Make Delicious Bendakaya Egg Fry at Home : మనందరం ఎగ్ ఫ్రై అనగానే ఉల్లిపాయల కట్ చేసి అందులో గుడ్లు కొట్టి కారం, ఉప్పు, ఇతర ఇంగ్రీడియంట్స్ వేసుకొని సింపుల్‌గా చేసుకొని తింటుంటాం. కానీ, ఎప్పుడూ ఒకేలా తింటే ఏం మజా ఉంటుంది. అందుకే, మీకోసం ఈసారి వెరైటీగా ఒక స్పెషల్ వంటకం తీసుకొచ్చాం. అదే, "బెండకాయ కోడిగుడ్డు ఫ్రై". అబ్బే జిగురు జిగురుగా ఉండే బెండకాయతో ఎగ్ ఫ్రై అనుకుంటున్నారా? కానీ, జిగురు లేకుండా పొడి పొడిగా బెండకాయ నచ్చని వాళ్లూ ఇలా ఎగ్ ఫ్రై చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. అంత కమ్మగా ఉంటుంది ఈ కర్రీ. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నం, చపాతీల్లోకి ఇది డెడ్లీ కాంబినేషన్‌గా నిలుస్తుంది. మరి, ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ టిప్స్‌తో పర్ఫెక్ట్ టేస్ట్ :
- ఈ రెసిపీ కోసం లేత బెండకాయలను తీసుకోవాలి.
- బెండకాయలు జిగురు లేకుండా పొడిపొడిగా ఉండాలంటే కర్రీ చేసుకోవడానికి ముందుగా పాన్‌లో ఆయిల్ వేయకుండా హై-ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాలపాటు వేయించి పక్కకు తీసుకోవాలి.
- బెండకాయలను వేయించుకునేటప్పుడు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎందుకంటే మాడిపోతే కర్రీ టేస్ట్ మారిపోతుందని గుర్తుంచుకోవాలి.
- పల్లీలు, జీడిపప్పులతో కలిపి ప్రిపేర్ చేసుకున్న కారం పొడి ఈ కర్రీకి సరికొత్త రుచిని తీసుకొస్తుంది.
తీసుకోవాల్సిన పదార్థాలు :
కారం పొడి కోసం :
- పల్లీలు - 3 టేబుల్‌స్పూన్లు
- జీడిపప్పు పలుకులు - 2 టేబుల్‌స్పూన్లు
- కరివేపాకు - కొద్దిగా
- కారం - 2 టీస్పూన్లు (రుచికి తగినంత)
- జీలకర్ర - ఒక టీస్పూన్

కర్రీ కోసం :
- బెండకాయలు - పావుకిలో
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర- అరటీస్పూన్
- పచ్చిమిర్చి - ఐదారు
- చిన్న వెల్లుల్లి పాయ - ఒకటి
- పెద్ద ఉల్లిపాయ - ఒకటి
- పసుపు -అరటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- గుడ్లు - మూడు
- ధనియాల పొడి - అరటీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
"వడలు" ఇలా చేస్తే - పిండిని మిక్సీలో రుబ్బినా నూనె పీల్చవు! - బూరెల్లా పొంగుతాయి!
తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్రత్యేకమైన కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని పల్లీలను వేసి కాసేపు వేయించాలి.
- పల్లీలు సగం వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు, కరివేపాకు వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి.
- అవి చక్కగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని కాస్త చల్లార్చుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన పల్లీల మిశ్రమం, కారం, జీలకర్ర వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని పక్కనుంచాలి.

- అనంతరం కర్రీకి కావాల్సిన బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. ఆపై రెండు చివర్లు కట్ చేసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు బెండకాయ ముక్కలు జిగురు లేకుండా పొడిపొడిగా ఉండడానికి స్టవ్ మీద పల్లీలు వేయించుకున్న పాన్‌లో ఆయిల్ వేయకుండా బెండకాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించి పక్కకు తీసుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటమనిపించాలి.
- ఆపై అందులో సన్నని పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
- అవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
- అలా వేయించుకున్నాక ఆ మిశ్రమంలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి హై-ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి.
- బెండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయి వాటిలో నుంచి జిగురు రాదు అనిపించినప్పుడు స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి అందులో పసుపు, ఉప్పు వేసి కలిపి కాసేపు వేయించాలి.
- ఈ స్టేజ్‌లో ఒక చిన్న బెండకాయ ముక్కను నోట్లో వేసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే బెండకాయ ముక్కలు 80% వరకు ఉడికితే సరిపోతుంది.
- అలా ఉడికాయనుకున్నాక బెండకాయ ముక్కలను పాన్ మధ్యలో గ్యాప్ ఉండేలా అంచుల చుట్టూ అనుకోవాలి.
- ఇప్పుడు ఆ గ్యాప్‌లో 1 టీస్పూన్ ఆయిల్ వేసి, కోడిగుడ్లను పగులకొట్టి పోసుకోవాలి. ఆపై వెంటనే కదపకుండా కాసేపు సన్నని సెగ మీద ఉడకనివ్వాలి.
- ఎగ్స్ కాసేపు కుక్ అయ్యాక బెండకాయ ముక్కలతో కలపకుండా గరిటెతో పొడిపొడిగా చేసుకోవాలి.
- ఆపై ఎగ్ పొరటు, బెండకాయ ముక్కలు కలిసేలా కలుపుకోవాలి. అనంతరం మిశ్రమంపై ధనియాల పొడి చల్లుకొని మరోసారి బాగా చక్కగా కలపాలి.
- ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల కారం పొడి వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
- ఇక చివరగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే రుచికరమైన "బెండకాయ ఎగ్ ఫ్రై" మీ ముందు ఉంటుంది!
- మరి, నచ్చితే మీరు ఓసారి ఇలా కోడిగుడ్డు బెండకాయ ఫ్రై ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ టేస్ట్‌కి ఫిదా అయిపోతారు!
పదే పది నిమిషాల్లో "బెండకాయ రోటి పచ్చడి" - తాళింపు అవసరమే లేదు! - టేస్ట్ నెక్ట్స్ లెవల్!
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "పొంగలి" - ఈజీగా కుక్కర్లో చేసుకోండిలా!