Bachelors Special Empty Biryani: బిర్యానీ అనగానే మెజార్టీ పీపుల్స్‌కు చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్ ఇలా నాన్‌వెజ్‌తో చేసినవి మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ వెజ్ బిర్యానీ కూడా టేస్టీగా ఉంటుంది. అయితే వెజ్ బిర్యానీ చేయాలంటే ఆలూ, బఠానీ, క్యారెట్ అంటూ ఎన్నో రకాల కూరగాయలు కావాలి. కొన్నికొన్ని సార్లు ఇంట్లో ఇవేమి ఉండవు. దీంతో నార్మల్ రైస్ పెట్టుకుని ఏదో ఒక కూరతో అడ్జస్ట్ అవుతారు. అయితే ఇకపై అలాంటి సమయంలో కూడా అద్దిరిపోయే బిర్యానీ చేసుకోవచ్చు. అదే సాదా బిర్యానీ. ఈ రెసిపీ చేసేందుకు ఎక్కువ పదార్థాలు ఏమీ అవసరం లేదు. అందరూ సాధారణంగా ఉపయోగించే ఉల్లిపాయ, టమాటాలు ఉంటే చాలు. టేస్ట్ అయితే నాన్‌వెజ్ బిర్యానీలకు మించి ఉంటుంది. మరీ ముఖ్యంగా బ్యాచిలర్స్ ఎక్కువ హైరానా పడకుండా చాలా సింపిల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- బియ్యం - మూడు గ్లాసులు(సుమారు 1కేజీ)
- టమాటాలు - 4
- ఉల్లిపాయలు - 3
- లవంగాలు - 20
- యాలకులు - 12
- దాల్చిన చెక్క - కొద్దిగా
- పచ్చిమిర్చి - 4
- పెరుగు - 1 కప్పు
- ఉప్పు- రుచికి సరిపడా
- కారం - 1 చెంచా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పుదీనా - గుప్పెడు
- ధనియాల పొడి - 1 చెంచా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు
- జీడిపప్పు - కొద్దిగా
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- నెయ్యి - 2 టీ స్పూన్లు

తయారీ విధానం:
- ఓ బౌల్లోకి బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి అరగంట సేపు నాననివ్వాలి.
- ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి పొడుగ్గా, సన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మగ్గించాలి.
- ఉల్లిపాయలు మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి ఓసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి.
- అల్లం పచ్చివాసన పోయిన తర్వాత పెరుగు వేసి కలిపి ఓ నిమిషం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన మసాలా పొడి, కారం, ఉప్పు వేసి మసాలాలు మగ్గించాలి.

- 3 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు వేసి కలపి ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి.
- టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత రైస్‌కు సరిపడా నీళ్లు పోసుకోవాలి. అంటే ఓ గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు. మొత్తంగా మూడు గ్లాసుల రైస్‌కు నాలుగున్నర గ్లాసుల వాటర్ పోసి కలిపి హై ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి.
- వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకుని కలుపుకుని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి.
- 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్‌ను మొత్తం రైస్ పీల్చుకుంటుంది. ఈ స్టేజ్‌లో గిన్నె దింపాలి. ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ పెనం పెట్టి దాని మీద దింపిన గిన్నెను ఉంచాలి. ఆపైన బరువు పెట్టి సిమ్‌లో 12 నిమిషాలు ఉడికించుకోవాలి.

- అనంతరం మూత తీసి బిర్యానీని పైకి కిందకి ఓసారి కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, జీడిపప్పులు, నెయ్యి వేసి మరోసారి కలిపి పది నిమిషాలు పక్కన ఉంచాలి. అంతే ఎటువంటి కూరగాయలు లేకుండా ఎంతో టేస్టీ అయిన సాదా బిర్యానీ రెడీ.
- దీన్ని వేడివేడిగా రైతాతో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా లంచ్ బాక్స్‌లకు పర్ఫెక్ట్. మరి లేట్ చేయకుండా మీరూ చేసుకోండి.
టిప్స్:
- ఈ బిర్యానీ కోసం బాస్మతీ రైస్ కూడా వాడుకోవచ్చు.
- ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాతే మిగిలిన ప్రాసెస్ చేయాలి. లేకపోతే బిర్యానీ అంత రుచికరంగా ఉండదు.
- ఈ బిర్యానీలో జీడిపప్పు, నెయ్యి ఆప్షనల్ మాత్రమే. వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు.

10 నిమిషాల్లో "టమాటా పచ్చడి" - రుబ్బడం, తాలింపు అవసరమే లేదు - టేస్ట్ అదుర్స్!