Ragi Bobbatlu Making Process : బొబ్బట్ల పేరు చెప్పగానే చాలా మందికి నోరూరిపోతుంది. వీటినే భక్ష్యాలు, ఒబ్బట్టు, పూరన్‌పోలీ, పోలె అంటూ ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా పిలుస్తుంటారు. మెజార్టీ పీపుల్ వీటిని పండగలు, పూజలు, ప్రత్యేక వేడుకల సమయంలో ప్రిపేర్ చేసుకుంటుంటారు. అందులోనూ తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చిందంటే పచ్చడితో పాటు ఇవి ఉండాల్సిందే.
అయితే, ఈ బొబ్బట్లను శనగపప్పు, పెసరపప్పు, సేమియా ఇలా రకరకాల స్టఫింగ్స్తో తయారు చేసుకుంటుంటారు. కానీ, ఈ పండక్కి ఎప్పుడూ చేసేలా కాకుండా రాగి పిండి స్టఫింగ్తో మైదా వాడకుండా "సరికొత్త రుచిలో బొబ్బట్లను" ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఆరోగ్యకరమైనవి మాత్రమే కాకుండా మామూలు బొబ్బట్ల కంటే కూడా చాలా రుచికరంగా ఉంటాయి. పైగా వీటిని చేసుకోవడం కూడా సులువే. ఇంతకీ, ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ టిప్స్‌తో మరింత రుచికరం :
- స్టఫింగ్ కోసం రాగిపిండి మిశ్రమం జారుడుగా ఉండకుండా కాస్త గట్టిగానే ఉండేలా చూసుకోవాలి.
- బొబ్బట్లు చేసుకునేటప్పుడు, కాల్చుకునేటప్పుడు మీ ఇష్టానికి అనుగుణంగా నూనె లేదా నెయ్యి రాసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు.
- స్టఫింగ్ బయటకు రాకుండా ఉండాలంటే, అంచులను చక్కగా మూయాలి.
- ఇక్కడ మీరు బటర్ పేపర్ మీద కాకుండా అరటి ఆకుపై కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
- భక్ష్యాలు సాఫ్ట్‌గా ఉండాలంటే స్టౌను మీడియం టూ హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- గోధుమ పిండి - 1 కప్పు
- ఉప్పు - కొద్దిగా
- పసుపు - చిటికెడు
- నూనె - 3 టేబుల్‌స్పూన్
- బెల్లం - 1 కప్పు
- నెయ్యి - 3 టేబుల్‌స్పూన్లు
- రాగి పిండి - 1 కప్పు
- సన్నని పచ్చికొబ్బరి తురుము - అర కప్పు
- యాలకుల పొడి - పావుటీస్పూన్
మామిడి పండ్లతో నోరూరించే బొబ్బట్లు - రుచి అద్దిరిపోతుంది! ప్రిపరేషన్ వెరీ ఈజీ!

రాగి బొబ్బట్లు చేసుకోండిలా :
- ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమపిండిని తీసుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలపాలి. అనంతరం కొద్దికొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని స్టిక్కీగా కలుపుకోవాలి.
- పిండిని జిగురు వచ్చేలా బాగా కలిపాక 1 టేబుల్‌స్పూన్ నూనె వేసి మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మరో 2 టేబుల్స్పూన్ల నూనె వేసుకొని పిండిని చేతికి, బౌల్‌కి అంటుకోకుండా కలుపుకొని మూతపెట్టి అరగంటపాటు పక్కనుంచాలి.
- ఈలోపు స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌ మీద ఒక గిన్నెలో బెల్లం తురుము వేసుకొని రెండున్నర కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి.
- ఆపై మీడియం ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక గిన్నెను దించి పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు స్టౌ మీద మరో పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక రాగి పిండి, సన్నని పచ్చికొబ్బరి తురుము వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- అలా వేయించుకున్నాక యాలకుల పొడి, కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్‌ని వడకట్టి పోసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద మిశ్రమం కాస్త దగ్గరపడే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి.
- అప్పుడు ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మిశ్రమం పూర్తిగా దగ్గరపడే వరకు కలుపుతూ మరికాసేపు ఉడికించుకోవాలి.
- ఆపై స్టౌ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. పిండి పూర్తిగా చల్లారాక కావాల్సిన పరిమాణంలో తీసుకొని మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కనుంచాలి.

- ఇప్పుడు అరగంట పాటు పక్కనుంచిన పిండిముద్దని తీసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి.
- అనంతరం కొద్దికొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఆ తర్వాత బటర్ పేపర్‌పై కాస్త నూనె లేదా నెయ్యి రాసుకొని ఒక పిండి ముద్దను ఉంచి ముందుగా చిన్న పూరి సైజ్‌లా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఆపై దానిపై ముందుగా చేసుకున్న రాగిపిండి ముద్దను ఉంచి అంచులను చక్కగా సీల్ చేసుకోవాలి.
- అనంతరం మళ్లీ నెమ్మదిగా ముందుగా చిన్న పూరీలా వత్తుకోవాలి. ఆ తర్వాత జాగ్రత్తగా చేతితో వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్ వేడయ్యాక మీరు ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టును నెమ్మదిగా వేసి ముందుగా 5 నుంచి 10 సెకన్ల పాటు రెండు వైపులా కాల్చుకోవాలి.
- ఆ తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మరోసారి రెండు వైపులా చక్కగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ "రాగి బొబ్బట్లు" రెడీ!
ఉగాది స్పెషల్ "నేతి బొబ్బట్లు" - ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి - రుచి అమృతమే!
"ఉగాది నాడు ఈ రంగు దుస్తులతో, ఆ గుడిని దర్శిస్తే - ఏడాది మొత్తం అదృష్టమే"