TOUR PLAN : ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్లలేక సతమతమవుతున్న తరుణంలో చల్లని ప్రాంతాలను వెళ్లేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు రావడంతో ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో ఊటీ, మున్నార్ ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. రెండు, మూడు కుటుంబాలు కలిసి ప్యాకేజీలు, కార్లు, సొంత వాహనాలతో వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
"వేసవిలో చల్లచల్లగా" - కేరళ, ఊటీ, అరకు - IRCTC ఐదు టూర్ ప్యాకేజీలు

వేసవి సెలవుల్లో హాయిగా గడిపేందుకు దగ్గర్లోని చల్లని ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఐదు రోజులు లేదంటే వారం మొత్తం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా IRCTC, పర్యాటక శాఖతో పాలు పలు ప్రైవేటు సంస్థలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఊటీ, కేరళ, కొడైకెనాల్, మున్నార్‌లో వేసవిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. వీటితో పాటు కూర్గ్, మహాబలేశ్వర్, ఉత్తర భారత దేశంలోని హిమాలయ పర్వత ప్రాంతాలైన సిమ్లా, మనాలీ, ముస్సోరి, డార్జిలింగ్ తదితర ప్రదేశాలకు వెళ్లేందుకు నగర వాసులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు పర్యాటక సంస్థలు వెల్లడిస్తున్నాయి. పాఠశాలలకు రెండు రోజుల్లో వేసవి సెలవులు ప్రకటించనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలను చుట్టిరావడానికి నగరంలోని పర్యాటక సంస్థల కార్యాలయాలను సంప్రదిస్తున్నారు.

నాలుగైదు రోజుల టూర్
వేసవి పర్యాటకంలో ఎక్కువ మంది ఊటీ, కేరళ ప్రాంతాలపై ఆరా తీస్తున్నట్లు పర్యాటక సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఎక్కువ మంది నాలుగైదు రోజుల ప్యాకేజీలకు ప్రాధాన్యం ఇస్తుండగా మరికొందరు వారం రోజులు గడిపిరావడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకొందరు సెల్ఫ్ డ్రైవ్ కార్లు, సొంత, అద్దె వాహనాల్లో వెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా మైసూర్, ఊటీ, కూర్గ్ వెళ్తున్న పర్యాటకులు అటవీ అందాలతో పాటు కేరళలో మున్నార్‌పై ఆసక్తి చూపుతున్నారు.

ఇలా వెళ్లొచ్చు!
- వేసవి సెలవుల్లో హిల్‌స్టేషన్లకు వెళ్లాలనుకుంటున్న వారికి పర్యాటక సంస్థలు వివిధ సూచనలు చేస్తున్నాయి.
- తెలంగాణ పర్యాటక సంస్థ బెంగళూరు, మైసూరు, ఊటీ వెళ్లి రావడానికి ఆరు రోజుల ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీ వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి ఉండేలా రూపొందించింది.
- హైదరాబాద్, బెంగళూరు, మైసూరు నుంచి ప్రైవేటు పర్యాటక సంస్థలు ప్యాకేజీలను నిర్వహిస్తున్నాయి.
- సొంత వాహనంలో ఊటీకి వెళ్లాలనుకుంటున్నట్లయితే ముందుగా తమిళనాడు టూరిజం సంస్థ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ముందస్తుగా పాస్ తీసుకుంటేనే అనుమతి ఉంటుందని తెలుసుకోవాలి.
- వేసవి రద్దీ నేపథ్యంలో ఎక్కువ మంది ఊటీకి వస్తుంటారు. ఈ నేపథ్యంలో వసతికి ఇబ్బంది పడకుండా ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మంచిది.
- బస్సులు, రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు రానుపోను ముందస్తు రిజర్వేషన్ చేసుకోవడం బెటర్.
- పర్యటక ప్రాంతాలు, వాటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక వెబ్‌సైట్‌లలో పరిశీలించుకుని ప్రణాళిక రూపొందించుకోవాలి.
- ముందుగా వెళ్లి వచ్చినవారు ఉంటే వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం అన్ని విషయాల్లో మంచిది.
"ఈ వేసవి చల్లచల్లగా గడిచేలా IRCTC టూర్ ప్లాన్" - విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లు
తిరుపతిలో శ్రీవారి దర్శనం కావాలా? - IRCTC స్పెషల్ ప్యాకేజీ - గదులు సైతం!