How to Make Hotel Style Bendakaya Fry : బెండకాయ ఫ్రైని కొద్ది మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా క్యాటరింగ్ స్టైల్లో చేసే ఈ రెసిపీకి ఫ్యాన్స్ ఎక్కువే. అయితే అదే పద్ధతిలో ఇంట్లో బెండకాయ వేపుడు ఎంత బాగా ప్రిపేర్ చేసినా క్రిస్పీగా, టేస్టీగా రావట్లేదని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఓసారి ఈ స్టైల్లో "బెండకాయ ఫ్రైని" చేసుకొని చూడండి. కిర్రాక్ టేస్ట్‌తో కరకరలాడుతూ క్రిస్పీగా వస్తోంది. ఈ రెసిపీ పప్పుచారు, సాంబార్, పెరుగు వంటి వాటిల్లోకి నంజుకోవడానికి సైడ్ డిష్‌గా సూపర్‌గా ఉంటుంది. పిల్లలైతే ఈ స్టైల్ బెండకాయ ఫ్రైని ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడూ ఇలాగే చేసి పెట్టమంటారు. మరి, కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే ఈ బెండకాయ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

టిప్స్ :
- బెండకాయ ముక్కలను కట్ చేసిన తర్వాత గాలికి ఆరబెట్టడం ద్వారా వేగడానికి ఎక్కువ టైమ్ పట్టకుండా ఉండడంతో పాటు వేయించాక ముక్కలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి.
- బెండకాయ ముక్కలను హై ఫ్లేమ్‌లో కాకుండా లో ఫ్లేమ్‌లో వేయించినట్లయితే ముక్కలు మెత్తగా మగ్గిపోయి క్రిస్పీగా రాకుండా వేపుడు అంత సాఫ్ట్‌గా అయిపోతుందని గుర్తుంచుకోవాలి.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- బెండకాయలు - అరకేజీ
- నూనె - డీప్ ఫ్రైకి తగినంత
- పల్లీలు - గుప్పెడు
- పచ్చిశనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్
- పొట్టు మినపప్పు - ఒక టేబుల్‌స్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- ఎండుమిర్చి - రెండు నుంచి మూడు
- జీలకర్ర - పావుటీస్పూన్
- పచ్చిమిర్చి - ఐదారు(మీ కారానికి తగనన్ని)
- ఇంగువ - పావుటీస్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- కారం - పావుటీస్పూన్
- పసుపు - పావుటీస్పూన్
- ధనియాల పొడి - ఒక టీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - పావుటీస్పూన్
వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!

తయారీ విధానం :
- ఈ క్రిస్పీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై కోసం ముందుగా తాజా లేత బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడగాలి.
- ఆ తర్వాత అస్సలు నీళ్ల తడి లేకుండా ఒక శుభ్రమైన క్లాత్‌తో తుడవాలి. ఆపై తడి లేకుండా తుడుచుకున్న బెండకాయలను ముందుగా రెండు చివర్లు కట్ చేసి మీడియం సైజ్‌లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని రెండు మూడు గంటల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక గాలికి ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి హై ఫ్లేమ్‌లో వేయించుకోవాలి.
- అలా వేయించేటప్పుడు బెండకాయలను గరిటెతో వత్తకుండా పైపైన మాత్రమే కదుపుతూ 8 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి.
- బెండకాయ క్రిస్పీగా వేగిన తర్వాత అస్సలు నూనె రాకుండా జాలి గరిటెలోకి తీసుకొని కాసేపు ఉంచి తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకోవాలి.

- ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో తాలింపు కోసం బెండకాయలను వేయించగా మిగిలిన నూనెలో తగినంత ఆయిల్‌ని ఉంచి వేడి చేసుకోవాలి. మిగతాది ఒక గిన్నెలోకి తీసుకొని దాచుకోవాలి.
- నూనె వేడయ్యాక అందులో పల్లీలను వేసి వేయించాలి. అవి సగం వరకు వేగాక శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని వాటిలో పచ్చిదనం పోయి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి.
- తర్వాత అందులో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి ఒకసారి చక్కగా కలపాలి.
- ఆపై రుచికి తగినత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుతూ తాలింపుని మంచిగా వేయించుకోవాలి.
- తాలింపు చక్కగా వేగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి ఆ మిశ్రమం మొత్తం ముక్కలు పట్టేలా మీడియం ఫ్లేమ్‌లో రెండుమూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
- బెండకాయ ముక్కలకు ఆ మిశ్రమం చక్కగా పట్టి, అవి మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ హోటల్ స్టైల్ "బెండకాయ వేపుడు" రెడీ!
దొండకాయ, బెండకాయ - ఈ "పెరుగు పచ్చడి" మీ గుండెకాయ - మండే ఎండల్లో అత్యంత చల్లని రెసిపీ!
తయారు చేస్తుంటేనే నోరూరిపోయే "గోంగూర కారం పొడి" - అందరూ లొట్టలేసుకుంటూ తింటారు! - 6 నెలలు నిల్వ!