How to Make Carrot Rava Laddu: క్యారెట్ - కంటి ఆరోగ్యాన్ని కాపాడటం సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇందులోని పోషకాలు అందిస్తాయి. అయితే, ఇది ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కొంత మంది తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికోసం ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే "క్యారెట్ రవ్వ లడ్డు". సూపర్ టేస్టీగా ఉండే ఈ లడ్డూలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పైగా ఇందులో పంచదార ఉండదు కావున హ్యాపీగా తినొచ్చు. అంతేకాకుండా దీనికి పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. పైగా ఈ లడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ రవ్వ లడ్డూలకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- బొంబాయి రవ్వ - 1 కప్పు
- నెయ్యి - తగినంత
- జీడిపప్పు - 10
- బాదం - 5
- క్యారెట్ తురుము - అర కప్పు
- బెల్లం తురుము - ముప్పావు కప్పు
- యాలకుల పొడి - 1 టీ స్పూన్
తయారీ విధానం:
- ఓ బౌల్లోకి బొంబాయి రవ్వ వేసుకోవాలి. పాలు లేదా నీళ్లను కొద్దికొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుతూ ముద్దలాగా చేసుకోవాలి.
- ఆ తర్వాత ఓ ప్లేట్‌ను బోర్లించి నెయ్యి రాసుకోవాలి. ఆపై రవ్వ ముద్దను దాని మీద పెట్టి మందంగా, వెడల్పుగా వత్తుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టి వత్తుకున్న రవ్వ చపాతీని వేసుకోవాలి. రెండు వైపులా ఈ చపాతీని కాల్చుకుని స్టవ్ ఆఫ్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి.
- మరోసారి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అందులో జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టాలి.
- అదే నెయ్యిలో సన్నగా తురిమిన క్యారెట్‌ను వేసుకుని ఓ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకుని మరో రెండు నిమిషాలు వేయించి ఓ బౌల్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు ఆ గిన్నెలోకి బెల్లం తురుము, యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు, బాదం పలుకులు వేసి కలపాలి.
- ఆ తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని గట్టిగా లడ్డూలుగా చుట్టాలి.
- ఇలా మిశ్రమం మొత్తాన్ని లడ్డూలుగా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన, మరెంతో ఆరోగ్యకరమైన క్యారెట్ రవ్వ లడ్డూ రెడీ. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు.
సూపర్ టేస్టీగా ఉండే "గాజర్ హల్వా" - ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరంతే!