Bendakaya Sambar Recipe in Telugu : చాలా మంది బంకగా, చప్పగా ఉంటుందని బెండకాయ తినడానికి అంతగా ఇష్టపడరు. ఇంకొందరు ఫ్రై మాత్రమే ఇష్టపడతారు. అయితే, ఓసారి ఇలా "బెండకాయ సాంబార్" ప్రిపేర్ చేసి పెట్టండి. వద్దన్నవారే ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. అంత రుచికరంగా ఉంటుంది ఈ చారు. మరి, సూపర్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కందిపప్పు - 1 కప్పు(180 గ్రాములు)
- నూనె - 4 టేబుల్‌స్పూన్లు
- బెండకాయలు - పావుకిలో
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 3
- పసుపు - పావు చెంచా
- టమాటా - 1
- చింతపండు - 50 గ్రాములు
- కారం - రుచికి తగినంత
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- సాంబార్ పొడి - 1 టేబుల్‌స్పూన్
- బెల్లం తురుము - 1 టేబుల్‌స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- మినప్పప్పు - 1 టీస్పూన్
- శనగపప్పు - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఇంగువ - కొద్దిగా
అద్దిరిపోయే రుచితో సాంబార్ కావాలా? - ఆ టేస్ట్ ఎప్పటికీ మారకూడదా? - ఇలా ప్రిపేర్ చేయండి!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే, ఒక చిన్న బౌల్లో చింతపండును నానబెట్టుకోవాలి.
- ఆలోపు రెసిపీలోకి కావాల్సిన బెండకాయలను శుభ్రంగా కడిగి అంగుళం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అదేవిధంగా, ఉల్లిపాయను సన్నని చీలికలుగా, పండిన టమాటాను కాస్త పెద్దని క్యూబ్స్‌గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు ప్రెషర్ తీసుకొని అందులో గంటపాటు నానిన కందిపప్పు, మూడున్నర కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి బాగా ఉడికిన పప్పును గరిటెతో మెత్తగా మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని 2 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్ మీద కాసేపు వేయించుకోవాలి. అంటే బెండకాయ ముక్కల్లోని జిగురు వదిలి కాస్త నల్లబడాలి. అప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై మరో పాన్ పెట్టుకొని 2 టేబుల్స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆపై పసుపు కూడా వేసి వేపుకోవాలి.
- ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి అవి మగ్గే వరకు ఉడికించుకోవాలి. అవి మగ్గాయనుకున్నాక వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి మరో రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
పెళ్లిలో వడ్డించే కమ్మటి స్పెషల్ సాంబార్ - ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా!
- అనంతరం నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన 250ఎంఎల్ రసం వేసి కలిపి మూతపెట్టి 4 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.
- ఉడికించుకున్నాక మూత తీసి కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి మరో నిమిషంపాటు ఉడకనివ్వాలి.
- ఆ తర్వాత మాష్ చేసి పక్కన పెట్టుకున్న కందిపప్పు, 150ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి మూతపెట్టి హై-ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి.
- పప్పు బాగా ఉడుకు పట్టాక సాంబార్ పొడి వేసుకొని కలిపి మరికాసేపు మరిగించుకోవాలి. ఆఖరున బెల్లం తురుము, కరివేపాకు వేసి కలిపి మంటను సిమ్‌లో ఉంచి సాంబార్‌ని అలా మరుగుతుండనివ్వాలి.
- ఇప్పుడు తాలింపు కోసం స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటమనిపించాలి. ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి చక్కగా వేయించుకోవాలి.
- ఆ తర్వాత వేగిన తాలింపుని మరో బర్నర్ మీద మరుగుతున్న సాంబార్లో వేసి బాగా కలిపి మూతపెట్టి ఇంకో 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఘుమఘుమలాడే "కమ్మని బెండకాయ సాంబార్" రెడీ!
నిమిషాల్లో ప్రిపేర్ అయ్యే ఆంధ్ర స్టైల్ "పప్పు చారు" - ఇలా చేస్తే తినడమే కాదు తాగేస్తారు కూడా!