Best Recipe for Instead of Tamarind : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా పొట్టను వ్యాధుల పుట్టగా మారుస్తున్నాం. అడ్డు అదుపు లేకుండా తినడం కారణంగా వయసుతో సంబంధం లేకుండా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు సర్వ సాధారణమైపోయాయి. అందులోనూ ముఖ్యంగా ఆఫీసులో పని చేసే వాళ్ల దగ్గరి నుంచి ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్లు, చిన్న పిల్లల వరకు ఎక్కువ మందిని ఇబ్బందిపెడుతోన్న సమస్య గ్యాస్ ట్రబుల్. ఈ టైమ్‌లోనే చాలా మంది గ్యాస్‌ని ప్రేరేపించే పులుపు ఆహారాలను పక్కన పెడుతున్నారు. అందులో "చింతపండు" కూడా ఒకటి.
అయితే, కూరలు, సాంబార్, రసం వంటి చేసుకునేటప్పుడు అందులో కొద్దిగైనా చింతపండు ఉండాల్సిందే. లేదంటే వంటకాలకు సరైన టేస్ట్ రాదనే భావనలో ఉంటారు. ఈ టైమ్‌లోనే చాలా మంది చింతపండుకి బదులుగా మరేదైనా మంచి ప్రత్యామ్నాయం ఉంటే బాగుండు అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు తమ ఆలోచనను నిజం చేసుకునే గొప్ప రెసిపీ ఉంది. అది కూడా వేసవిలో దొరికే పచ్చిమామిడికాయలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది! దీన్ని చింతపండుకి బదులుగా సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. మరి, అదెంటో ఇప్పుడు చూద్దాం.
చింతపండు లేకుండా ఘుమఘుమలాడే "చేపల పులుసు'' - ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్ వేరే లెవెల్!
తీసుకోవాల్సిన పదార్థాలు :
- పచ్చిమామిడి కాయలు - 3
- జిప్ లాకర్ బ్యాగ్స్ - తగినన్ని

తయారీ విధానమిలా :
- ఇందుకోసం ముందుగా పచ్చిమామిడికాయలను శుభ్రంగా కడిగి, వాటిపై చెక్కును పీలర్ సహాయంతో తొలగించుకోవాలి.
- ఆ తర్వాత ఒక ప్లేట్లో మీడియం హోల్స్ ఉన్న గ్రేటర్‌తో చెక్కు తీసిన పచ్చిమామిడికాయలను తురుముకోవాలి.
- అన్ని కాయలను తురుముకున్నాక ఆ తురుము మొత్తాన్ని జిప్ లాకర్ ప్లాస్టిక్ బ్యాగ్ లేదా ఎయిర్ టైటెడ్ డబ్బాలో వేసుకోవాలి.
- ఇక్కడ మీకు పేస్ట్‌లా చేసుకోవచ్చు కదా అనే ఆలోచన రావొచ్చు. కానీ, దీన్ని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాం కాబట్టి పేస్ట్ చేసినదైతే రాయిలా అయిపోయి యూజ్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా అవుతుంది.
- అదే, ఇలా తురుములా స్టోర్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకున్నప్పుడు ముక్కల్లాగా చక్కగా కట్ అవుతుంది.
- మామిడి తురుమును జిప్ లాకర్ బ్యాగుల్లో చక్కగా ఫిల్ చేసుకున్నాక, మొత్తం సమానంగా స్ప్రెడ్ అయ్యేలా చదునుగా చేసుకోవాలి.
- ఆ తర్వాత జిప్ లాక్ చేసి బ్యాగు లేదా కవర్ మీద మీకు కావాల్సిన పరిమాణంలో చాకు వెనుకవైపు భాగంతో గుర్తులు పెట్టుకోవాలి.
- అంటే, మీకు ఒక కూరకు ఎంత పులుపు సరిపోతుందో దాన్ని బట్టి కావాల్సిన సైజులో గుర్తులు పెట్టుకోవాలి.

- అలా పెట్టుకున్న తర్వాత ఆ బ్యాగులను డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఒక రోజు తర్వాత వాటిని బయటకు తీసి చూస్తే ఐస్‌గడ్డలా అయిపోతాయి. కాబట్టి, ఇవి దాదాపు తొమ్మిది నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి!
- రిఫ్రిజిరేటర్లో నుంచి బయటకు తీశాక మీకు కావాల్సిన సైజ్‌లో ముక్కను తీసుకొని మిగిలింది నార్మల్ టెంపరేచర్‌కి రాకముందే ఐస్ గడ్డలా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
- ఇక చింతపండు వాడడం ఇష్టం లేని వాళ్లకు సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ మామిడి తురుము స్టోరేజ్ ఎంతగానో సహాయపడుతుంది! అంతేకాదు, దీన్ని వాడడం ద్వారా కూరలకు మంచి టేస్ట్ కూడా వస్తుంది.

ఈ టిప్స్ తెలుసుకోవాలి :
- ఈ రెసిపీ కోసం కాస్త పుల్లగా ఉండే పచ్చిమామిడి కాయలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
- అదేవిధంగా, మరీ ఎక్కువగా రసాలూరే మామిడికాయలు కాకుండా కొంచెం, గట్టిగా పుల్లగా ఉండేవి మాత్రమే వాడుకోవాలి. లేదంటే మనం తురిమేటప్పుడే నీళ్లు వచ్చేసి స్టోర్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని గమనించాలి.
కందిపప్పు, చింతపండు లేకుండానే "హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్" - ఈ కొలతలతో చేస్తే కిర్రాక్ టేస్ట్!
చింతపండు లేకుండానే అద్దిరిపోయే "చారు" - గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి సూపర్ ఛాయిస్!