పల్లీలు, కొబ్బరి, చింతపండు లేకుండానే సూపర్ "చట్నీ" - 10 నిమిషాల్లో రెడీ - టిఫెన్స్లోకి అదుర్స్!
-ఈ స్టైల్లో "చట్నీ" చేసుకోండి - పర్ఫెక్ట్ టేస్ట్‌తో అదుర్స్ అనిపిస్తుంది!

Published : June 3, 2025 at 1:10 PM IST
Best Chutney for Breakfast: టిఫెన్ ఏదైనా అందులోకి పల్లీ చట్నీ ఉండాల్సిందే. నచ్చిన టిఫెన్‌ను రుచికరమైన చట్నీలో ముంచుకుని తింటుంటే ఆ ఫీలింగ్ వేరే లెవల్. అయితే ఈ చట్నీలో మెయిన్ పదార్థం పల్లీలు. మరికొందరు పల్లీ, కొబ్బరి కాంబినేషన్‌తో కూడా చేస్తుంటారు. అయితే ఈ రెండూ కొందరి ఒంటికి పడవు. ఈ క్రమంలోనే టమాటా, మామిడికాయ పచ్చడితో కానిచ్చేస్తుంటారు. అయితే ఇకపై వాటితో పనిలేకుండా చాలా సింపుల్‌గా చట్నీ చేసుకోవచ్చు. దీని రుచి చాలా బాగుంటుంది. టిఫెన్ ఏదైనా ఈ చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ మదురై తన్నీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- నూనె - 2 టీస్పూన్లు
- ఉల్లిపాయలు - 2
- వెల్లుల్లి రెబ్బలు - 6
- పచ్చిమిర్చి - 10
- పుట్నాల పప్పు - అర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం:
- నూనె - 1 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - అర టీస్పూన్
- మినప్పప్పు - అర టీస్పూన్
- ఎండుమిర్చి - 1
- కరివేపాకు - 2 రెమ్మలు
- చిన్న ఉల్లిపాయ - 1

తయారీ విధానం:
- ఉల్లిపాయను మీడియం సైజ్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి.
- ఆయిల్ హీటెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ మగ్గించుకోవాలి.
- ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- మిక్సీజార్‌లోకి ఉల్లిపాయ మిశ్రమం, పుట్నాల పప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఓసారి గ్రైండ్ చేసుకోవాలి.

- ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఈ చట్నీ కోసం తాలింపు ప్రిపేర్ చేయాలి.
- అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
- అనంతరం ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.

- ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత గ్రైండ్ చేసిన చట్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూడు గ్లాసుల వాటర్‌ను కొద్దికొద్దిగా పోసుకుంటూ బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఈ చట్నీని నచ్చిన టిఫెన్‌తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంది. నచ్చితే మీరూ ఓసారి మదురై తన్నీ చట్నీ రెడీ చేసుకోండి.

చిట్కాలు:
- ఈ చట్నీ కోసం ఉపయోగించే ఉల్లిపాయలు కాస్త మెత్తబడితే సరిపోతుంది. రంగు మారే వరకు వేయించుకుంటే చట్నీ రుచి మారుతుంది.
- ఈ పచ్చడి కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ మీకు పల్చగా వద్దనుకుంటే నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదు.

కాల్చిన పచ్చిమామిడితో నోరూరించే "రోటి పచ్చడి" - ఇలా చేస్తే అన్నం ఓ ముద్ద ఎక్కువే తింటారు!

