Cabbage Pancake Recipe : చాలా మందికి క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం ఉండదు. ముఖ్యంగా పిల్లలైతే ఈ కూర పేరు చెబితే చాలు ముఖం చిట్లిస్తుంటారు. ఉప్పు, కారం, మసాలాలు చక్కగా వేసినా వండినా తినరు. ఎందుకంటే ఈ కూరగాయ ఓ రకమైన వాసన రావడమే దీనికి ప్రధాన కారణం! మరి మీ పిల్లలు కూడా క్యాబేజీని తినడానికి అయిష్టత చూపిస్తున్నారా? అయితే ఓసారి ఇలా పాన్‌కేక్స్ చేయండి. టేస్ట్ అద్దిరిపోతాయి. క్యాబేజీ వదన్న పిల్లలే ఈ రెసిపీకి ఫేవరెట్ అయిపోతారు. ప్రిపేర్ చేసుకోవడం కూడా వెరీ ఈజీ. మరి ఇక ఆలస్యం చేయకుండా క్యాబేజీ పాన్‌కేక్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ? ప్రిపరేషన్‌పై ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు:
- క్యాబేజీ తురుము - 2 కప్పులు
- క్యారెట్ - 1
- ఉల్లిపాయ - 1
- స్ప్రింగ్ ఆనియన్స్ - కొద్దిగా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
- మిరియాల పొడి - అర టీ స్పూన్
- శనగపిండి - 1 కప్పు
- బియ్యప్పిండి - 1 కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు టీ స్పూన్
- వాటర్ - 1 కప్పు
- నూనె - తగినంత

తయారీ విధానం:
- క్యాబేజీని సన్నగా తురుముకోవాలి. అలాగే క్యారెట్‌ను కడిగి పై తొక్క తీసేసి తురమాలి. స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన ఉంచాలి.
- ఓ మిక్సింగ్ బౌల్లోకి క్యాబేజీ, క్యారెట్ తురుము, ఉల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత శనగపిండి, బియ్యప్పిండి వేసి క్యాబేజీ మిశ్రమానికి పట్టేలా బాగా కలపాలి.
- అనంతరం కప్పు వాటర్‌ను కొద్దికొద్దిగా పోసుకుంటూ మసాలాలు మొత్తం క్యాబేజీ మిశ్రమానికి కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి తాలింపు పెట్టడానికి ఉపయోగించే చిన్న పాన్ లేదా దోశ పెనం పెట్టి లైట్‌గా నూనె అప్లై చేసుకోవాలి.
- నూనె కాగిన తర్వాత పిండిని గరిటెతో పోసుకుని సమానంగా స్ప్రెడ్ చేయాలి. తాలింపు పెట్టే పాన్ వాడితే ఒకటి, దోశ పెనం మీద అయితే రెండు పాన్‌కేక్స్ కోసం పిండి వేసుకోవచ్చు.
- మీడియం ఫ్లేమ్‌లో ఓ వైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా, క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇలా పిండి మొత్తాన్ని పాన్కేక్స్గా ప్రిపేర్ చేసుకుని వేడివేడి సర్వ్ చేసుకుని గ్రీన్ చట్నీ లేదా టమాట సాస్‌తో తింటే అద్దిరిపోతుంది.
టిప్స్:
- కావాలంటే ఇతర కూరగాయల ముక్కలు కూడా వేసుకోవచ్చు.
- పిండిలో కప్పుకంటే నీళ్లు ఎక్కువ అవసరం పడవు. ఎందుకంటే మిశ్రమం పల్చగా అయితే పాన్ కేక్స్ టేస్టీగా రావు.

ఆహా అనిపించే "క్యాబేజీ బూందీ ఫ్రై" - ఇలా చేస్తే వద్దన్నవారే లొట్టలేసుకుంటూ తింటారు!
వెడ్డింగ్ స్టైల్ క్యాబేజీ 65 - ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే సూపర్ క్రిస్పీ అండ్ టేస్ట్ గ్యారెంటీ!