బ్యాచిలర్స్ స్పెషల్ కమ్మని "టమాటా కర్రీ" - అల్లంవెల్లుల్లి పేస్ట్, మసాలాలు వేయకుండానే అద్భుతమైన రుచి!
ఇంట్లో వారందరూ ఇష్టంగా తినే 'టమాటా కూర' - అన్నంతో పాటు చపాతీల్లోకి అద్దిరిపోతుంది!

Published : July 24, 2025 at 10:00 AM IST
Bachelors Special Tomato Curry Making : ఇంట్లో ఇతర కూరగాయలేమి లేకున్నా టమాటాలు మాత్రం తప్పనిసరిగా ఉంటుంటాయి. అలాంటి టైమ్‌లో చాలా మంది వాటితోనే త్వరగా అయిపోతుందని ఒకట్రెండు ఉల్లిపాయతో కలిపి కర్రీ వండేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు కర్రీ తియ్యగా ఉండడమో, సరైన టేస్ట్ రాకపోవడమో జరుగుతుంటుంది. అలాంటి వారు ఓసారి బ్యాచిలర్స్ స్టైల్లో "టమాటా కర్రీని" ప్రిపేర్ చేసుకొని చూడండి. అల్లంవెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఎలాంటి మసాలాలు అవసరం లేకుండా బ్యాచిలర్స్ చేసుకునే ఈ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైమ్‌లో ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంతో పాటు చపాతీ, రోటీల్లోకి కూడా మంచి రుచికరంగా ఉంటుంది. టమాటా తినని వాళ్లూ ఇలా కర్రీ చేస్తే వద్దనకుండా ఇష్టంగా తినేస్తారు! మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అవసరమైన పదార్థాలు :
- మీడియం సైజ్ టమాటాలు - పది
- తగినంత - నూనె
- ఒక చిన్న చెంచా - ఆవాలు
- అరటీస్పూన్ - జీలకర్ర
- ఒక టేబుల్‌స్పూన్ - శనగపప్పు
- ఒక టీస్పూన్ - మినపప్పు
- ఐదారు - పచ్చిమిర్చి
- మూడు - ఉల్లిపాయలు(మీడియం సైజ్‌వి)
- ఒక రెమ్మ - కరివేపాకు
- పసుపు - పావుటీస్పూన్
- కారం - టేస్ట్‌కి సరిపడా
- వెల్లుల్లి రెబ్బలు - 15
- కొత్తిమీర తరుగు - కొద్దిగా(ఆప్షనల్)
ఎన్నడూ చేయని నయా స్టైల్ "ఎగ్ బుర్జీ" - వేడివేడి అన్నంలో అద్భుతమే!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ తయారీ కోసం ముందుగా అందులోకి అవసరమైన టమాటాలను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని పొడువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి.
- అలాగే, ఉల్లిపాయలను పొడుగ్గా సన్నగా, పచ్చిమిర్చిలను సన్నని చీలికలుగా తరుక్కొని పక్కనుంచాలి.
- ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్‌లోనే పోపుని వేయించాలి.
- తాలింపు వేగిందనుకున్నాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ తరుగు, కరివేపాకును వేసుకొని లో టూ మీడియం ఫ్లేమ్‌లో ఆనియన్స్ కాస్త సాఫ్ట్‌గా మారేంత వరకు మగ్గించుకోవాలి.
- ఇలా ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే అందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి.
- ఆనియన్స్ మంచిగా వేగాక ఆ మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
- తర్వాత పాన్‌పై మూతపెట్టి లో టూ మీడియం ఫ్లేమ్‌లో టమాటాలు సాఫ్ట్‌గా మారేంత వరకు మధ్యమధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి.
- టమాటాలు మగ్గి కాస్త సాఫ్ట్‌గా మారాయనుకున్నాక గరిటెతో ముక్కలను కొద్దిగా మాష్ చేస్తున్నట్లు కలుపుకోవాలి. ఇలా కలపడం ద్వారా కర్రీ అనేది కాస్త గుజ్జుగా వస్తుంది.

- ఆవిధంగా కలిపిన తర్వాత అందులో పసుపు, రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకొని బాగా కలిపి లో ఫ్లేమ్‌లో టమాటాలలో నీరంతా ఇగిరిపోయి దగ్గరగా మారేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆపై అందులో లైట్‌గా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరోసారి బాగా కలిపి మూతపెట్టి నూనె సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి.
- వెల్లుల్లి పాయలను వేసుకోవడం ద్వారానే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. మీరు తీసుకునే టమాటాల పరిమాణాన్ని బట్టి తగినన్ని వేసుకోవాలి.
- అలా ఉడికించుకున్నాక చివర్లో మీ ఇష్టాన్ని బట్టి కాస్త సన్నని కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, వెల్లుల్లి ఫ్లేవర్‌తో ఘుమఘుమలాడే బ్యాచిలర్స్ స్పెషల్ "టమాటా కర్రీ" రెడీ అయిపోతుంది!
ఉల్లిపాయలతో పకోడీ రొటీన్ - ఇలా కరకరలాడే "బోండాలు" చేసుకోండి! - కమ్మగా ఉంటాయి!
చల్లటి వాతావరణంలో రెస్టారెంట్ స్టైల్ "చికెన్ సూప్" - కుక్కర్లో అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

