Anjaneya Vada Recipe: హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో హనుమాన్ జయంతి ఒకటి. ప్రతీ సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి జన్మదినాన్ని జరుపుకుంటాం. ఈ ఏడాది హనుమాన్ జన్మదినోత్సవం ఏప్రిల్ 12న శనివారం వచ్చింది. ఇక ఆ రోజున ఆంజనేయుడికి చాలా మంది తమలపాకుల దండ, వడమాల సమర్పిస్తుంటారు. వడమాల అంటే మినపప్పుతో చేసిన గారెలు. వీటినే "ఆంజనేయ వడలు" అని కూడా పిలుస్తారు. వీటిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయని భావిస్తుంటారు. ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వడమాలను భక్తులు సమర్పిస్తుంటారు.
సాధారణంగా మనం మినప్పప్పుతో చేసే వడలు ఉబ్బి సాఫ్ట్‌గా ఉంటాయి. కానీ హనుమంతుడికి నివేదించే ఈ వడలు మాత్రం కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ సమయంలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ వడలు ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- మినప్పప్పు - 1 కప్పు
- మిరియాలు - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- వెన్న - 2 టేబుల్ స్పూన్లు
- ఇంగువ - పావు టీ స్పూన్
తయారీ విధానం :
- ముందుగా ఓ బౌల్లోకి మినప్పప్పు తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి సుమారు 20 నుంచి 30 నిమిషాల వరకు నానబెట్టాలి.
- మినప్పప్పు నానిన తర్వాత కడిగి వడకట్టాలి. పూర్తిగా నీరు పోయిన తర్వాత మిక్సీజార్‌లోకి ఈ పప్పును తీసుకోవాలి.
- అందులోకి మిరియాలు, ఉప్పు, జీలకర్ర వేసి అస్సలు నీళ్లు పోయకుండా గట్టిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా రుబ్బుకున్న పిండిని ఓ బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కరిగించిన బటర్ లేదా నూనె పోసి మరోసారి కలపాలి. చివరగా ఇంగువ వేసి కలిపి ముద్దలాగా చేసుకోవాలి.
- ఇప్పుడు మినప్పప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఈలోపు ఓ కాటన్ క్లాత్‌ను తడిపి నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఓ ప్లేట్లోకి పరుచుకోవాలి. ఇప్పుడు ఓ ఉండను ఆ క్లాత్ మీద ఉంచి రౌండ్‌గా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో రంధ్రం పెట్టుకోవాలి. ఇలా ఓ రెండు చేసుకోవాలి.
- ఇలా చేసుకున్న వాటిని వెంటనే నూనెలో వేయకుండా ఓ రెండు నిమిషాలు గాలికి ఆరనిచ్చిన తర్వాత కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
- మీడియం ఫ్లేమ్‌లో రెండువైపులా ఎర్రగా కాల్చుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని వడలుగా చేసుకుని కాల్చుకోవాలి.
- అయితే మీకు క్లాత్ మీద చేయడం రాకపోతే బటర్ పేపర్ మీద లైట్‌గా నూనె అప్లై చేసి అయినా చేసుకోవచ్చు.
- ఇలా చేసుకున్న వాటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మందంగా ఉండే తెల్ల దారం తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి.
- ఈ వడలను లెక్క ప్రకారం ఆ దారంలోకి ఎక్కిస్తే ఎంతో రుచికరమైన ఆంజనేయ వడలు రెడీ.
- ఈ వడమాలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది ఇష్టంగా తినేయండి.
టిప్స్ :

- కొద్దిగా అల్లం ముక్క లేదా కరివేపాకును పిండిలో కలుపుకున్నా వడలు రుచికరంగా వస్తాయి.
- పిండిని రుబ్బేటప్పుడు నీళ్లు వేయకుండా చూసుకోవాలి.
- వడలు క్రిస్పీగా రావడానికి అవసరమైతే కొద్దిగా బియ్యప్పిండి కలుపుకోవచ్చు.
- నూనె బాగా వేడెక్కిన తర్వాతే గారెలు వేయాలి, లేదంటే అవి నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి.