికొత్త రుచిలో నోరూరించే "చనా పాలక్ చోలే మసాలా కర్రీ" రెడీ అవుతుంది!

చీరాల ఫేమస్ "కట్ మిర్చీ బజ్జీ చాట్" - తక్కువ నూనెతో కరకరలాడుతూ అద్దిరిపోతుంది!

